హనుమ-సుగ్రీవుల సంభాషణ!!


మాతంగ ముని ఆశ్రమంలో శబరిని కలిసి తరువాత ప్రయాణమైన రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం వైపు వెళ్లారు. 


రామలక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరముల మీద నుండి సుగ్రీవుడు చూసి భయంతో గడ్డ కట్టుకుపోయాడు. నార చీరలు కట్టుకొని, కోదండాలు పట్టుకుని, అరణ్యంలోని చెట్ల వైపు చూస్తూ వస్తున్న రామలక్ష్మణులని చూసి, వాలి తనని చంపడానికని వీళ్ళని పంపాడేమోనని సుగ్రీవుడు భయపడి తన  నలుగురు వానర మంత్రుల దగ్గరికి వెళ్ళి "చూశారా, ఎవరో ఇద్దరు నార చీరలు కట్టుకున్న వీరులు వచ్చేస్తున్నారు. వారు నన్ను చంపడానికే వస్తున్నారు. రండి పారిపోదాము" అని ఆ నలుగురు వానరములతో కలిసి ఒక శిఖరం మీదనుండి మరొక శిఖరం మీదకి దూకాడు. వారు వచ్చేస్తున్నారేమో అన్న భయంతో అలా ఒక్కో శిఖరాన్ని దాటాడు. వారు అలా గెంతుతుంటే, చెట్లు విరిగిపోయాయి, ఏనుగులు, పులులు దిక్కులు పట్టి పారిపోయాయి. అలా కొంతసేపు గెంతి గెంతి, తన మంత్రులతో కలిసి ఒక చోట కూర్చున్నాడు. (సుగ్రీవుడి మంత్రులలో హనుమంతుడు ఒకడు).


అదంతా చూసిన హనుమంతుడికి సుగ్రీవుడి మీద కోపం, జాలి కలిగాయి. అప్పుడు వాక్య కోవిదుడైన హనుమంతుడు సుగ్రీవుడితో "సుగ్రీవా! ఎందుకయ్యా ఇలా శిఖరముల మీద ఎగురుతున్నావు. ఇక్కడికి వాలి రాడు కదా. వాలికి ఉన్న శాపం వలన ఈ పర్వతం మీదకి వస్తే మరణిస్తాడు. నీకు కనపడినవాడు వాలి కాదు, మరి ఎందుకీ గెంతులు, నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికే వచ్చారని అనుకొని గెంతులు వేశావు. ఏమిటయ్యా ఈ చపలత్వం, నడక చేత, అవయవముల కదలిక చేత, మాట చేత, అవతలివారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనస్సులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి, దానికి అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగల సమర్ధత ఎవడికి ఉంటుందో  వాడు రాజు అవుతాడు. అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే, నువ్వు రేపు రాచపదివి ఎలా నిర్వహిస్తావు సుగ్రీవా" అని అన్నాడు హనుమంతుడు.


అప్పుడు సుగ్రీవుడు "హనుమా! నేను ఎందుకు భయపడుతున్నానో తెలుసా. రాజులైనవారు చాలా రహస్యంగా ప్రవర్తిస్తారు. వాలికి నేను శత్రువుని కనుక, నన్ను రాజ్యం నుండి బయటకి పంపాడు కనుక, తాను ఈ కొండమీదకి రాలేడు కనుక, నన్ను సంహరించడం కోసమని తనతో సమానమైన, బలవంతులైన ఇద్దరు క్షత్రియులని ముని కుమారులలా ఇక్కడికి పంపిస్తున్నాడు. అందుకే వారు నిర్భయంగా చెట్ల వంక చూస్తూ వస్తున్నారు. వాళ్ళ చేతుల్లో కొదండాలు ఉన్నాయి. అందుకని నేను భయపడుతున్నాను. అంతగా చెబుతున్నావు కాబట్టి, హనుమా! నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఈ రూపాన్ని విడిచిపెట్టి వేరొక రూపాన్ని పొందు. ఆ రూపంతో ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళు, నా వైపుకి తిరిగి మాట్లాడు. వారు నామీద ప్రేమతో వస్తున్నారా, శత్రుత్వంతో వస్తున్నారా అన్న విషయాన్ని బాగా కనిపెట్టు. ప్రేమతో వస్తున్నవారైతే వాళ్ళని తీసుకురా, లేకపోతే మనం వేరే మార్గాన్ని ఆలోచిద్దాము. అందుకని నువ్వు తొందరగా వెళ్ళు" అని సుగ్రీవుడు అన్నాడు.


                               ◆ వెంకటేష్ పువ్వాడ.

 


More Purana Patralu - Mythological Stories