హానుమంతుడికి రాముడు ఎలా కనిపించాడు??

 

సుగ్రీవుడి భయాన్ని చూసి హనుమంతుడి కోపం, జాలి కూడా కలిగాయి. ఎందుకు నువ్వు అందరినీ చూసి భయపడతావు అని అన్నాడు. చివరకు హనుమంతుడు సుగ్రీవుడు భయాన్ని పోగొట్టడానికి తన కపి(వానర రూపం) రూపాన్ని విడిచిపెట్టి, భిక్షు రూపాన్ని (సన్యాసి రూపాన్ని) పొంది, శర బుద్ధితో బయలుదేరి రాముడి దగ్గరికి వెళ్ళాడు. సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసాడు.


 "మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు రాజర్షుల లాగ, తాపసులు లాగ ఉన్నారు. విశేషమైన కాంతితో ఉన్నారు. మీరు నడిచి వస్తుంటే, మిమ్మల్ని చూసి మృగాలన్నీ పారిపోతున్నాయి. మిమ్మల్ని చూసి ఇక్కడున్న సర్వ భూతములు భయపడుతున్నాయి. మీ యొక్క కాంతి చేత ఇక్కడున్న నదులలోని జలములు శోభిస్తున్నాయి. మీరు నడుస్తుంటే, సింహాలు నడుస్తున్నాయా? అన్నట్టుగా ఉంది. సింహాల యొక్క బలాన్ని అధిగమించిన స్వరూపంతో ఉన్నారు. మీ చేతులలో కోదండాలు, బాణాలు ఉన్నాయి. మిమ్మల్ని చూస్తుంటే ఎటువంటి శత్రువునైనా సంహరించగలిగిన పరాక్రమము చేత విరాజిల్లుతున్న వారిలా కనపడుతున్నారు. ఠీవిగా నడిచే ఎద్దుల్లా నడుస్తున్నారు. నడుస్తున్న పర్వతాల్లా ఉన్నారు. పద్మములవంటి కన్నులతో ఉన్నారు, జటామండలాలు కట్టుకొని ఉన్నారు. ఈ రూపములు ఒకదానితో ఒకటి సరిపోవడం లేదు. మీరు సూర్య చంద్రుల్లా ఉన్నారు, విశాలమైన వక్షస్థలంతో ఉన్నారు. మనుష్యరూపంలో ఉన్న దేవతల్లా ఉన్నారు. పెద్ద భుజాలతో ఉన్నారు. మీ బాహువుల చేత ఈ సమస్త పృధ్వీ మండలాన్ని రక్షించగలిగిన వారిలా కనపడుతున్నారు. అటువంటి మీరు ఇలా ఎందుకు నడిచి వస్తున్నారు. దీనికి కారణం ఏమిటి. మీ మొలలకి చాలా పెద్ద కత్తులు కట్టి ఉన్నాయి. ఆ కత్తుల్ని చూస్తే భయం వేస్తుంది" అని ఎంతో వివరంగా చెప్పాడు హనుమంతుడు. 


ఆ తరువాత "నేను సుగ్రీవుడి యొక్క సచివుడిని(సచివుడు అంటే మంత్రి) నన్ను హనుమ అంటారు.  సుగ్రీవుడు మాకందరికీ రాజుగా ఉండేవాడు. అయితే ఆయన అన్నగారు అయిన వాలి రాజ్యాన్ని లాక్కుని సుగ్రీవుడిని తరిమేసాడు. సుగ్రీవుడికి వాలి నుండి ఏవైపు చూసినా ప్రమాదమే, వాలికి భయపడి సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం శిఖరాల మీద నలుగురు మంత్రులతో కలసి ఉంటున్నాడు.  ఆయన ధర్మాత్ముడు, మీతో స్నేహం చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుకని మీరు మా ప్రభువుతో ఎందుకు స్నేహం చెయ్యకూడదు??" అని అడిగాడు హనుమంతుడు.


హనుమంతుడు ఎంత మాట్లాడినా రామలక్ష్మణులు ఏమీ స్పందించలేదు. 


అందుకని హనుమంతుడే మళ్ళీ రామలక్ష్మణులతో  "నేను ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాను. మీరు నాతో మాట్లాడడంలేదు. మీరు మాట్లాడితే వినాలని ఉంది. మీరు మాట్లాడండి" అని చెప్పి హనుమ నిలబడిపోయాడు. అంతేకాదు అప్పటిదాకా సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడికి రాముడు విష్ణుమూర్తి లాగా కనిపించాడు.


"సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చి అపకారం చేసేవాడు కాదు కాబట్టి నా సన్యాసి రూపం ఎందుకు??" అని సన్యాసి రూపం నుండి తిరిగి తన నిజరూపంలోకి మారిపోయాడు. 


                             ◆ వెంకటేష్ పువ్వాడ.
 


More Purana Patralu - Mythological Stories