హనుమంతుడి గురించి రాముడు ఏమన్నాడు?


హనుమంతుడు రామలక్ష్మణుల దగ్గరకు వెళ్లి ఎంతో వినయంగా తనకున్న సందేహాలు అన్నీ అడిగాడు. ఆ తరువాత "నేనే మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడండి" అని అడిగాడు. 


అప్పుడు రాముడు లక్ష్మణుడితో ఇలా "చూశావా లక్ష్మణ, హనుమ ఎలా మాట్లాడాడో. ఆయన మాటలు విన్నావ. ఇలాగ మాట్లాడేవాడు మంత్రిగా దొరికితే కార్యాలు ఎందుకు నెరవేరవు! ఇలా మాట్లాడేవాడు ఎదురుగా వచ్చి నిలబడితే, కత్తి పట్టి ప్రాణం తీసేద్దాము అనుకున్న వ్యక్తి కూడా కత్తిని ఒరలో పెట్టేస్తాడు. ప్రాణాలు తీసే పని విరమించుకుంటాడు. ఇటువంటి వ్యక్తి మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంత అదృష్టవంతుడు కదా!! ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఎంతో బాగా అధ్యయనం చేశాడని అర్థమవుతోంది. అది  తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. 


అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు అందుకే ఈయన మాటతీరు ఎంతో బాగుంది. ఈయనికి ఉపనిషత్తుల అర్ధం పూర్తిగా తెలుసు. అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు నిష్కారణంగా కదలడంలేదు, లలాటము(నుదురు భాగం) కదలడం లేదు. వాక్యము లోపలినుండి పైకి వచ్చేటప్పుడు గొణుగుతున్నటు లేదు. గట్టిగా లేదు. ఈయన మాటలు ప్రారంభించిన దగ్గరి నుండి చివరి వరకూ ఒకే స్వరంతో పూర్తి చేస్తున్నారు. పాదములు, చేతులు, శరీరాన్ని కదపడం లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలా పలుకుతున్నారు. ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడిగా(మంత్రిగా) దొరికి, మన దగ్గరికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు కనుక, మనం అనుకున్నటువంటి కోరిక సిద్ధించినట్లే. మనం ఎవరిమో, ఇలా ఎందుకు తిరుగుతున్నామో హనుమకి చెప్పు లక్ష్మణా" అన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు "అయ్యా హనుమా! ఈయన దశరథుడి కుమారుడైన రాముడు. ఆ దశరథుడు పరమ ధర్మాత్ముడై రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన ఉన్నప్పుడు ఎవరూ ఆయనని ద్వేషించలేదు, ఆయనా ఎవరినీ ద్వేషించలేదు. చతుర్ముఖ బ్రహ్మగారు ఎలా అయితే అందరి చేత గౌరవింపబడతారో, అలా దశరథుడు లోకులందరి చేత గౌరవింపబడినవాడు. దశరథుడి పెద్ద కొడుకు రాముడు. ధర్మాత్ముడు అయిన తండ్రి మాటకి కట్టుబడి రాముడు అరణ్యానికి వచ్చాడు. రాముడితో పాటు ఆయన భార్య సీతమ్మ, ఆయన తమ్ముడిని అయిన నేను కూడా వచ్చాము. మేము  పంచవటిలో ఆశ్రమం నిర్మించుకుని అక్కడ ఉండేవాళ్ళం. మా వదిన సీతమ్మ కాక మాయలేడిని చూసి ముచ్చటపడి అది కావాలని అడిగింది. దానికోసం రాముడు వెళ్ళాడు, రాముడికి ప్రమాదం జరిగిందేమో అని వదిన మాట మీద నేనూ వెళ్ళాను. 


అప్పుడు ఎవరో ఒక రాక్షసుడు రాముడి భార్య అయిన సీతమ్మని అపహరించాడు. సీతమ్మని వెతికే ప్రయత్నంలో ఉండగా, మాకు కబంధుడనే రాక్షసుడు కనపడ్డాడు. ఆయనని సంహరించి, శరీరాన్ని దహిస్తే, ఆయన మళ్ళి ధనువు అనే శరీరాన్ని పొంది మమ్మల్ని సుగ్రీవుడితో స్నేహం చెయ్యమని చెప్పాడు. అందుకని మేము ఇక్కడికి వచ్చాము. నేను లక్ష్మణుడిని, రాముడి తమ్ముడు అని లోకము అంటుంది, కాని రాముడి గుణములచేత తృప్తి పొందినవాడనై, ఆ గుణములచేత విశేషమైన ఆనందమును పొందినవాడనై రాముడికి దాసుడిని అనుకుంటాను. లోకములో కష్టంలో ఉన్నవారందరూ రాముడిని ఆశ్రయించి సహాయం పొందారు.  అటువంటి రాముడు ఈనాడు సుగ్రీవుడిని ఆశ్రయించి సహాయం అడగాలని, అనుకున్నాడు. అందుకని మేము సుగ్రీవుడిని స్నేహితుడిగా పొందాలని అనుకుంటున్నాము" అన్నాడు.

◆వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories