అతడామె జవాబు వినిపించుకున్నట్లు లేదు. మరింత దగ్గరగా జరిగి గబుక్కున వీపుమీదుగా చేతులువేసి, తనవైపు లాక్కుంటూ 'బేబీ' అన్నాడు వివశుడౌతున్నట్లుగా.
    
    జారిపోతున్న పమిటను పైకి లాక్కుని "ఏం పని బాబూ! విడిచిపెట్టు" అంది విదిలించుకునే ప్రయత్నంలో.
    
    "బేబీ! నువ్వంటే నాకు చాలా ఇష్టం" అన్నాడు చెవిలో రహస్యం చెబుతూన్నట్లుగా.
    
    "మంచికే, నన్ను వదులు బాబూ!" అంది గిరిజ ఏడుపుగొంతుకతో.
    
    "ఎంత ఇష్టమో తెలుసా?" అంటూ చప్పున ఆమె ముఖంమీదికి ఒంగాడు.
    
    అతని పెదవులు ఆమె పెదవులకి తగిలేటంతలో చురుగ్గా ముఖంప్రక్కకి త్రిప్పుకుని "ఎవరో వస్తున్నారు" అంది చిన్నగా.
    
    అతను చటుక్కున ఆమెను ఒదిలేసి గుమ్మందాకా వెళ్ళి బయటకు చూసి నవ్వుతూ "భలే అబద్దమాడి తప్పించుకున్నావే! ఎవరూ లేరు" అన్నాడు.
    
    "మరి ఏం చేస్తాను చంపుతూంటే?" అని, "యింక వెళ్ళు బాగుండదు" అంది.
    
    "సాయంత్రం నాతో సినిమాకొస్తే యిప్పుడెళ్ళిపోతాను."
    
    "అలాగే వస్తాన్లే వెళ్ళు" అంది గత్యంతరంలేక.
    
    "మాట తప్పకూడదు సుమా" అని ఒక్కసారి వెక్కిరించి అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
    
    "పెళ్ళయిందిగా, ఇహ మొదలు పీడ" అనుకుంది గిరిజ.
    
    గబగబ తలుపు గడియ పెట్టేసుకుంది. అంతే తొందరగా చీరె కట్టుకోవటం పూర్తిచేసి, మంచంమీద కూర్చుండిపోయింది ఆలోచిస్తూ. జరిగిన అనుభవం తలపుకు వస్తూంటే వళ్ళు కంపరంగా వుంది. అనుభూతి ఏమీ కలగకపోగా వికారంగా వుంది. మొదట్లోనే యిలా వుంది. ఇహ ముందు ముందు ఎలా వుంటుందో అన్న ఆలోచన రాగానే గుండె గుభేలుమంది. అలాగే మంచంమీద మోకాళ్ళలో తలదూర్చుకుని ఎంతసేపో వుండిపోయింది.
    
    ఆ సాయంత్రం బలవంతంగా ముస్తాబు చేసుకుని అతనితో సినిమాకి బయల్దేరక తప్పలేదు.
    
    ఇద్దరూ రోడ్డుమీద ప్రక్క ప్రక్కన నడుస్తున్నారు. ఆమె కొంచెం దూరంగా వుందామని ఎడంగా పోతున్నకొద్దీ అతను భుజం భుజం తగిలేటంత సమీపంగా వస్తున్నాడు.
    
    "రిక్షాలో పోదామా?" అన్నాడు కొంతదూరం పోయాక.
    
    "ఎందుకు? యిలా నడుస్తుంటే బాగానే వుందిగా" అంది వళ్ళుమండి.
    
    "పాపం! ఎక్కువ దూరం నడిస్తే నీ పాదాలు కందిపోవూ."
    
    "ఫర్వాలేదు నేనేమంత సుకుమారిని కాను."
    
    బహుశా ఆమెతో కలిసి రిక్షాలో కూర్చుని ప్రయాణం చేయాలని అతను ఉవ్విళ్ళూరి వుంటాడు. అతని ముఖంలో ఏ మాత్రమో ఆశాభంగం కనిపించింది. అయినా బలవంతం చెయ్యకుండా నడవటానికి నిశ్చయించుకున్నాడు.
    
    కొత్తపెళ్ళికూతురూ, పెళ్ళికొడుకూ వాళ్ళెంత పెళ్ళిబట్టల్లో లేకపోయినా, ఎంత మామూలుగా అలంకరించుకున్నా పెళ్ళికళ కనిపిస్తూనే వుంటుంది. వాళ్ళిద్దరూ రోడ్డుమీద అలా ప్రక్క ప్రక్కనే నడుస్తూంటే జనం కుతూహలంగా చూశారు. అందులో కొంతమంది కాలేజీ స్టూడెంట్లుకూడా వున్నారు. ఒకరిద్దరు ఈలలు వేశారు.
    
    అయినా యిద్దరూ లక్ష్యపెట్టలేదు. గిరిజ నిర్లిప్తంగా వుండి లక్ష్యపెట్టలేదు. సుందరం గర్వంగా వుండి లక్ష్యపెట్టలేదు.
    
    సినిమాహాలుకు చేరి, టిక్కెట్లు తీసుకున్నాక లోపలికి వెళ్ళి కూర్చున్నారు. కొత్త తెలుగు సినిమా, అందువల్ల జనం బాగానే వున్నారు. వాళ్ళు వెళ్ళి కూర్చున్న అయిదునిముషాలకు హౌస్ ఫుల్ అయింది.
    
    సినిమా మొదలయాక గిరిజ అనుభవించిన అవస్థ అంతా యింతా కాదు.
    
    అవసరం వున్నా లేకపోయినా మీదకి ఒరుగుతాడు. చెంపకు చెంప అనేటంత పని చేస్తాడు. చేతివ్రేళ్ళు సవరిస్తాడు. మోచేతిమీద గిచ్చినంత పనిచేస్తాడు. అర్ధంలేకుండా ఏదో పలకరిస్తాడు. జవాబు చెప్పేదాకా వేధిస్తాడు.
    
    కొత్త పెళ్ళికొడుక్కి, పెళ్ళికూతురికి ఈ తతంగమంతా తప్పదేమో అనిపించింది.
    
    ఆమె ప్రాణానికి రిలీఫ్ యిస్తున్నట్లు యింటర్వెల్ అయి లైట్లు వెలిగాయి.
    
    వాళ్ళకు ముందువరసలో కూర్చున్న అమ్మాయి తల వెనక్కిత్రిప్పి చూసింది. ఆ అమ్మాయిపేరు గిరిజకు గుర్తులేదుగాని, తమ కాలేజీలో చదువుతోందని తెలుసు. ఒకటి రెండు సందర్భాలలో మాట్లాడుకుని వుంటారుకూడా ఆ అమ్మాయి గిరిజను చూసి నవ్వింది. గిరిజకూడా నవ్వింది. ఆ అమ్మాయి తల ముందుకు తిప్పేసుకుంది.
    
    "బయటికెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకుందాం రా" అన్నాడు సుందరం.
    
    "నేను రాను" అంది.
    
    ఏమనుకున్నాడో ఏమిటో నాకు దాహమేస్తోంది. ఇప్పుడే వస్తాను' అని లేచి వెళ్ళిపోయాడు.
    
    గిరిజ ప్రక్కన కూర్చున్న మగవాడు బయటికి వెళ్ళడం కనిపెట్టి ముందు కూర్చున్న అమ్మాయి తల మళ్ళీ వెనక్కి తిప్పింది.
    
    "ఏమండీ బాగున్నారా?" అని పలకరించింది.
    
    గిరిజ బాగానే వున్నానన్నట్లుగా తలవూపింది. ఇద్దరిమధ్యా పరిచయమంతగా లేదు. అంచేత ఒకరి విషయాలు ఒకరికి తెలియవు.
    
    "ఎవరతను? మీ అన్నయ్యా?"
    
    గిరిజ విద్యుద్ఘాతం తగిలినట్లుగా ఒణికింది. ఎవరిగురించి ఆమె అడుగుతోంది? సుందరం బావని ఉద్దేశించేనా?
    
    "ఎందుకలా అనిపించింది?" అనడిగింది అర్ధంలేకుండా వెలాతెలా పోతూ.
    
    "మీ ఇద్దరూ ఒకే పోలికతో వున్నారు. కళ్ళు, ముక్కు అన్నీ పోతపోసినట్లు ఒకేలా వున్నాయి అన్నయ్య కదూ?"
    
    ఏం జవాబు చెప్పాలో తోచలేదు గిరిజకు. తన భర్తని అన్నయ్య అనుకుంటోంది. పైగా పోలికలు కూడా ఒకేలా వున్నాయంటోంది. తామిద్దరూలోకంకళ్ళకు అన్నాచెల్లెళ్ళలా కనిపిస్తున్నారా? భార్యభర్తల అంశలు తమలో ఏమీలేవా?