దేవానంద్ ఇంటిచుట్టుప్రక్కల వాళ్ళు ఏదైనా సమాచారాన్ని పోలీస్ స్టేషన్స్ కి గాని అందించారా?
    
    పోలీస్ కమీషనర్ సిద్దేశ్వర్ ఓబరాయ్ ప్రస్తుతం ఏ కేసుని డీల్ చేస్తున్నారు.
    
    ఈ మధ్య జాయింట్ కమీషనర్ (క్రైమ్స్) ఐనాందార్ ఏ కేసుని డీల్ చేస్తున్నారు? పోలీసు డిపార్టుమెంట్ కి చెందిన ఉన్నతాధికారుల తెర వెనుక కదలికలు ఏమైనా మొదలయినాయా? ఇలాంటి ప్రశ్నలన్నింటికి మనకు మరో రెండు గంటల తరువాత సమాధానాలు లభిస్తాయి" అన్నాడు ఖలీల్ గర్వంగా.
    
    జోహ్రా అభినందనగా ఖలీల్ వేపు చూసాడు. ఆ తరువాత ఇద్దరూ కళ్ళతోనే సంజ్ఞ చేసుకొని కాటేజ్ బయటకు వచ్చి ఎక్కారు.
    
    "డ్రైవర్ కార్లాకేవ్స్ కి పోనివ్వు" అన్నాడు ఖలీల్.
    
    కారు బయలుదేరింది.
    
    "లోనావాలాకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్లాకేవ్స్ బి.సి. ఎయిత్ సెంచరీకి చెందినవి. ఎల్లోరా గుహలకు వీటికి దగ్గర సంబంధం వుంటుంది. ఇండియాలో ఏమాత్రం దెబ్బతినని బుద్దుడి గుడులు కార్లాకేవ్స్ లోనే ఉన్నాయి. అద్భుతమైన ఆనాటి శిల్పుల కళానైపుణ్యం కార్లాకేవ్స్ లో మనకు కనిపిస్తుంది. ఎమ్.టి.డి.సి. వాళ్ళ కార్లాకేవ్స్ ని రాక్ అండ్ ఫోర్డ్ క్లయింబింగ్ సెంటర్ గా తయారుచేసి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్వంచర్ టూరిజమ్ ని స్థాపించారు. అందుకే నిన్ను అక్కడికి తీసుకువెళుతున్నాను. ఒకింత రిలాక్స్ అవుతావని" అన్నాడు ఖలీల్.
    
    "నా వృత్తేమిటి....? నువ్వు తీసుకెళ్ళేది ఎక్కడికి....? అక్కడికి వద్దు. వేరే చోటికి తీసుకువెళ్ళు" అన్నాడు జోహ్రా సీరియస్ గా.
    
    ఖలీల్ సూచన మేరకు కారు అక్కడే ఆగిపోయింది.
    
    "డ్రైవర్ టైగర్స్ లీప్ కి పోనివ్వు" అన్నాడు ఖలీల్. కారు రివర్స్ అయి మరో ఘాట్ రోడ్ లోకి మరలింది.
    
    "లోనావాలా లేక్, భుసియా లేక్, టైగర్స్ లీప్, రేవుడ్ పార్క్, టుంగర్లీ డామ్, బారో మీటర్ హిల్ చాలా బావుంటాయా ప్రాంతంలో, కాండ్లా టూరిస్ట్ హిల్ కూడా ఇక్కడికి దగ్గరే. సన్ సెట్ అక్కడి నుంచి చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం మన వృత్తికి దగ్గర స్థలానికే వెళుతున్నాం. ఉదయం, సాయ్మత్రం టైగర్స్ లీప్ దగ్గరకు టైగర్స్ వస్తుంటాయి. పులుల కనుమ అది" అన్నాడు ఖలీల్ కార్లాకేవ్స్ నుంచి వచ్చే రోడ్ కేసి చూస్తూ.
    
    ఉన్నట్లుండి ఖలీల్ షాక్ తిన్నాడు.
    
    కార్లాకేవ్స్ రోడ్ కేసే చూస్తూ శిలా ప్రతిమయిపోతూ "స్టాప్ ది కార్" అని అరిచాడు.
    
    అతనలా ఎందుకు అరిచాడో అర్ధంకాక డ్రయివర్ కారుని సడన్ బ్రేక్ తో ఆపేసాడు.
    
    జోహ్రా కూడా ఆశ్చర్యపోయి చూస్తుండగా ఖలీల్ తన చూపుడు వేలితో కార్లాకేవ్స్ రోడ్ కేసి చూపించాడు.
    
    ఈసారి జోహ్రా కూడా షాక్ తిన్నాడు ఖలీల్ చూపించిన వేపుకు చూసి.
    
    ముందు రెండు మోటార్ బైక్స్...
    
    వాటి వెనుక రెండు కార్లు...
    
    ఆ వెనుక రోల్స్ రాయిస్...
    
    దాని వెనుకే అంబులెన్స్...
    
    ఆ వెనుకే మరో రెండు బైక్స్.
    
    ఆ చుట్టుప్రక్కల పచ్చిక మైదానాల్లో పరచుకున్న నిశ్శబ్ధాన్ని చెదరగొడుతూ కార్లాకేవ్స్ నుంచి లోనావాలా కేసి వేగంగా దూసుకువస్తున్న వెహికల్స్....! "మాస్టర్ కార్లాకేవ్స్ కి వెళ్ళి వస్తున్నారు?" అన్నాడు ఖలీల్ షాక్ నుంచి తేరుకుంటూ.
    
    "మాస్టర్ కి బుద్దుడిపై భక్తా....?" జోహ్రా విస్తుపోయి ప్రశ్నించాడు.
    
    "మాస్టర్ కి కాదు, మాస్టర్ తల్లికి....మేనకోడలికి....ఎంతలో అవకాశాన్ని పోగొట్టుకున్నాం..." నాలిక్కరుచుకుంటూ అన్నాడు ఖలీల్.
    
    "పిచ్చివాడా? అవకాశం మనదగ్గరకే వచ్చింది కదాని ఆపదలో ఇరుక్కోవటం అవివేకుల ప్రధమ లక్షణం. అవకాశం మనకెంత దగ్గరగా వచ్చిందన్నది కాహ్డు ప్రశ్న- అవకాశానికి మనమెంత దగ్గరగా వెళ్ళాం. ఎంత సురక్షితంగా ఉన్నా మన్నదీ ప్రశ్న. కార్లాకేవ్స్ ప్రోగ్రామ్ ఉందంటే మిల్లర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఉంటాడు.
    
    మన ఇంటి ప్రక్కనే బ్యాంక్ పెట్టారని దొంగతనానికి సిద్దపడితే ఊచలు లెక్కించవలసి ఉంటుంది. మాస్టర్ నా యమపాశం నుంచి తప్పించుకోలేడు. మిల్లరే కాదు హరి హరాదులే దిగివచ్చినా నా చేతిలో వ్రాసి ఉన్న మాస్టర్ చావుని తప్పించలేరు" జోహ్రా మాట్లాడుతూ హఠాత్తుగా ఆగిపోయి డ్రైవర్ కేసి అనుమానంగా చూసాడు.
    
    "మా డ్రైవర్ గురించి నువ్వేం సందేహించక్కర్లేదు జోహ్రా భాయ్...నాకోసం ప్రాణాలిమ్మన్నా ఇస్తాడు. అంతేకాదు అతను నీ అభిమాని, 1981లో న్యూజర్సీలో, 1983లో థాయ్ లాండ్ లో నువ్వు రెండు అసాసినేషన్స్ ని ఎలా ఫినిష్ చేసావో... సరిగ్గా అలాగే నాకోసం నేను సూచించిన ఇద్దరు వ్యక్తుల్ని అసాసినేట్ చేసి క్షేమంగా బయటపడినవాడు.....మనమధ్య సంభాషణని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టడు" ఖలీల్ తన డ్రైవర్ ని మెచ్చుకుంటూ అన్నాడు.
    
    "అంత నమ్మకమయిన వ్యక్తి నీకు డ్రైవర్ గా దొరకటం నీ అదృష్టమే.....కాని...." జోహ్రా చెప్పటం ఆపాడు.
    
    "వూ... చెప్పు భాయ్.... కానీ ఏమిటి...?"
    
    ఖలీల్ రెట్టించాడు.
    
    "ఏ వృత్తిలోనైనా, ఏ వ్యక్తికి పైకి రావాలని ఉన్నా ఆ వ్యక్తికి సొంత ఆలోచనలుండాలి వ్యక్తిత్వముండాలి. తన అవసరాన్ని ఎలా తీర్చుకోవాలన్న సమస్యకు తన ఆలోచనల ద్వారానే సమాధానం చెప్పుకోవాలి. మరొకరు అనగా వినో, ఆ మరొకరి గురించి ఇంకెవరో చెప్పగా వినో అవతల వ్యక్తుల ఆలోచనల్ని, పథకాల్ని, ఫ్లాట్స్ ని యధాతధంగా అమలుపరిచేవాడు ఎప్పటికీ పైకి రాలేడు. వచ్చినా నిలబడలేడు. డబ్బుని అప్పుగా తీసుకోవచ్చు. అప్పుని తీర్చుకోవచ్చు. గుండెని, కళ్ళను, కిడ్నీల్ని, ఆస్తుల్ని, అప్పుల్ని, అధికారాల్ని మరొకరి నుంచి తీసుకోవచ్చేమో కాని తెలివితేటల్ని మాత్రం కాదు. ముందుగా తన స్థాయేమిటో తను దేనికి సరిగ్గా పనికొస్తాడో తెలుసుకోవాలి. ఆ పరిధిలోనే తన సొంత ఆలోచనలతో పరిశ్రమించాలి. ఎప్పుడూ మరొకరి ఐడియాలను, ఆలోచనల్ని ఎలా సొంతం చేసుకుందామనిగాని, మరొకరి శ్రమతో తనెలా పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించుకోవాలని ప్రయత్నించటం కాని ఎవరినీ పైకి తీసుకెళ్ళలేవు. అలాంటి అసమర్ధుల్ని, అర్భకుల్ని, హిపోక్రాట్స్ ని నేను క్షమించను. కనుక మీ డ్రైవర్ నన్ను, నా విధానాల్ని, పధకాల్ని, ప్లాట్స్ ని తస్కరించటం మాని సొంతంగా ఆలోచించటం నేర్చుకొమ్మను. లేదంటే టీ కొట్టు పెట్టుకోమని చెప్పు..." జోహ్రా సీరియస్ గా అన్నాడు.