ఆలోచనల మధ్య కూరుకుపోయి అలా ఎంతసేపు గడిపిందో గుర్తులేదు. సాయంకాలం అవుతుండగా ఏదో గుర్తుకొచ్చినట్లు సౌదామిని పైకి లేచింది.
    
    గదిలో ప్రబంధ పడుకునే వుంది ఇంకా.
    
    చేతులు కంపిస్తుంటే ఫోన్ రింగ్ చేసి ఎస్ టిడిలో పద్మనాభంతో మాట్లాడింది.
    
    "చదరంగంలో అతి ముఖ్యమయిన ఎత్తును జయప్రదంగా పూర్తి చేయాలనుకుంటున్నాను పద్మనాభం. నువ్వు నాకో సాయంచ చేయాలి."
    
    "చెప్పు..."
    
    "కింగ్ జార్జి హాస్పిటల్లో వున్న ఆదిత్య చెల్లెలు అనితని ఇప్పుడే ఓ గంటలోగా కిడ్నాప్ చేయించాలి."
    
    ఎందుకూ అని అడగలేదు పద్మనాభం....రాష్ట్ర హోంశాఖా మంత్రిగా ఆ మాత్రం చేయటం పెద్ద పని కూడా కాదు. సౌదామిని ఏం చేసినా గాని అది వాసుదేవరావు రాజకీయ జీవితానికి కడుతున్న సమాధిగా తెలుసు.
    
    "అలాగే!"
    
    అప్పుడు సమయం సాయంకాలం అయిదున్నర కావస్తూంది.
    
                                                             * * *
    
    రాత్రి ఎనిమిది గంటలవేళ.
    
    కల్మషంగా పేరుకున్న చీకటిని చీల్చుతున్న విద్యుద్దీపాల్లో కెజి. హాస్పిటల్ ఘనీభవించిన కాగడాలా వుంది.
    
    బంగాళాఖాతం పైనుంచి వస్తున్న గాలి మొదలు కాబోయే తుఫానుకి సూచనగా హోరుమంటూ నలుదిశలా వ్యాపిస్తూంది.
    
    మేఘావృతమయిన ఆకాశం ఏ క్షణంలోనయినా వర్షించేట్టుంది.
    
    క్యారియర్ తో వార్డులోకి వచ్చిన ఆదిత్య అక్కడ బామ్మ ఒక్కర్తే వుండటంతో "అనిత ఏది?" అన్నాడు చుట్టూ కలయచూస్తూ.
    
    "అదేమిట్రా, నువ్వు అర్జెంటుగా రమ్మన్నావటగా....అరగంట క్రితం నీ దగ్గరకే వచ్చిందిగా!"
    
    గగుర్పాటు కలిగింది ఆదిత్యకు. తను పిలవడమేమిటి? ఆందోళనగా కదిలాడు.
    
    తన అనుమానాన్ని బామ్మకి చెప్పలేదు. ఈ స్థితిలో బామ్మకి చెప్పడం శ్రేయస్కరం కాదు. మనసేదో కీడును శంకిస్తుంటే- "నువ్వు భోంచేసి పడుకోవే" అంటూ బామ్మకి చెప్పి ఆత్రుతగా బయటకు నడిచాడు. సరాసరి ఇంటికి వెళ్ళాడుగాని అక్కడ అనిత జాడ లేదు.
    
    ఇప్పుడేం చేయాలి? మనసు శౌరిని అనుమానిస్తూంది....సూరిని కలుసుకోవాలా, లేక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లయింట్ యివ్వాలా?
    
    అంతర్మథనంతో నలిగిపోతుండగానే వచ్చింది సౌదామిని.
    
    "మీరు...."
    
    "నా పేరు సౌదామిని ముఖ్యమంత్రిగారికి చాలా కావాల్సినదాన్ని ప్రబంధ, శౌరీలకు పెద్ద దిక్కుని."
    
    ఏ కుటుంబం తనలో ఇలాంటి అశాంతికి కారణమవుతుందో అక్కడినుంచే వచ్చిన స్త్రీ ఆమె.
    
    "పోలీస్ స్టేషన్ కి వెళదామనుకుంటున్నావా?"
    
    అప్రతిభుడయ్యాడు ఆమె తన మనసులోని భావాల్ని ఎలా గ్రహించగలిగిందో అర్ధంకాక.
    
    "లాభం లేదు ఆదిత్యా! దానిమూలంగా మీ చెల్లి మీకు దక్కదు.
    
    "అంటే?" ఆందోళనగా చూశాడు- "మా అనిత..."
    
    "శౌరి కిడ్నాప్ చేశాడు."
    
    తన అనుమానం నిజమైంది "ఎందుకు?"
    
    "మొదటిది శౌరి చెల్లెలికి నువ్వు దగ్గరపడుతున్నావు కాబట్టి, రెండోది ఈ రోజు నువ్వు శౌరిని అవమానించావు కాబట్టి."
    
    "బా...స్ట....ర్డ్! అన్నంత పనీ చేశాడు!" ఆదిత్య పిడికిళ్ళు బిగుసుకున్నాయి- "వాడి అంతు చూస్తాను!"
    
    "ఆగు" చనువుగా వారించింది "అంతుచూడ్డమూ అంటే పోలీసులకి కంప్లైంటిస్తావ్ అంతేగా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకుని కాక పోలీసులు నిన్ను సమర్ధిస్తారనుకున్నావా?"
    
    నిస్సహాయత మరింత కలవరపెట్టిందేమో- "నేను యూనివర్శిటీ స్టూడెంటుని.... పోరాడగలను."
    
    "ఛఛ! అలా పెళ్ళికావాల్సిన నీ చెల్లిని ఉద్యమాలు నడిపించి అల్లరి పాలు చేద్దామనుకుంటున్నావా? చాలా తెలివైనవాడివని విన్నాను. ఇంత పొరపాటుగా ఆలోచిస్తున్నావేం? ఎప్పుడో చివర చేయాల్సింది ముందే చేస్తానంటావేం?"
    
    తల పట్టుకుని కూర్చుండిపోయాడు ఆదిత్య....
    
    "కంగారుపడకు నేనున్నాను నీ చెల్లికే ప్రమాదం రాకుండా చూస్తాను."
    
    "డేమిట్!" ఆదిత్య కళ్ళ నుంచి నీళ్ళు రాలేట్టున్నాయి. "ఇంత జరిగాక ఏ ప్రమాదమూ ఉండదని గ్యారంటీ ఏమిటీ?"
    
    "ప్రమాదమే ఉంటే సమస్యను అటునుంచి నరుక్కొచ్చేదాన్ని ఆదిత్య! నీ దగ్గరకు వచ్చేదాన్ని కాదు."
    
    పరిచయంలేని ఓ స్త్రీ వచ్చి అనిత గురించి వివరాలు అందించినందుకు ఆమెపైన నమ్మకం ఏర్పడిందో, లేక ఒక అక్కలా ఓదార్పు అందిస్తున్నందుకు అభిమానమే పెరిగిందో ఉద్విగ్నంగా ఆమెను సమీపించాడు. "మేడం! నన్నేం చెయ్యమంటారో చెప్పండి."
    
    సాలోచనగా ఉండిపోయింది చాలాసేపటిదాకా సౌదామిని.
    
    "మీరు ప్రబంధని ఇష్టపడుతున్నారా?"
    
    "లేదు!"
    
    "కాని, మీకోసం ప్రబంధ అలమటించిపోతూంది."
    
    "అదే నా కింత సమస్య తెచ్చిపెట్టింది."
    
    "అందులో ప్రబంధ తప్పేముంది ఆదిత్య? తను కోరుకున్న మనిషి కోసం ఓ అమ్మాయి తపించడం అన్యాయం కాదుగా?"
    
    తల వంచుకున్నాడు ఆదిత్య.
    
    "మీకు తెలీదు ఆదిత్యా!  అహంకారం తప్ప మరోటి తెలీని ప్రబంధ మీ ఆలోచనతోనే మామూలు ఆడపిల్లగా మారింది. మీ కోసం తన సర్వస్వాన్ని వదిలిపెట్టి మీ దగ్గరకు రావటానికి సిద్దంగా ఉంది ఆ విషయం ఆనందదాయకం కాకపోవచ్చు. కాని మీరు దూరం కావటం ప్రబంధ భరించలేదు."