"నీలాండ్ కి సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నాయా...." అడిగాడు సూర్యవంశీ.
    
    "ఉన్నాయా... ఏంటి సార్.... ఉన్నాయి..." వెంటనే పక్కన గోడకున్న షిర్డిసాయి పటం వెనకున్న కొన్ని కాగితాలు తీసి, సూర్యవంశీ చేతిలో పెట్టాడు రబ్ జానీ.
    
    "నీలాండ్ నీ కొస్తుంది.... లేకపోతే.... నువ్వు ఇల్లు కట్టుకోడానికి అవసరమయ్యే డబ్బొస్తుంది..... ఓకే!...." కాన్ఫిడెంట్ గా చెప్పి ఆ సెలూన్ లోంచి బయటకు వచ్చాడు సూర్యవంశీ.
    
                                                  *    *    *    *    *
    
    రూమ్ కి రాగానే సూర్యవంశీ మొట్ట మొదట చేసిన పని-రబ్ జానీ డాక్యుమెంట్స్ ఆధారంగా వార్త రాయడం - వెంటనే దాన్ని ప్రెస్ కివ్వడం మర్నాటి పేపర్లో ఆ వార్త ఫ్లాష్ కావడం, ఆ ప్లాట్స్ ఓనర్ మల్లేష్, హోం మినిస్టర్ జనార్ధన్ ఠాగూర్ దగ్గరకు పరిగెత్తడం జరిగిపోయింది.
    
    "అక్కడ ఫ్లాట్స్ కట్టుకోమన్నది మీరు.... డబ్బులు తీసుకుని, లైసెన్స్ ఇప్పించింది మీరు చూడండి సార్ ఇప్పుడు ఎంత డామేజో...."
    
    "ఆ రబ్ జానీ దగ్గర, డాక్యుమెంట్స్ నువ్వు తీసుకోలేదా...." అడిగాడు జనార్ధన్ ఠాగూర్.
    
    "తన దగ్గర డాక్యుమెంట్స్ లేవని చెప్పాడు సార్...." చెప్పాడు మల్లేష్.
    
    "ఇప్పుడు ఇంకో డాక్యుమెంట్ మనం క్రియేట్ చెయ్యడానికి వీలవుతుందా..." అడిగాడు జనార్ధన్ ఠాగూర్.
    
    "లేదు సార్...ఒరిజినల్ డాక్యుమెంట్, ఆ వార్తతో పాటు పబ్లిష్ అయింది కదా సార్..." కాసేపు ఆలోచనలో పడ్డాడు హోంమినిష్టర్ జనార్దన్ ఠాగూర్.
    
    "ఓ పదివేలు పారేసి వాడి నోరు మూయించు....ఆ డాక్యుమెంట్ ను సంపాదించు..."
    
    "ఆ పనిని మీరే చేసి పెట్టాలి సర్.... లేకపోతే నాబిజినెస్ మటాష్ అయిపోతుంది సర్..." హాండ్ బ్యాగ్ లోంచి డబ్బు కట్టల్ని తీసి టేబిల్ మీద పెట్టాడు. జనార్ధన్ ఠాగూర్ తనకు కొంచెం దూరంలో నున్న ఇద్దరు అనుచరుల వేపుచూశాడు. ఆ చూపులోని భావం అర్ధమైపోయి, వాళ్ళిద్దరూ బయటకు నడిచారు. జీపెక్కారు - ఆ జీపులో వాళ్ళు గాక, ఇంకో ఆరుగురున్నారు. వాళ్ళంతా కిరాయి గూండాలు.
    
                                                  *    *    *    *    *
    
    సెలూన్ ముందు, జీపు ఆగడంతోనే రబ్ జానీ గుండెలు గుబగుబ లాడాయి. లోనికొచ్చిన వ్యక్తులు, అద్దాల్ని పగలకొట్టడం, కుర్చీల్ని పక్కకు లాగడం బెంచీని ఎత్తి, బయట పడేయడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. అడ్డుకోడానికి ప్రయత్నించిన రబ్ జానీని ఒకడు కిందకు తోసేసాడు.
    
    "ఏదిరా డాక్యుమెంట్... పేపర్లో వార్త రాయిస్తావు బే... వార్త రాసింది ఎవడ్రా... అలా అడుగుతున్న ఆ కిరాయి గూండావేపు ప్రాణభయంతో చూసాడు రబ్ జానీ.
    
    "ఆ లాండ్... నా....ది..." ఆ మాటతో రబ్ జానీ గూబ గుయ్ మంది. "అయితే నీ లాండ్ లో నిన్ను పూడ్చిపెడతాం రా... అరే సువ్వర్ కాబచ్చా.....డాక్యుమెంట్స్ ఇవ్వరా...." గెడ్డం గీసే కత్తిని మెడమీద పెడుతూ అన్నాడు ఆ గూండా.
    
    "ఆ డాక్యుమెంట్స్ నా దగ్గరలేవు....రిపోర్టర్ సూర్యవంశీ దగ్గరున్నాయ్..."
    
    "రిపోర్టర్ సూర్యవంశీ...ఎవడ్రాడు...ఎక్కడుంటాడు...ఆడిదగ్గర మేం కలెక్ట్ చేసుకుంటాం గానీ, మళ్ళీ ఆ లాండ్ విషయంలో గొడవ చేసావో.... శాల్తీ గల్లంతైపోతుంది జాగ్రత్త..." హెచ్చరించి, సెలూన్ లోంచి బయటపడ్డాడు వాడు. వాడి వెనక వాడి గ్యాంగ్-మరో నిమిషంలో జీపు అక్కడనుంచి మాయమైపోయింది.
    
                                                 *    *    *    *    *
    
    రౌడీ గ్యాంగ్, అక్కడ నుంచి మాయమైన మరుక్షణం హేర్ సెలూన్ రబ్ జానీ ప్రెస్ ఆఫీస్ కి పరుగెత్తాడు, సూర్యవంశీని కలిసాడు.
    
    "వాళ్ళంతా హోం మినిస్టర్ జనార్ధన్ ఠాగూర్ మనుషులు సార్-నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు సార్ - ఆ మల్లేష్ గాడు, జనార్ధన్ గాడి అండతోనే అంతా చేస్తున్నాడు సార్... అదంతా భూకబ్జా సార్..." తన మీద జరిగిన దాడి, చేసిన హెచ్చరికలు అంతా ఉర్దూలో రాసి సంతకం పెట్టాడతను.
    
    వెంటనే ఆ సంఘటన వార్తగా మారిపోయింది....మర్నాటి దినపత్రికలో ఆ వార్త ప్రముఖంగా ప్రచురించబడింది.
    
    హెడ్డింగ్ పెట్టడంలో సబ్ ఎడిటర్ ఉత్సాహం చూపించడంతో ఆ వార్త సెన్సేషనల్ ఐటమ్ గా మారిపోయింది.
    
    హోం మినిస్టర్ మనుషుల భూకబ్జా - సామాన్యుని ఆక్రందన -
    
    ఈ వార్త తర్వాత, జరిగే పరిణామాల కోసం ఎదురుచూస్తున్నాడు సూర్యవంశీ.
    
    సెలూన్ మూసేసి, ముందు జాగ్రత్త చర్యగా రబ్ జానీని తన రూమ్ లోనే ఉంచుకున్నాడు అప్పటికి....
    
    అర్పణని గోవా తీసికెళ్ళడానికి ఒకరోజు మాత్రమే గడువుంది.
    
                                              *    *    *    *    *
    
    హోం మినిష్టర్ రెసిడెన్స్...
    
    హోం మినిస్టర్ జనార్ధన్, స్వయంగా పేపర్లోని వార్తను చదువుకొన్నాడు. ఆ వార్త చివర కొన్ని వాక్యాలకు ఆయన అగ్గిరాముడైపోయాడు. నగరంలోను, శివార్లలోనూ, అక్రమ పద్దతులద్వారా భూకబ్జాల ద్వారా కొంతమంది పొలిటికల్ గా పలుకుబడి గలిగిన వ్యక్తులు భూముల్ని ఆక్రమించుకోవడం ప్లాట్లుగా విభజించడం సాధరణమైపోయింది... నిజాం నవాబుకి చెందిన భూముల విషయంలోనే కాదు, ప్రభుత్వ భూముల్ని కూడా ఈ సాంఘిక శక్తులు స్వాధీనం చేసుకుంటున్నాయంటే అందుకు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి చేతకాని తనమని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, ఈ బలమైన వర్గాలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు లోబడిపోవడం వల్ల, ఎన్నో భూములు అన్యాక్రాంతమై పోతున్నాయని సామాన్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో ప్రత్యేక దర్యాప్తుకు స్వయంగా ఆదేశాలివ్వాలని బలహీన వర్గాల ప్రజలు కోరుతున్నారు.... లేకపోతే రేపటి ఎన్నికలలో అధికార పార్టీకి బలహీన వర్గాల ప్రజలు ఓట్లు పడతాయనే విషయం సందేహాస్పదమే!"
    
    తలెత్తి చూశాడు హోం మినిష్టర్.
    
    "అంటే.... దీనర్ధం..."
    
    "దీనర్ధం ఏంటండి.... ఇన్ డైరెక్టుగా భూముల్ని బినామీ పేర్లతో కబ్జా చేస్తున్నది మీరేనని రాసాడు.... ఎలక్షన్లు ముందు ఇలాంటి వార్తలు రావడం మంచిది కాదు. ఇది రిపోర్టర్ చేసిన పనికాదు.... వాడి ద్వారా ఎవరో చేయించింది..." ఎదురుగా ఉన్న బిల్డర్ మల్లేష్ అన్నాడు.
    
    "ఆ రబ్ జానీ గాడ్ని లేపేయమంటారా..." అనుచర గుండా అడిగాడు.
    
    "నోర్ముయ్... ఈపేపర్ ఓనర్ని, నేను రమ్మన్నానని చెప్పు..." పి.ఎ. ఫోన్ వేపు పరుగెత్తాడు.
    
    "సార్... ముందు మనకు ఆ డాక్యుమెంట్ కావాలి...." మల్లేష్ రిక్వెస్టు చేశాడు.
    
    "ఆ ప్రెస్ ఓనర్ ఆ డాక్యుమెంట్ తెచ్చిస్తాడు..." ధీమాగా అన్నాడు జనార్ధన్.