ఆడవారి ముక్కు... మరింత షార్పు

 

 

మనిషికీ, మనిషికీ వాసన పసిగట్టడంలో కొంత తేడా ఉండవచ్చు. కానీ మగవారికంటే ఆడవారి ముక్కులు మహా చురుగ్గా పనిచేస్తాయంటే నమ్మగలమా? నమ్మితీరాలంటున్నారు శాస్త్రవేత్తలు.


మగవారితో పోలిస్తే ఆడవారి ముక్కు చురుగ్గా పనిచేస్తుందేమో అన్నది మొదటి నుంచీ ఉన్న అనుమానమే! కానీ ఎవరు ఎంత ప్రయత్నించినా, ఆ వాదనకు రుజువు కనుక్కోలేకపోయారు. బ్రెజిల్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయంలో తాడోపేడో తేల్చేద్దామనుకున్నారు. అందుకోసం వాళ్లు Isotropic fractionators అనే పరీక్షని రూపొందించారు. ఈ పరీక్షతో మెదడులో ఏ భాగానికి సంబంధించి ఎన్ని కణాలు ఉన్నాయో ఖచ్చితంగా లెక్కకట్టవచ్చునట!

 

Isotropic fractionatorsని ఉపయోగించి కొందరిని పోస్ట్మార్టం చేశారు. వారి మెదడులో వాసనని పసిగట్టే olfactory bulb వంటి ప్రాంతాలలోని కణాలను లెక్కగట్టే ప్రయత్నం చేశారు. దీంతో వాసనకి సంబంధించిన న్యూరాన్లు ఆడవారిలో 50 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. బహుశా ఆడవాళ్లకి పుట్టుకతోనే వాసనకి సంబంధించి ఎక్కువ కణాలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు.

 

మనకి తెలియకుండానే ముక్కు చాలా విషయాల్ని తెలియచేస్తుంటుంది. బయట వర్షం పడుతున్నా, ఎక్కడన్నా మంటలు చెలరేగుతున్నా... కొన్ని వాసనలు వస్తుంటాయి. పిల్లల్ని పెంచే క్రమంలో తల్లులకి ఈ సూచనలు చాలా ఉపయోగపడతాయి. అందుకనే ప్రకృతి వాళ్లకి వాసన చూస్తే శక్తిని అధికంగా అందించి ఉంటుంది. అదే నైపుణ్యం తర్వాత ఆహారం సేకరించడానికీ, వంటలు చేయడానికీ ఉపయోగపడుతోంది.

 

వాసన మన ఇంద్రియాలలో ఒక భాగం. మనం పొందే రకరకాల అనుభూతులకి ప్రేరణ. ఒక మంచి వాసన మన మనసు, శరీరాల మీద కూడా ప్రభావం చూపవచ్చు. అలా చూసుకుంటే ఆడవాళ్లు అదృష్టవంతులనే చెప్పుకోవాలి.

- నిర్జర.