క్లాడియస్-2నే కాదు. పోప్ ను సైతం ఓడించిన వాలెంటైన్ చనిపోయాక కూడా విపరీతమైన ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

 

    కాలక్రమంలో వాలెంటైన్ పేరుకు ముందు పోప్ చేర్చిన సెయింట్ అనే పదాన్ని తొలగించి, ప్రేమికుల ప్రేమ పండుగను వాలెంటైన్ డేగా జరుపుకోవడం ఆరంభించారు. ఇది మొదలై ఇప్పటికి 1600 సంవత్సరాలైంది.

 

    చూశావా... ప్రశ్న చిన్నదే అన్నావ్... సమాధానం ఎంత పెద్దదిగా వున్నదో...? పోప్ ద్వారా అమలులో కొచ్చిన వాలెంటైన్ దినోత్సవం నాడు ప్రేమను వ్యక్తీకరించే హక్కు మగవారికే మిగిలిపోయింది. ఇది చాలా అన్యాయం. ఆడవారిని అణగదొక్కడం, వారినుంచి, వారి ప్రేమను వ్యక్తీకరించే హక్కును ఆ రోజుల్లోనే లాగేసుకుంది మగజాతి.

 

    తాను ప్రేమించిన అమ్మాయికి తమ ప్రేమను రాసి, ఒక దూతద్వారా అమ్మాయికి పంపించడం అప్పట్లో ఒక గౌరవనీయమైన ఆచారంగా మారిపోయింది. ఆ ప్రేమ సందేశాలకే వాలెంటైన్ కార్డ్స్ అని పేరు పెట్టారు. మొట్టమొదటి వాలెంటైన్ కార్డ్ ని ఫ్రాన్స్ యువరాజు ఛార్లెస్, క్రీస్తుశకం 1415లో తన ప్రియురాలికి పంపాడు. అదెలా చరిత్రకారుల చేతుల్లోకి చేరిందన్నది తెలియకపోయినా, అదిప్పుడు బ్రిటీష్ మ్యూజియంలో భద్రపరచబడివుంది. ప్రేమికులెవరయినా ఆ మ్యూజియం కెళితే ముందుగా ఫస్ట్ వాలెంటైన్ కార్డునే చూసి నివాళులర్పిస్తారు.

 

    ప్రముఖ బ్రిటన్ చిత్రకారుడు గ్రీన్ వే వాలెంటైన్స్ మీద ఎన్నో వందల అద్భుతమైన చిత్రాలు గీసి మార్కెట్లోకి విడుదల చేశాడు. గ్రీన్ వే చూపిన బాటనే ఎంచుకుని అమెరికాలో, ఇతర యూరప్ దేశాల్లో వాలెంటైన్ కార్డ్స్ తయారు చేయడం ముమ్మరమైంది. ఇప్పుడు ఇండియాలో కూడా వాలెంటైన్ కార్డ్స్ వివిధరకాలయిన చిత్రాలతో, కొటేషన్లతో లక్షల సంఖ్యలో విడుదలవు తున్నాయి. వాటిల్లో ARCHIES VALENTINE CARDS బాగా ప్రచారంలో వున్నాయి.

 

    ప్రేమోత్సవం జరిపే కాలానికి ఆ సమయంలో వుండే వాతావరణానికి చక్కని సంబంధం వుంది.

 

    మనదేశంలో యువతీ యువకులు సంతోషంగా కలిసిపోగలిగే కాముని పూర్ణిమ, హోళీలు పున్నమి రోజునే వస్తాయి. దానినే వసంతోత్సవం అంటారు.

 

    వాలెంటైన్ దినోత్సవాన్ని బ్రహ్మాండం బద్దలయ్యే రీతిలో జరుపుకునే యూరప్ లోకూడా ఫిబ్రవరి నెల వసంతోత్సవ వాతావరణంతోనే వుంటుంది. అది రెచ్చగొడుతుండగా ప్రేమించిన వారిమీదకి మనసు పోవడం సహజం.

 

    ఈ విషయంలో స్త్రీలకు చాలా అన్యాయం జరిగింది. కాల క్రమంలో చీటీలు తీసి జంటలుగా ఏర్పడే అలవాటు అదృశ్యమై పోయింది. మత ఛాందస వాదుల పైత్య ప్రకోపంవల్ల స్త్రీలమీద ఆంక్షలు పెరిగి పోయాయి. గతంలో ప్రేమపట్ల, జంట ఎన్నికపట్ల వారికున్న స్వాతంత్ర్యం క్రమేపీ తగ్గుతూ పోయింది. ప్రేమను వ్యక్తపరిచే స్త్రీల హక్కును మతం కాలరాసింది. ఇలా చేయమని దైవాంశ సంభూతుడైన క్రీస్తు ఎప్పుడూ చెప్పలేదు. ఏ మతమైనా మంచిదే. వచ్చిన చిక్కల్లా ఆ మతాన్ని భుజాలమీదేసుకుని తిరిగే మతమౌఢ్యులు వ్యక్తిగతంగా సిద్ధాంతీకరించే ఫాల్స్ సిద్ధాంతాల మూలంగానే స్త్రీ జాతి అన్యాయానికి గురైంది.

 

    ప్రేమ ఎంత గొప్పదంటే కాలనాగు లాంటి రోషనారాని సైతం తన పరిష్వంగంలోకి లాక్కోగలిగింది. తల్లి, తండ్రి, చెల్లి, అన్న, అక్క, తమ్ముడు అనే రక్తసంబంధాలు లేకుండా కేవలం అధికారంకోసం రక్తపుటేరులు పారించిన దుష్ట మొగలాయి వంశంలో షాజహానుకు జన్మించిన రోషనారా ఒక విషసర్పం లాంటిది. ఎప్పుడూ అగ్నిపర్వంతంలా రగులుతుండేది. ఆమె మనసు ఒక మరుభూమి. మమతాను బంధాలులేని ఊసర క్షేత్రం. మగజాతంటే తీవ్రమైన ద్వేషంతో రగిలిపోయే రోషనారాసైతం ఒక దశలో ప్రేమకు లోనుకాక తప్పలేదు. మరాఠా మహావీరుడు, ఛత్రపతి శివాజీ ఆమె గుండెల్లో కరుడుగట్టుకుపోయిన ప్రేమను వెల్లువలా పైకి రప్పించగలిగాడు. చివరకు ప్రేమలో విఫలం చెందిన రోషనారాకి మరికొన్ని కారణాలు కూడా తోడుకావడంతో వజ్రపుటుంగరంలోని పొడిని ద్రాక్షసారాలో కలుపుకుని తనని తాను అంతం చేసుకుంది" చెప్పడం ఆపింది జయారెడ్డి.

 

    అప్పటికే రెండో లార్జ్ పెగ్గుకూడా పూర్తిచేసిన ఆమె కళ్ళు ఎర్రగా కాంక్షను వెదకుతున్నట్లుగా వున్నాయి.

 

    ఫిబ్రవరి 14 వెనుక అంత చరిత్ర వుందని తెలియని శ్రీధర్ ఓ విచిత్రమైన అనుభూతికి లోనయ్యాడు.

 

    "ఇంతకీ ఇప్పుడెందుకో - ఐమీన్ అపర్ణను ప్రేమించాక ఫిబ్రవరి 14 గురించి ఎందుకు తెలుసుకోవాలనిపించింది?" ప్రశ్నించింది జయారెడ్డి మరోసారి వైన్ గ్లాసులో వంపుకుంటూ.

 

    "థాంక్స్" అని సింపుల్ గా చెప్పి, ఆమెకు మరోమాట మాట్లాడే అవకాశం యివ్వకుండా వేగంగా బయటపడిపోయాడు శ్రీధర్.

 

    'అర్థంకానిది ఆడవాళ్ళ మనస్తత్వం అంటారు కానీ - అప్పుడప్పుడు ఇలాంటి మగవాళ్ళు కూడా....' అని స్వాగతంలో అనుకుంటూ నిట్టూర్చింది జయారెడ్డి.


                               *    *    *    *


    ఒకవైపు చేతి వాచీ చూసుకుంటూనే, పరుగులాంటి నడకతో పది నిమిషాల్లోపే తన ఫ్లాట్ కు చేరుకున్నాడు శ్రీధర్.

 

    వెంటనే డ్రాయింగ్ రూంలో లైటేసి, ఫ్రిజ్ లోంచి వాటర్ బాటిల్ తీసుకొని గడగడ తాగేసి, సోఫాలో రిలాక్స్ డ్ గా కూర్చొని అపరిచితురాలి ఫోన్ కోసం ఆతృతగా ఎదురుచూడసాగాడు.

 

    ఆమె ఇచ్చిన గడువుకి మరో నిమిషం మాత్రమే వుంది.

 

    అతను ఫోన్ కేసి, వాల్ క్లాక్ వైపు చూపులు మార్చి మార్చి చూస్తూ ఉద్వేగం అంచున నుంచొనివున్న వాడిలా వున్నాడు.

 

    ఒక్కొక్క క్షణం భారంగా కదులుతోంది. అతనికిప్పుడు చాలా ఆనందంగా వుంది.

 

    అపరిచితురాలడిగిన ఫిబ్రవరి 14 ప్రశ్నకు తానిప్పుడు సవివరమైన సమాధానం చెప్పగలనని ధీమాతో వున్నాడు. ఆ సందర్భంలో, ఆ సమాధానం తనే కనుక్కున్నట్టుగా చిన్న అబద్ధం ఆడటానిక్కూడా సిద్ధంగా వున్నాడు.

 

    అంత రాత్రివేళ తను తన ఫ్లాట్ లాక్ చేసి జయారెడ్డి దగ్గరకెళ్ళి, ఫిబ్రవరి 14 గురించి తెలుసుకున్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరి దృష్టిలోకి పోలేదు. తను తనుండే 'ఎ' బ్లాక్ నుంచి, 'బి' బ్లాక్ లో వుంటున్న జయారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ,ఎవరూ తనను గమనించలేదు. కనుక ఈ విషయం అపరిచితురాలికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలిసే అవకాశం లేదు అని ఆలోచిస్తూ, వాల్ క్లాక్ వైపు చూశాడు శ్రీధర్. తను ఆలోచనల్లో వుండి గమనించలేదు. కానీ అపరిచితురాలిచ్చిన గడువు దాటిపోయి అప్పటికే రెండు నిమిషాలైంది.