English | Telugu

అన్నయ్య ఢీ కొట్టాడు... త్వరలో తమ్ముడితో!

on Sep 9, 2017

అసలు సిసలైన సినిమా పండగ అంటే మాత్రం కచ్చితంగా సంక్రాంతే. అందరి దగ్గరా డబ్బులు దండిగా ఉండే పండగ సంక్రాంతి. అందుకే... ఆ పండుగకు వినోదాలకే పెద్ద పీట వేస్తారు. ఇందులో ముందుండేది సినిమా. పోయిన సంక్రాంతిలో ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలు పోటీపడి... మూడూ విజయాలను అందుకొని.. తెలుగు సినిమాకు ఈ ఏడాది శుభారంభాన్నిచ్చాయ్. మరి 2018 సంక్రాంతి మాటేంటి? అనే ప్రశ్న ఇప్పటి నుంచే మొదలైంది. మామూలుగా అయితే.. సంక్రాతికి విడుదల చేయాలనుకున్న సినిమాలు నాలుగు. అయితే... వాటిల్లో కచ్చితంగా సంక్రాంతికి రెడీ అయ్యే సినిమా ఏంటో చెప్పలేని పరిస్థితి. ఇక ‘సంక్రాంతికి విడుదల’ అనుకున్న సినిమాల గురించి ముందు మాట్లాడుకుందాం. 

వాటిల్లో మొదటిది.. బాలకృష్ణ-కె.ఎస్.రవికుమార్ సినిమా. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాకు సి.కల్యాణ్ నిర్మాత. కుటుంబ నేపథ్యంలో సాగే మాస్ కథాచిత్రంగా దీన్ని చెప్పుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడమే టార్గెట్గా పెట్టుకొని యూనిట్ పనిచేస్తోంది. నయనతార ఇందులో కథానాయక.

ఇక సంక్రాంతి బరిలో దిగనున్న మరో పుంజు...  పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ సినిమా. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీరి కలయికలో.. జల్సా, అత్తారింటికి దారేది ఘన విజయాల తర్వాత వస్తున్న చిత్రం కావడంపై సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయ్. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ ఈ సినిమాపై అంచాలను మరింత పెంచింది. ఇప్పటివరకూ ఆ సినిమా విషయంలో చాలా పేర్లు వినిపించినా... రీసెంట్ గా అందరి నోటా నానుతున్న పేరు ‘అజ్ఞాతవాసి’. 

మరో సంక్రాంతి పుంజు... ‘భరత్ అను నేను’. ‘శ్రీమంతుడు’ తర్వాత మహేశ్, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇది. ప్రారంభం నుంచి సినిమాపై అంచనాలు ఆకాశంలోనే ఉన్నాయ్. అయితే... ఈ సినిమా షూటింగ్ అంత వేగంగా అయితే జరగడంలేదు. ప్రారంభం రోజున సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పాడు కొరటాల. కానీ.. షూటింగ్ లో మాత్రం అవాంతరాలు తలెత్తతున్నాయ్. మరిన్ని అడ్డంకులనూ అధిగమించి ‘భరత్ అను నేను’ సంక్రాంతికి పలకరిస్తుందా? అనే ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి.

సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న ఇంకో సినిమా రామ్ చరణ్, సుకుమార్ ‘రంగస్థలం’. జనాల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా ఇది. సినిమా టైటిల్.. చరణ్ గెటప్.. లొకేషన్లు ఇలా అన్నీ.. సినిమాపై హైప్ ని పెంచేశాయ్. పిరిడియాకల్ ఫిలింగా ఈ చిత్రం రూపొందతోందని టాక్. నిజానికి ఈ సినిమా మూడొంతులు పూర్తయిపోయింది. ముందు సంక్రాంతికే సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ.. సంక్రాంతికి తన బాబాయ్ పవర్ స్టార్ సినిమా ఉండటంతో.. చరణ్ సంక్రాంతి నిర్ణయాన్ని పక్కన పెట్టినట్టు తెలిసింది. ఒక నెల రోజుల ముందే... అంటే.. డిసెంబర్ కే వచ్చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

దీన్ని బట్టి చూస్తే... రేపు సంక్రాంతికి కచ్చితంగా తలపడనున్న పుంజులు బాలకృష్ణ-పవన్ కల్యాణ్. ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవితో తలపడ్డ బాలయ్య.. ఈ దఫా.. చిరు తమ్ముడు పవన్ తో తలపడనున్నాడు. మరి గెలుపు గుర్రం ఎవరో చూడాలి. 

Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here