ENGLISH | TELUGU  

క‌రెంటు తీగ మనోజ్ స్పెషల్ ఇంటర్వ్యూ

on Oct 31, 2014

ఎన‌ర్జిటిక్ పాత్ర‌ల్లో భ‌లే సూటైపోతాడు మంచు మ‌నోజ్‌. ఇంటి పేరు మంచేమో గానీ.... మ‌నోడు మాత్రం ఫుల్ కంచు. డ‌మ డ‌మ డ‌మ‌... మాట్లాడుతూనే ఉంటాడు. సినిమాల్లోనే కాదు. బ‌య‌ట కూడా! త‌న‌కు సినిమా ఓ ఫ్యాష‌న్‌. ఎంత సంపాదించాడో తెలీదు గానీ, జేబులోని ప్ర‌తీ పైసా మ‌ళ్లీ సినిమాకే ఖ‌ర్చు చేయ‌డం నేర్చుకొన్నాడు. బ‌హుశా.. నాన్న మోహ‌న్‌బాబు ద‌గ్గ‌ర అల‌వ‌ర్చుకొన్న నైజం ఇదేనేమో?! ''ఏదో ఒక‌టి కొత్త‌గా ట్రై చేయాలి భ‌య్యా.. లేదంటే మ‌నం నిల‌బ‌డ‌లేం..'' అంటుంటాడు మ‌నోజ్‌. చేసేవ‌న్నీ అలాంటి వెరైటీ పాత్ర‌లే. త‌న సినిమాల్లో ఫైట్స్ కూడా తానే కంపోజ్ చేసుకొంటుంటాడు. పాట‌లూ పాడేస్తాడు. ఆఖ‌రికి రాసేస్తాడు కూడా. మొత్తానికి ఆల్ రౌండ‌ర్ అనిపించుకొన్నాడు. రేపో.. మాపో డైరెక్ట‌ర్ గా మారినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. మ‌నోజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం క‌రెంటు తీగ‌. శుక్ర‌వారం ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మ‌నోజ్‌తో మాట క‌లిపింది తెలుగు వ‌న్‌. ఆ ముచ్చ‌ట్లు మీ కోసం...

* క‌రెంటు తీగ అంటున్నారు.. షాక్ ఎవ‌రికి?  మీకా, ప్రేక్ష‌కుల‌కా?
- ఇద్ద‌రికీ ఇది తీయ్య‌టి షాక్‌. వాళ్ల‌కో షాకింగ్ సినిమా చూపించ‌బోతున్నాం. మంచి వ‌సూళ్ల‌తో మాకూ షాక్ ఇస్తార‌న్న న‌మ్మ‌కం ఉంది.

* అంత న‌మ్మ‌కం దేనిపై?

- క‌థ బాగా కుదిరిందండీ. త‌మిళ సినిమాకి రీమేక్ అయినా, తెలుగు నేటివిటీ ఎక్క‌డా మిస్స‌వ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాం. ఓ క‌మర్షియ‌ల్ సినిమాలో ఏమేం ఉండాలో అవ‌న్నీ ఈ సినిమాలో కుదిరాయి. సినిమా చూసుకొన్నా.. నేను మాత్రం ఫుల్ హ్యాపీ. ఇన్ని సినిమాలు చేసినా, ఇది వ‌ర‌కెప్పుడూ ఇంత న‌మ్మ‌కంగా లేను.

* ఈ సినిమాకి సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్ స‌న్నీలియోన్ అంటున్నారంతా..
- అలా అనుకోవాల‌నే ఆమెను తీసుకొచ్చాం. తెర‌పై స‌న్నీ క‌నిపిస్తే జనం మ‌మ్మ‌ల్ని మ‌ర్చిపోతారు. స‌న్నీ కూడా అంత షాక్ ఇస్తుంది.

* స‌న్నీ ఓ పోర్న్ స్టార్‌. ఈ విష‌యం తెలిసి కూడా ఆమెను ఎంచుకొన్నారు..
- పోర్న్ స్టారే కావ‌చ్చు. చాలామంది గుట్టుగా చేసే ప‌ని స‌న్నీ ప‌బ్లిక్‌గా చేస్తోంది. అందులో త‌ప్పేంటి?  స‌న్నీ పోర్న్‌స్టార్ అనే విష‌యం నాన్న‌గారికి చివ‌రి వ‌ర‌కూ తెలీలేదు. తెలిశాక కూడా ఆయ‌నేం అన‌లేదు. `అయితే ఏంటి?  సెట్లో ప‌ద్ధ‌తిగా ఉంది. బాగా న‌టించింది. అది చాల‌దా..?` అన్నారు.

* పారితోషికం బాగా చ‌దివించార్ట‌..

- ఎంతిచ్చినా త‌ప్పులేదండీ. ఆమె వ‌ల్ల‌ అంత‌కంత వ‌సూళ్లొస్తాయి.

* ఇంత‌కీ మీకు అందిందా.. పారితోషికం?
- ఈ సినిమాకి మా అన్న విష్ణు నిర్మాత‌. ఓన్ బ్యాన‌ర్ కాబ‌ట్టి డ‌బ్బులు అడ‌గ‌లేదు. బాబ్బాబూ... కాస్త మా నాన్న‌గారికి చెప్పి మీరైనా పారితోషికం ఇప్పించండి. బొలెడు ఖ‌ర్చులున్నాయి (న‌వ్వుతూ)

* అన్న‌కి హిట్టిచ్చాడ‌నే జి. నాగేశ్వ‌ర‌రెడ్డిని ద‌ర్శ‌కుడిగా పెట్టుకొన్నారా?
- దేనికైనా రెడీ సినిమా నుంచీ నాగేశ్వ‌ర‌రెడ్డి తెలుసు. ఆయ‌న క‌ష్టాన్ని సెట్లో స్వ‌యంగా చూశా. ఆ సినిమా విడుద‌ల కాకమునుపే కర్చీప్ వేసేశా. ఈ సినిమాని ఆయ‌న చాలా బాగా తీర్చిదిద్దాడు. ఇద్ద‌రం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. నా కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా ఇచ్చారాయ‌న‌.

* ఇన్ని సినిమాలు చేశారు.. అయితే అదిరిపోయే హిట్ అందుకోలేదు. నిరాశ ప‌డ‌లేదా?
- బిందాస్‌, ప్ర‌యాణం, పోటుగాడు... మంచి సినిమాలే క‌దా..??  నేను ప‌డిన క‌ష్టానికి ఆ ప్ర‌తిఫ‌లం సరిపోయింది. ఫ్లాప్ లు ఎదురైనా నా మార్కెట్ ప‌డిపోలేదు. నా సినిమా వ‌ల్ల ఏ నిర్మాతా న‌ష్ట‌పోలేదు. ఎంత ఫ్లాప్ ఇచ్చినా మ‌రుస‌టి సినిమాకి ఓపెనింగ్స్ బాగుండేవి. ఓ సినిమాని త‌క్కువ బ‌డ్జెట్‌లో ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. సో.. నిర్మాత‌కెప్పుడూ న‌ష్టాలు రాలేదు.

* రిస్కీ ఫైట్స్ చేసి ఇంట్లోవాళ్ల‌ని కంగారుపెట్ట‌డం మానరా?
- జాకీచాన్ కూడా ఇంట్లోవాళ్ల‌ని ఇలానే కంగారుపెట్టుంటాడు. వాళ్లింట్లోవాళ్లూ మానేయ్‌మ‌నుంటారు. జాకీచాన్ మానాడా??  నేనూ మాన‌ను. ఫైట్స్ అలా చేయ‌డంలోనే మ‌జా ఉంది. రోప్స్ క‌ట్టుకొని, డూబ్‌ల‌ను పెట్టుకొని యాక్ష‌న్ సీన్స్‌లో న‌టించ‌లేను.

* యాక్ష‌న్ అంటే ప్రేమ ఎక్కువ క‌దా, పూర్తిస్థాయి యాక్ష‌న్ చిత్రాన్ని మీరే డైరెక్ట్ చేయొచ్చు క‌దా?
- ఎప్పుడో ఓ రోజు త‌ప్ప‌కుండా ద‌ర్శ‌కుడిని అవుతా. కాక‌పోతే.. యాక్ష‌న్ సినిమానా, మ‌రోటా అన్న‌ది తెలీదు. నా సినిమాలో అన్నీ ఉండాలి. యాక్ష‌న్ ఇంకొంచెం ఎక్కువ ఉండాలంతే. పూర్తి స్థాయి యాక్ష‌న్ అంటే క‌ష్ట‌మేమో..?

* మ‌ల్టీస్టార‌ర్ సినిమాల సంగ‌తేంటి..?
- వేదంతో ఓ ప్ర‌య‌త్నం చేశాం. ఇప్పుడంతా అదే బాట‌లో న‌డ‌వ‌డం సంతోషంగా ఉంది. మంచి క‌థ వ‌స్తే.. త‌ప్ప‌కుండా న‌టిస్తా.

* విల‌న్‌గా క‌నిపిస్తా.. అని చాలాసార్లు చెప్పారు..
- ఔనండీ. అది త్వ‌ర‌లోనే నిజం కాబోతోంది. ఓ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నా. ఆ వివ‌రాలు త్వ‌ర‌లో చెబుతా.

* స‌న్నాఫ్ పెద‌రాయుడు సినిమా ఉందా, లేదా?
- లేదండీ. ఆ టైటిల్ ప‌క్క‌న పెట్టేశాం. నిజానికి మా ద‌గ్గ‌ర ఉన్న‌ది టైటిల్ ఒక్క‌టే. క‌థ లేదు. క‌థ దొరికితే అప్పుడు ఆలోచిస్తా.

* ఇంత‌కీ పెళ్లెప్పుడు?
- నేను క్షేమంగా ఉండ‌డం మీకెవ‌రికీ న‌చ్చ‌ద‌నుకొంటా.. (న‌వ్వుతూ). కెరీర్ ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతోంది క‌దా, అవ్వ‌నివ్వండి. ఈలోగా నా గుండెల్లో బెల్ మోగించిన అమ్మాయి క‌నిపిస్తే.. అప్పుడు వెంట‌నే పెళ్లి చేసుకొంటా.

* క‌రెంటు తీగ గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే..
- స్వీట్ అండ్ హాట్ షాక్. థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమా చూడండి. ఎంజాయ్ చేయండి.

* ఒకే. ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీమ‌చ్‌

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.