ఆ ఇద్దరూ కలిస్తే ఇండస్ట్రీ రికార్డ్ వచ్చింది!
on Feb 1, 2020
"మా నాన్న నన్ను పరిచయం చేస్తూ 'గంగోత్రి', తర్వాత 'బన్నీ', ఇంకా ఎన్నో హిట్లిచ్చారు. రాధాకృష్ణ గారితో మొదటిసారి 'జులాయి' చేశాను. అది సక్సెస్ఫుల్ ఫిలిం. తర్వాత 'సన్నాఫ్ సత్యమూర్తి' చేశాను. వీళ్ళిద్దరూ నాకు బెస్ట్ ప్రొడ్యూసర్లు. ఇద్దరితో సూపర్ హిట్స్ కొట్టాను కానీ ఇద్దరూ కలిస్తే ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ హిట్ వచ్చింది. ఇద్దరికీ చాలా థ్యాంక్స్" అని చెప్పాడు అల్లు అర్జున్. మాటల మాంత్రికుడుగా పేరుపొందిన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం 'అల.. వైకుంఠపురములో'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన థాంక్స్ మీట్లో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను షీల్డులతో సత్కరించారు.
ఇందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ, "మా టీం కలిసి చేసింది 50 శాతం అయితే ప్రేక్షకుల దగ్గరకు సినిమాని తీసుకువచ్చింది 50 శాతం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. వాళ్లందరికీ చాలా కృతజ్ఞతలు. నాతో పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరి తరఫున ప్రేక్షకులకు థాంక్స్ చెబ్తున్నా. నిర్మాతలు రాధాకృష్ణ గారికి, అల్లు అరవింద్ గారికి నా ధన్యవాదాలు. మా నాన్నను ఎలా సంబోధించాలా అని ఒక్కోసారి నాకు కన్ఫ్యూజన్ వస్తుంటుంది. ఇంత పెద్ద హిట్ వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌తో సెలబ్రేషన్స్ చేసుకోవడం మా బాధ్యత. ఇక రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం.. 'సిత్తరాల సిరపడు' సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అందులో నేను సిగరెట్ తాగుతాను. అది సినిమాలో ఆ క్యారెక్టర్ని బట్టి చేసింది. నిజజీవితంలో అది మంచిది కాదు. పిల్లలు స్మోక్ చేయవద్దు. పిల్లలే కాదు పెద్దలు కూడా స్మోక్ చెయ్యొద్దని కోరుకుంటున్నాను. అది ఆరోగ్యానికి హానికరం. దయచేసి పొగ తాగకండి. మరోసారి నా అభిమానులకు, నా ఆర్మీకి థాంక్స్ చెప్పుకుంటున్నాను. కేవలం మీ ప్రేమ వల్లే ఇంత దూరం వచ్చాను. ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించిన తెలుగు ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్" అని చెప్పారు.