సౌతిండియా అంటే పిచ్చి: అల్లు అర్జున్
on Jan 23, 2019
తనకు సౌతిండియా అంటే పిచ్చి అని అల్లు అర్జున్ అన్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన 'లవర్స్ డే' ఆడియోకి ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ మాట్లాడుతూ "నేను పుట్టినది చెన్నైలో. హైదరాబాద్ లో పెరిగాను. మలయాళ ప్రేక్షకులు నా సినిమాలను తమ సొంత సినిమాలుగా ఆదరిస్తున్నారు. కర్ణాటకలోనూ నన్ను ఆదరిస్తున్నారు. కాబట్టి నేను సౌతిండియన్. నాకు సౌతిండియా అంటే పిచ్చి.సౌతిండియన్ అని చెప్పుకోవడానికి గర్వపడతాను. సోషల్ మీడియాలో నా ప్రొఫెషన్ సౌతిండియన్ యాక్టర్ అని రాసుకుంటాను" అన్నారు.
తాను 'లవర్స్ డే' ఆడియోకి రావడానికి రెండు కారణాలు ఉన్నాయని అల్లు అర్జున్ అన్నారు. "మలయాళ ప్రేక్షకులు నా సినిమాలను తమ స్వంత సినిమాలుగా ఎంతో ఆదరిస్తున్నారు. అటువంటి మలయాళ పరిశ్రమ నుంచి ఓ ల్యాండ్ మార్క్ ఉన్న సినిమా తెలుగులోకి వస్తున్నప్పుడు దానికి మద్దతుగా నిలబడటం నా బాధ్యతగా భావించాను. అలాగే, 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'ను డిస్ట్రిబ్యూట్ చేసిన వినోద్ రెడ్డి. ఆ సినిమా సమయంలో తను నా అభిమాని అని బన్నీ వాసు పరిచయం చేశాడు. 'నా పేరు సూర్య' విడుదల తరవాత కొన్ని గొడవలైనా వినోద్ రెడ్డి అభిమానంతో ఉన్నాడు. గొడవలకు దూరంగా ఉన్నాడు. అప్పుడు వాసుతో మనకు వీలైనప్పుడు వినోద్ రెడ్డికి ఏదో ఒకటి చేయాలని అన్నాను. ఈ సినిమాను గురురాజ్ గారితో కలిసి వినోద్ తెలుగులో విడుదల చేస్తున్నాడు. అతను పిలవగానే ఈ వేడుకకు వచ్చాను" అని అల్లు అర్జున్ అన్నారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న 'లవర్స్ డే' విడుదల కానుంది.