బాహుబలి నిర్మాతలు ఓకే, మరి వాళ్ళ పరిస్థితేంటి
on Apr 6, 2017
రాజమౌళి పని సినిమా తీయడం వరకు పరిమితం కాదు. తన సినిమాను ప్రమోట్ చేయడంలో కూడా నూతన, మంచి ఫలితాలిచ్చే విధానాల్ని ఎన్నుకుంటారు. ఒక రకంగా, ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ చేయాలంటే రాజమౌళి తర్వాతే ఎవరైనా. కొన్ని రోజుల క్రితం చేసిన ప్రీ రిలీజ్ వేడుక ప్రభాస్ ఫాన్స్ కి ఎప్పటికీ గుర్తుంది పోతుంది. గ్రాండ్ గా చేయడమే కాకుండా, వినూత్నంగా ఆ వేడుక జరిగింది. ప్రస్తుతం, బాహుబలి 2 పనులతో బిజీ గా ఉన్న రాజమౌళి తన మెదడుకి పని చెప్పి నిర్మాతలు, బయ్యర్లకి వీలయినంత ఎక్కువ డబ్బులు తెచ్చిపెట్టే పనిలో ఉన్నారు.
బాహుబలి 2 రికార్డు ఓపెనింగ్స్ సాధిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, బాహుబలి మొదటి భాగాన్ని ఈ నెల 7 కి మళ్ళీ విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రెండవ భాగం చూసే ముందు మళ్ళీ ఒక సారి మొదటి భాగం, అదీ పెద్ద స్క్రీన్ లో చూడాలని సినీ ఔత్సాహికులు అనుకుంటారు. ఇది, బాహుబలి నిర్మాతలకు పంట పండించే వ్యవహారమే, కానీ వచ్చే వారం ఆ తర్వాత వారం విడుదల చేయాలనుకుంటున్న సినిమాల పరిస్థితి ఏంటి. బాహుబలి 2 ఈ నెల 28 కి వస్తుందన్న భయంతో చిన్న, మధ్య తరగతి నిర్మాతలు తమ సినిమాల్ని ఈ రెండు వారాల్లో విడుదలకి సన్నద్ధం చేసుకుంటున్నారు. అయితే, ఇప్పుడు బాహుబలి రూపంలో పెద్ద దెబ్బ పడింది. చూద్దాం బాహుబలి రీ రిలీజ్ ప్రభావం వేరే సినిమాలపై ఎంత వరకు పడుతుందో!