Facebook Twitter
ఆలపిద్దాం ఆనందభైరవి

ఆలపిద్దాం ఆనందభైరవి

శ్రీమతి శారద అశోకవర్ధన్

పుడమితల్లి పొట్టచీల్చుకు పుట్టి
    విస్తరించి నేలంతా నిగనిగలాడుతూ నిలిచి
    వొయ్యారాలొలికి ఏపుగా ఎదిగి

    తుషారబిందువుల మర్దించుకొని
    అభ్యంగన వింజామరలను
    సాంబ్రాణి ధూపంగా వేసుకుని

    ఆకుపచ్చ రంగరించి కోకగా చుట్టుకుని
    తూరుపు ప్రసవించిన చుక్కను నుదుట
    తిలకంగా దిద్దుకుని

    పిటపిటలాడే యౌవ్వనంతో
    నోరూరించే జవ్వనిలా
    అందాలన్నీ సంతరించుకున్న
    ఆమని ప్రియపుత్రికలు గ్రామసీమలు
    పౌష్యలక్ష్మీ వరప్రసాదాలు చిక్కని పంటచేలు
    నాకు జన్మనిచ్చిన లోగిళ్లు!

    ఆకాశాన్ని అందుకోవాలనీ
    నీలిమబ్బుల్లో తెలిపోవాలనీ
    గగన పుష్పాలుకోసి మణిహారాలుగా చేసి

    మెడలో వేసుకోవాలని తపిస్తూ జపిస్తూ
    గ్రీష్మంలో ఇనబింబపు పెనంమీద వేగిపోతూ
    శిశిరంలో తీసిన సైనికుల్లా నిటారుగా నిలిచి
    సరిహద్దు విభజించే కొలబద్దలుగా మిగిలి

    నిశ్శబ్దంతో సైతం తియ్యగా మంతనాలాడుతూ
    కోత్వధ్వనులు పుట్టిస్తూ తపోధనుల సృష్టిస్తూ
    ఓంకారనాదాన్ని దిక్కులు పిక్కుటిల్లేలా ప్రతిధ్వనిస్తూ

    తాము బండబరినా గుండె గుండెలో మధువులు నింపి
    మమతలు పండించే ప్రకృతి కాంత ఆలయాలు
    నా దేశం గర్వించే హిమాలయాలు!

    గలగలా పారుతూ బిరబిరా సాగుతూ
    దారిల్నీ దరుల్నీ రాసుకుంటూ తోసుకుంటూ
    బీడువారిన చేళ్ళనోళ్ళు తడుపుతూ
    ఎండిపోయిన యెదల సేదదీరుస్తూ
    ఉరుగుల పరుగులతో నురుగుల్ని చిందుకుంటూ

    పాపాలనూ శాపాలనూ తామందుకుని
    తాపాలను తొలగిస్తూ
    జడత్వాన్ని ఝడిపించి వెడలగొట్టి

    చైతన్యానికి సంకేతంగా
    మనుగడకు మార్గంగా
    నిలిచిపోయిన పవిత్ర నదీనదాలు
    నాదేశపుటౌన్నత్యానికి చిహ్నాలు!

    నాతల్లి పసుపుపారాణి పాదాలు
    కాశ్మీరం కన్యాకుమారి ప్రాంతాలు!

    పంజాబూ గంజామూ పశ్చిమ బెంగాలు
    తెలుగు తమిళ కన్నడ మళయాళ దేశాలు
    నాతల్లి మేనులోని వొంపు సొంపుల హొయలు
    ఉత్తర భారతం ఆమె పాపిట సింధూరం!

    ఇతర దిక్కులు ఆమెకు శృంగార దివ్య అలంకారాలు
    వేయేల? పేరేల? ప్రతి ప్రాంతం నాతల్లి మెడలో
    ధగధగా మెరిసే వజ్ర వైఢూర్యాల ఆభరణం.

    ఈ అందచందాల కదంబాన్ని
    జడలో తురుముకున్న నవజవ్వని నన్ను గన్నతల్లి

    నాకు ప్రాణంపోసి రూపు దిద్దిన కల్పవల్లి
    గంపెడు బిడ్డలను కన్నా గారాబంగా
    పెంచిన ఘనత ఆమెకే దక్కింది

    ఒక్కొక్కరిని ఆణిముత్యాలుగా తీర్చిదిద్దిన
    మురిపెం ఆమెకే మిగిలింది.

    సంగీతం సాహిత్యం నాట్యం శిల్పం
    అరవై నాలుగు కళలలో ఆమెదే అగ్రస్థానం
    ధర్మపీఠానికి ఆమే మూలస్థానం

    వేదం ఆమెనాదం!
    శాస్త్రం ఆమెశ్వాస!

    అటువంటి నాతల్లికి ఏ కంటి దిష్టి తగిలిందో
    బెదరగొట్టి చెదర గొడుతున్నాయి
    సుందర స్వప్నాల సౌధాలు
    బెంబేలెత్తిస్తున్నాయి అణ్వస్తాల
    భయంకర భూతపిశాచాలు

    నాతల్లెకాడు యావద్ ప్రపంచ తల్లడిల్లిపోతోంది
    గడగడలాడి పోతోంది వాటిని చూసి

    ఊహకందని పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే
    గజగజలాడిపోతోంది!

    కులమతాల కుళ్లువ్యవస్థ కుష్ఠురోగంలా
    పట్టి పీడిస్తూంటే
    నివారణోపాయాలు లేక కృంగిపోతూన్న
    మానవుడొక పక్కా

    కలిమిలేముల ఒడుదుడుకుల ముంగిల్లో
    ముద్దాయిలా మాట్లాడలేక
    కార్పణ్యంతో బుసలుకొట్టే కోడెనాగులు
    విషపుగాలులు మరోపక్కా

    ఎరువుతెచ్చుకున్న నాగరికత ముదిరి
    వెఱ్ఱితలలు వేస్తూ
    నట్టింట్లో నగ్నంగా నర్తిస్తూంటే
    రెచ్చగొట్టి జనతను పెడతోవ పట్టిస్తూంటే

    మనసున్న మనిషి మనలేకపోతున్నాడు
    బ్రతుకుంటేనే భయపడి పోతున్నాడు
    మత్తుపదార్ధాల మిశాలో ఉషారుగా తేలిపోయే
    తరాన్ని చూసి

    బద్దలవుతూన్న గుండెని గుప్పిట్లో పట్టుకొని
    బజారుపాలవుతూన్న పరువుని పట్టుకోలేక
    ఉస్సురంటున్నాడు
    దస్సిపోతున్నాడు!

    పైశాచిక శక్తులకు ప్రాణం పోసి
    తోటిమనిషి ప్రాణాలతో ఆడుకునే దానవుడిగా
    మారిపోయిన మనుష్యుల వికృత చేష్టలను చూసి
    మగ్గిబుగై పోతున్నాడు మనసున్న మనిషి-

    మారణ హొమాల మంటలనార్పలేక
    అండకుండా వ్యవస్థకి దూరంగా పారిపోతున్నాడు

    పులినిచూసి పులి ఝడవడం లేదు
    మనిషిని చూసి మనిషి బెదిరిపోతున్నాడు  
    అయినా నేను కృంగి పోను
    నిరాశా నిట్టూర్పుల్లో కాలిపోను

    తరతరాలుగా నాలో జీర్ణించుకు పోయిన
    నా నమ్మకాలు వమ్ముకావు
    యుగయుగాలుగా నాలో పాతుకు పోయిన
    నరనరాల్లో ప్రవహించే నీతిబోధలు వృధాకావు

    నాలో కొత్త ఆశలు రేపుతాయి
    నాకు కొత్త ఊపిరి పోసాయి
    నాతరం మారుతుంది
    భావితరం బాగుపడుతుంది

    శ్రామికుడి కళ్లల్లో కాంతిరేఖలు వెలుగుతాయి
    కర్షకుడి ఇళ్లల్లో ధాన్యరాసులు నిండుతాయి
    భారతావనిలో సమతా మమతలు
    హరివిల్లై విరుస్తాయి!
  
    ఎందుకంటే?

    సహనం మన ధ్యేయం
    శాంతి సాధన మన లక్ష్యం!

    కులం మతం భేదం విడిచి
    క్రూరత్వానికి కోరలుపీకి

    భాషాభేదాలు బీజం మనలో నాటుకోకుండా
    ప్రాంతీయ వాదాల తత్వల మనలో చోటు చేసుకోకుండా
    చేయి చేయీ కలిపి ఎక్కుదాం ఐక్యత పడవ
    చేరుదాం మమకారపు పందిళ్ల కింద తడవ తడవ!

    తల్లడిల్లే తల్లి మనస్సును అర్ధం చేసుకుని
    కల్లబొల్లి మాటలతో కాలం వృధా పుచ్చకుండా

    విజ్ఞానాన్ని విధ్వంసకు వాడకుండా
    వినాశనాన్ని కోరకుండా

    వేద్దాం శాంతి బాటలు
    నిర్మిద్దాం క్రాంతి తోటలు
    నవభారత నిర్మాణంలో మనం సైతం

    ఒక సమిధగా వెలుగుదాం
    చీకట్లను తరుముదాం
    ఇక్కట్లను దునుముదాం
    అమ్మగుండెకు తగిలిన గాయాలను మాన్పుదాం

    భారతావనికేకాదు ప్రపంచ మొత్తానికే
    శాంతి సూత్రాలను ప్రభోదిద్దాం

    సహనం మన ధ్యేయం
    శాంతి సాధన మనలక్ష్యం!

    ప్రతి రాష్రం ఒకచుక్కైతే
    విడి  విడిగా వున్న చుక్క చక్కనీ
    కలిపే చక్కని గీతగా మారుద్దాం
    అందమైన ముగ్గుగా తీర్చి దిద్దుదాం

    ముగ్గు ముగ్గునూ కలుపుకుంటూ పోయి
    ముద్దు ముగిపాలతో వర్దిల్లుద్దాం
    ఆడుకుంటూ పాడుకుంటూ ఏకకంఠంతో
    ఆలపి ఆనందభైరవిని