Facebook Twitter
రాజీ

   రాజీ

 

       

 

 “వెడదామా“ అంది శ్రావణి భర్తనుద్దేసించి.
మాట్లాడలేడతను! ఐదునిముషాల తరువాత నెమ్మదిగా లేచాడు.
షర్టు వేసుకునేతీరే చెబుతోంది అతనిలోని అయిష్టతను.
ఇద్దరు కలిసి క్లినిక్ కు వెళ్లారు.
డాక్టరు “రండి” అంటూ లోనికి తీసుకెళ్ళింది.
ఆరోజు శ్రావణికి కృతిమ ఫలదీకరణకు [artificial insemination ]అనువైన దినం. అంతా టైం ప్రకారం నడవాలి...
సాయంకాలం క్లినిక్ బయటకు వచ్చిన శ్రావణి లో ఓ ఆనందం! తనూ అందరిలాగా తల్లి కాగలను అన్న ఆశ ఆ ఆనందానికి కారణం.


భర్త సాగర్ ను చూడగానే అతనెంత అసహనంగా వున్నాడో తెలిసిపోతుంది. ఆమె ముఖంలో ఆనందం చటుక్కున మాయమైంది. అతను శ్రావణి వంక చూడకుండా బయటికి నడిచాడు. ఆటోలో ఇంటికి వచ్చారు. దారి పొడుగునా ఒక్క మాట కూడ మాట్లాడలేడతను. శ్రావణి వంక ఒకసారి కూడా చూడలేడతను.


ఇంట్లోకి రాగానే “నాకు ఆకలిగా లేదు. నువ్వు భోన్చేయి” అని వెళ్ళి పడుకున్నాడు. అతనిలో అసహనతను అర్థం చేసుకుంది శ్రావణి. అతన్ని ఒత్తిడి చెయ్యకుండా వెళ్ళి తను భోంచేసి౦ది. క్లినిక్ లో జరిగిన కార్యక్రమం తరువాత తనకోసం కాకపోయినా తన శరీరంలో వచ్చే మార్పుకోసమైన తినాలి అనుకుంది. తిన్నాక మెల్లిగా సాగర్ ప్రక్కన పడుకుని గడచిన రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంది . 
************************************************        

                  
పెళ్లి అయిన ఈ రెండేళ్లకాలం లో పిల్లలకోసం తనూ పడ్డ తపన అంతా ఇంతా కాదు. పిల్లలంటే అంతా ఇష్టం తనకు మరి! 
“ఏదైనా విశేషమా “ అని అడిగే అత్త గారి ప్రశ్నకి ”ఇదో ఇన్నోనెల అత్తయ్యా” అని సమాధానం చెప్పాలని చాలా వున్నా అది సాధ్యపడలేదు.


డాక్టరును కలుద్దామని అడిగితే సాగర్ సహకరించలేదు. ఎంతో పోరిన తరువాత అతను అంగీకరిస్తే డాక్టరు దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకున్నారు. అక్కడ తేలిన ఫలితాలకు షాకు తినాల్సి వచ్చింది. పిల్లలు పుట్టక పోవడానికి కారణం సాగర్ లో స్పెర్మ్ కౌంటు [sperm count]చాలా తక్కువ వుండటం అన్న నిజం జీర్ణించు కోవడం కష్టం ఇయ్యింది. అతని స్పెర్మ్ తో ఫలదీకరణ [fertilization] సాద్యం కాకపోవచ్చు అన్న సందేహం వ్యక్త పరిచింది డాక్టరు .


తరువాత కొన్ని రోజులు స్తబ్దత....
ఎందుకిలా జరిగింది..అన్న ప్రశ్నకి జవాబు లేదు 
మాకే ఈ సమస్య రావాలా అన్న ఆవేదన....
ఆ తరువాత “ఏమీ చెయ్యాలి?” అన్న ప్రశ్న
జవాబుగా ఎంతో పరిశోధన...తేలింది ఒక్కటే A I [artificial insemination]అన్న శాస్త్ర సాధికారత..
“తప్పేమిటి?“ అన్నది శ్రావణి ప్రశ్న. 
జవాబు చెప్పని సాగర్. 
అలాగైనా సంతానాన్ని పొందవచ్చు అన్న శ్రావణి ఆశ. దాని వెనుక సాగర్ లోని దోషం లోకానికి తెలియక్కర లేదు కదా అన్న ఆలోచన..
“ప్లీజ్  ఒప్పుకొండి“ అంటూ శ్రావణి అభ్యర్థన!
తన దోషాన్ని ఒప్పుకోలేక పోతున్న సాగర్ మనసు..
శ్రావణిని దగ్గరకు తీసుకున్నప్పుడల్లా గుర్తుకు వచ్చేది  తను ఆమెను తల్లిని చెయ్యలేనన్న బాధ..
“వంశాంకురం తో ఎప్పుఆడుకోనిస్తారు?“ ఆశగా అడిగే సాగర్ తల్లి ..


భగవంతుడు నన్ను ఎందుకిలా చేసాడు? ఏమాత్రం అనుమానం వున్నా పెళ్లి చేసుకునేవాడు కాదు కదా. కాని ఇప్పుడు పిల్లలు పుట్టలేదనుకోవడంతో సరిపోదు. తండ్రిని కాలేను అన్న నిజం శాపంలా వెన్నాడదా? సాగర్ ఆలోచించ లేకపోతున్నాడు.......ఎంతో మానసికసంఘర్షణ తరువాత  శ్రావణి చెప్పిన విధంగా A I [artificial insemination ] ద్వారా సంతన సాపల్యానికి మొగ్గు చూపాడు. అలాచేస్తే అందరు తనను తండ్రిగా గుర్తిస్తారని అనిపించింది. కాని ఎక్కడో బాధ..ఆ బాధల ఛాయలు అతని ముఖం లో, నడవడి లో కనిపిస్తూనే వున్నాయి. అయినా ఆరోజు క్లినిక్ కార్యక్రమానికి సహకరించాడు.
*************************              

                
మరురోజు శ్రావణి ఒడిలో తల పెట్టుకుని నిశ్శబ్దంగా రోదించాడు. తాము చేసిన పని తప్పు కాదని అనునయించింది శ్రావణి. తమలాటి వారికి ఇలా సంతానం పొందటం ఒక వరం అంది. మీ భార్యగా నా గర్భం లో వూపిరి పోసుకునే ఓ ప్రాణికి తండ్రిగా ఆప్యాయత ఇవ్వలేరా అని అడిగింది.


సమాధానంగా కళ్ళు మూసుకున్నాడు సాగర్.
సైన్సు ఇంత అడ్వాన్సు అయినా తనలాటి వాడి మనసు అడ్వాన్సు అవుతుందా? నిజంగా శ్రావణి కడుపులో పెరిగినంత మాత్రాన ఆ బిడ్డని తన బిడ్డగా చెప్పుకునే మనస్త్యర్యం తనకుందా???? ఎలా సమాధాన పరచుకోవాలన్నా సాద్యం కాలేదు అతనికి .
*********************                     


మరో నెల రోజులు ప్రతి రాత్రి శివరాత్రే అయ్యింది..
సాగర్, శ్రావణి ల మద్య మాటలు కరువైనాయి. శ్రావణిని సాగర్ ముట్టుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇలా దూరం పెరుగు తున్న కొద్ది శ్రావణి లో అంతర్మధనం ప్రారంభమైంది. తను చేస్తున్న పని మంచిదేనా? అన్న అనుమానం వచ్చింది. తల్లిని కావాలన్న తీవ్రమైన కోరికకు బానిసై తనూ సాగర్ ని పోగొట్టు కుంటుందా? అలా నిజంగా జరిగితే జీవితానికి అర్థం ఏమిటి? కేవలం తల్లి కాగల్గితే చాలా? అదే సంతోషంతో జీవితమంతా గడపగలదా? సాగర్ లోని దోషాన్ని కప్పి పుచ్చడానికే తనూ ప్రయత్నిస్తోందా? లేక తనూ గొడ్రాలు అనిపించుకో కూడదనే  తపనే ఎక్కువగా వుందా? ఇలా సాగిన శ్రావణి ఆలోచనతో మనసు చాలా బాధకు గురి అయింది.


ఒక వైపు శ్రావణి, మరో వైపు సాగర్...తమవైన ఆలోచనలతో చాలా బాధ పడుతూ ఇంట్లో శాంతి కరువైపోయేలా  చేసుకున్నారు. ఇక ముందు ఆ ఇంట్లో పాప పుట్టినా సంతోషకరమైన వాతావరణం వుంటుందని నమ్మకం లేకుండా పోయింది..
ఈ అంతర్మధనం లో దేవుడు తనదైన శైలి లో సహాయం చేసాడు. అత్యంత మానసిక క్షోభకు గురి అయిన శ్రావణికి అబార్షను అయింది మూడవ నెలలోనే. 
ఒక్కసారిగా బరువు దించుకున్నట్టయ్యింది  శ్రావణికి.
సాగర్ ముఖంలో సంతోషం వ్యక్తమైంది!
మరో వారం రోజుల్లో వారి జీవితాలు నార్మలుకు వచ్చాయి.


ఎంతమందికో జీవిత పరమావధి అనిపించేది సంతానం. భార్య ,భర్త లలో ఎలాటి దోషం వున్నా సరి చేసి సంతానం కలిగేలా చేయ గలదు సైన్సు. సంతాన సాఫల్య క్లినిక్స్ అద్భుతాలు సృష్టిస్తున్నా వాటి సాధికారతని జీర్ణించుకునే మానసిక స్థైర్యం లేని సాగర్ శ్రావణి లాటివారూ వుంటారు. భార్య భర్త లు నిజానికి మానసికంగా ఎంతో ఎదగాలి. లేకపోతె ఆవిధంగా పొందే సంతానం వల్ల సంతోషం కన్న ఆవేదనే మిగిలుస్తుంది. పూర్తీ మానసిక సంసిద్ధత వున్నప్పుడే అన్నీ సానుకూలంగా జరుగుతాయని సాగర్ శ్రావణి ల అంతర్మధనం చెబుతుంది.
*********************        


కొస మేరుపెమిటంటే......
మరో నెల లోనే ఓ అనాధ శరణాలయం లోని పసి పాపను దత్తత తీసుకున్నారు సాగర్ శ్రావణి లు. తమకు పిల్లలు పుట్టలేదని బాధ లేదు. ఓ అనాధకు  ఆశ్రయం కల్పించాలని సంతోషంగా రాజి పడ్డారు..
ఆలోచిస్తే......
తన లోపాన్ని కప్పి పుచ్చుకునేందుకు తన భార్య కడుపున పెరిగే బిడ్డ కన్న ఓ అనాధకు తండ్రిగా వుండటానికే ఇష్టపడ్డాడు సాగర్.....తల్లి కావాలనే ఘాడమైన కోరికకు సమాధి కట్టి భర్త సంతోషానికే రాజీ పడింది శ్రావణి.
లోపం శ్రావణి లో వుండి వుంటే సాగర్ ఎలాటి నిర్ణయం తీసుకునేవాడు? సగటు భారతీయ భార్యగా  దాని గురించి ఆలోచించ దల్చుకోలేదు శ్రావణి!
***************************


రచన- డా. లక్ష్మీ రాఘవ