Facebook Twitter
“అజ్ఞాత కులశీలశ్య….” 2వ భాగం

 

“అజ్ఞాత కులశీలశ్య….” 2వ భాగం


ఎక్కడో పర్షియా దేశం నుంచి భరతావనికి వచ్చి, ఒక్కొక్కటిగా దారిలో దేశాలనాక్రమిస్తూ వచ్చిన ముసల్మానులు భారత దేశంలో స్థిరపడి పోయారు.. రాజులుగా, చక్రవర్తులుగా! ఒకరి వెనుకగా నొకరుగా..

   కం.  కొండల కోనల కనుమల
          దండుగ దండెత్తి బలిమి దాడిని సలిపీ
          దండకమున జనుల నరికి
          పండుగ చేసి కొనుమనుచు పర దొర లుడివెన్.  .
          
   ఆ పర దొరలు అన్ని దిక్కులకూ చొచ్చుకుని వచ్చి ఆక్రమించ సాగారు.
   పదిహేనవ శతాబ్దపు ఆరంభంలో, వంగదేశాన్ని చేజిక్కించుకుని పాండువా రాజధానిగా  ఘియాజుద్దీన్ అజమ్ షా పాలించాడు. అక్కడ దినాజ్ పూర్ అనే ఊరికి హకీమ్(గవర్నర్)గా ఉన్న  రాజా గణేశు,  ఆ రాజును చంపి వంగదేశ సింహాసనాన్ని  అధిష్టించాడు. కానీ, వెనువెంటనే  సరిహద్దుల్లోని జానుపురం సుల్తాను దండయాత్రనెదుర్కోవలసి వచ్చింది. పరిస్థితుల ప్రాబల్యం వల్ల కొడుకు ‘జాదూ’ని ఇస్లామ్ మతానికి మార్చడానికి ఒప్పుకుని, జలాలుద్దీన్ అనే పేరుతో పట్టం కట్టాడు. జానుపూర్ సుల్తాను వెను తిరిగాడు.
  సుల్తాన్ యుద్ధం విరమించుకుని వెళ్ళగానే, మళ్ళీ కొడుకు మతం మార్చి తను సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. హిందూ పండితులు ఆ మార్పిడిని ఒప్పకోలేక పోయారు, రాజు భయానికి తలలూపినా!
  అందుకే కాబోలు.. జాదూకి ఇస్లామ్ మతం అంటేనే గురి కుదిరింది.
  సంవత్సరం లోగానే..  జలాలుద్దీన్ అనుచరులు గణేశుడిని చంపి, అతన్ని రాజుని చేశారు.
  ఆ పోరుల్లో రాజా గణేశుని అంతఃపురం అంతా అయోమయంలో మునిగిపోయింది. ఎవరు ఏమతాన్ని అనుసరిస్తున్నారో.. పూజలు చెయ్యాలో నమాజు చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి.
  చిన్నరాణీగారి చెల్లెలు దుర్గాదేవి. ఆవిడ భర్త కూడా గణేశ వంశంవాడే. రాజుకు తమ్ముడౌతాడు, గణేశునికి కుడి భుజమై కనుసన్నలలో ఉండేవాడు.
  రాజా గణేశ్ నిస్సహాయ స్థితిని చిన్ననాటి నుంచీ గమనిస్తూనే ఉంది దుర్గాదేవి. అంతఃపురమంతా ముసల్మానులు.. గణేశుని ద్వంద్వ వైఖరిని నిరసించి అతన్ని మట్టుపెట్టిన వారు. జలాలుద్దీన్ సింహాసనమెక్కగానే మతమార్పిడులు ఉధృతంగా మొదలయ్యాయి.
  దుర్గాదేవి మతమార్పిడులను నిరసించింది. జన్మతః ఉన్న మతాన్ని ఎందుకు మార్చుకోవాలి? అంతఃపుర స్త్రీలలో యుద్ధ నైపుణ్యం ఉన్నది ఆమెకే! గణేశుని తమ్ముడైన ఆమె భర్త ని, హిందూమతాన్ని బలపరుస్తున్నాడని రాజా గణేశునితో పాటే సంహరించారు.
  తప్పని సరిగా.. భర్తలు లేని స్త్రీలంతా ముసల్మాన్ సైనికులకి బీబీలుగా మారిపోయారు. ఇష్టంలేని వారు కొందరు ప్రాణ త్యాగం చేశారు. కొందరిని పారిపోతుంటే మాన ప్రాణాలని కొల్లగొట్టారు.
  కొన్ని రోజులు అంతఃపురంలో మహారాణి నీడలో తలదాచుకున్న దుర్గాదేవి కొడుకుని తీసుకుని పారిపోవాలని నిశ్చయించుకుంది.. కానీ ఏ విధంగా? ఎక్కడికక్కడ కాపలా! రోజూ ముస్లిమ్ స్త్రీ లాగానే మేలి ముసుగు వేసుకునే ప్రాసాదం అంతా తిరుగుతూ పరికిస్తోంది. తన చిన్న మందిరంలో మాధవుడికి యుద్ధ విద్యలు నేర్పిస్తూ కర్తవ్యాన్ని బోధిస్తోంది.
  అనుకున్న సమయం ఆసన్నమయింది..
  ఆ రోజు ఈద్.. అందరూ పండగ పిండివంటలు సుష్టుగా తిని ఆయాస పడుతున్నారు.
  “మంచి జీరా పానీ భాయ్.. తిన్నది అరిగి తేలిగ్గా ఉంటుంది. సేవించండి.” అందరికీ మత్తుమందు కలిపిన పానీయాన్ని అందించింది.
  మాధవుడు కూడా పొడుగాటి కమీజ్ వేసుకుని పానీయం అందిస్తున్నాడు.
  కొద్దిగా ఏమరుపాటుగా ఉన్నారు అందరూ..
  మహారాణీకి కూడా చెప్పలేదు..
  భర్త తరచుగా వెళ్ళే, కళింగ దేశం లోని ‘కటకం’ పట్టణానికి వలస వెళ్లాలని నిశ్చయించుకుంది. అతడికి ఆ పట్టణంలో స్నేహితులున్నారని అనేవాడు. అక్కడికి ఇంకా శతృవుల బెడద వచ్చినట్లు లేదు. భర్త వాడిన గుర్రాన్నే తయారుగా ఉంచింది.. మగ వేషం వేసుకుని, సర్ది పెట్టుకున్న సామాన్లు తీసుకుని మాధవుడితో సహా గుర్రం ఎక్కి, వంటశాలకి సరుకులు తెచ్చే దారిలోనుంచి కోట దాటింది.
  సాధారణంగా అటు నుంచి బైటికి వెళ్ళే వారిని ఆపరు.. ఆ సంగతి గమనించే ఆ మార్గాన్ని ఎంచుకుంది దుర్గాదేవి.
  దక్షిణదిశగా పయనం సాగించింది.
  బయలుదేరి రెండు రోజులయింది. ఇంక క్షేమంగా తప్పించుకున్నామనే అనుకుంది.
  కానీ.. అతఃపురంలో గలగల లాడుతూ తిరిగే మాధవుడు కనిపించకపోతే అనుమానం వచ్చేసింది అందరికీ!
  వేట మొదలయింది. స్వయంగా మహారాజు జలాలుద్దీన్ ఆదేశాలిచ్చాడు.      
  కోట ఆనుపానులన్నీ తెలిసిన దుర్గాదేవి వలన ఎప్పటికైనా అపాయమే..
  ఇద్దరు సైనికులకి వాయువేగంతో నడిచే గుర్రాలనిచ్చి పంపించాడు రాజా జలాలుద్దీన్.
  వారే.. దుర్గాదేవిని అడ్డుకుని చంపేశారు. కానీ.. ముందుకు వెళ్ళి మాధవుడిని ఆపలేరు. ఏ దేశానికి వెళ్తున్నాడో, ఏ కొండల్లో కోనల్లో దాగి ఉంటాడో ఎవరు చెప్పగలరు?
  తమ గుర్రాలని నెమ్మదిగా నడిపించుకుంటూ సమీప గ్రామానికి బయల్దేరారు.
  “తల్లీ కొడుకులిద్దరినీ చంపేశామని చెప్దాము. ఇద్దరము ఒకే మాట మీదుండాలి.” ఒకరినొకరు హెచ్చరించుకున్నారు.
  ఆనమాలుగా దుర్గాదేవి ఖడ్గాన్ని తీసుకున్నారు. ఆవిడ వీపుకి కట్టుకున్న మూటని విప్పారు. ఏమైనా నాణాలు దొరకచ్చేమో.. జలాలుద్దీన్ పాదూషా నాణాలకి ఏదేశంలో నైనా విలువ ఎక్కువే!
  దుర్గాదేవి తెలివి తక్కువ అతివ కాదు.. నాణాలని మాధవుడి వీపుకి కట్టింది. ఏ ఆపద వచ్చినా కుమారుడిని రక్షించడమే ప్రధమ కర్తవ్యం. అవసరమైతే అశ్వం కూడా తన ప్రాణాలనే ముందు వదులుతుందని తనకి అవగతమే!
   సైనికులిద్దరూ నిరాశతో వెనుతిరిగారు.. దుర్గాదేవి భుజాలకి కట్టిన మాధవుడి అంగీలని తీసుకుని.. ఖడ్గంతో సరిగా అవి కూడా సాక్ష్యాలే మరి.
                                         …………..

మాధవుడు ఒక రకమైన మొండితనంతో ముందుకు సాగుతున్నాడు.అమ్మ దగ్గర గారాలు పోయే వయసులో ఒంటరి పోరాటం.. పరిస్థితులే కావలసిన ధైర్యాన్ని, తెలివినీ ఇస్తాయి.
అదే.. బ్రతకాలనే పట్టుదల. సృష్టిలోని ప్రతీ పాణికీ ఉండేది.  కొన ఊపిరితో నైనా పోరాడే శక్తినిచ్చేది ఆ ఆశే!



 కం.  వలలో చిక్కిన పులుగులు*
            జలధిన్ మునిగిన పశువులు, జారిన ఇలకున్
            జల చరములు,  సర్పములు న
            కులముల* నోట బడిన నవి  కోరును శక్తిన్.     
  
           

చీకటి పడుతూ ఉండగా అడవి చివరనున్న గ్రామానికి వచ్చాడు. ఆ దారిలో అనేకసార్లు మాధవుడి తండ్రిని తీసుకెళ్ళిన గుర్రం, అలవాటుగా ఒక పూటకూళ్ళ ఇంటి వద్ద, అరుగు పక్కగా ఆగింది.
  నెమ్మదిగా గుర్రం దిగాడు మాధవుడు. ఎవరితో ఎలా మాట్లాడాలి? బెదురుగా అటూ ఇటూ చూస్తూ నిలుచున్నాడు. ఎన్నడూ అంతంత దూరం ప్రయాణించ లేదేమో.. తూలు వచ్చింది.  సైనికులు వెంటాడుతున్నారేమోనన్న అనుమానం.. వెనుతిరిగి అమ్మ వద్దకు వెళ్దామని ఉన్నా, ఆమ్మ ఆజ్ఞ పాటించవలసిన ఆవశ్యకత ఆపేసింది.
  అరుగు మీదనే కూర్చుని, మొహం మోకాళ్ల మీద పెట్టుకుని కుమిలిపోసాగాడు. అమ్మ ఏమయింది? ఎక్కడుంది? ఆ చిన్ని మనసుకు తెలుసు.. ఇంక అమ్మ రాదని. కానీ తట్టుకోగల వయసు లేదు. చిన్న నాటి నుంచీ యుద్ధాలు, చంపుకోవడాలు చూస్తూ ఉన్నా కూడా.. అప్పుడు ఓదార్చడానికి అమ్మ ఉంది. ఇప్పుడూ.. ఎవరున్నారు?
  భుజం మీద చెయ్యి పడింది ఎవరిదో! ఉలిక్కిపడ్డాడు మాధవుడు. వెన్నులోంచీ వణుకు వచ్చింది. అమ్మ చెప్పిన జాగ్రత్తలు మర్చిపోయి ఏమరుపాటుగా ఉన్నాడు.
  ఒళ్లంతా కుంచింపజేసి అరుగు మీదనుంచి గుర్రం మీదికి దూకి కళ్ళెం లాగాడు.
  కానీ గుర్రం కదల లేదు.
  ఇంకా ఏడుపొచ్చేసింది.. గుర్రం అలసిపోయింగా? అకలేస్తోందా? మరణమే శరణ్యమా?
  “బాబూ! భయం లేదు. కిందికి దిగు.” చల్లని పిలుపు.
  ఐనా.. భయంగానే చూశాడు బాలుడు.
  తలంతా ముగ్గుబుట్టలా అయిపోయిన ఒక ముసలమ్మ.. నుదుటి మీద పెద్ద కుంకుం బొట్టు. ముఖమంతా ముడుతలు. చిరునవ్వు నవ్వుతూ పిలిచింది.
  ప్రసన్నవదనంతో పిలుస్తున్న కాళీమాతలా అనిపించింది మాధవుడికి.
  వెంటనే దిగి, ఆవిడ ఒళ్ళో తల పెట్టి బావురుమన్నాడు.
  “అమ్మా.. అమ్మా..” వెక్కెక్కి ఏడవసాగాడు.
  తన చేత్తో మాధవుడి వీపు నిమురుతూ ఓదార్చింది ఆ పూటకూళ్లమ్మి.
  “ఎవరు బాబూ నువ్వు? ఎక్కడికి పయనం?”
  “వంగ సైనికుల నుండి తప్పించుకుని వస్తున్నాను. కటకం వెళ్ళాలి. ఇది ఏ గ్రామం? ఇక్కడికెంత దూరం కటకం?” తన పేరు చెప్పి, వెక్కుతున్నా స్పష్టంగా అన్నాడు మాధవుడు.
  గుర్రం సకిలిస్తుంటే అటు చూశారు ఇద్దరూ. తల నిలువుగా ఆడించింది అశ్వం.
  “ముందు నువ్వూ నీ గుర్రం ఆకలి తీర్చుకుని సేద తీరండి. పిదప మాట్లాడుకుందాం.” అవ్వ, మాధవుడిని తీసుకుని లోపలికి నడిచి, ఎదురైన నడి వయస్కుడికి గుర్రం సంగతి చూడమని చెప్పింది.
  “నీ దుస్తులు, పరికరాలు నా కుమారుడు తీసుకుని వస్తాడు మాధవా! ఈ లోగా నిశ్చింతగా స్నానం చెయ్యి. ఎన్నడనగా బయలు దేరావో.. ఇక్కడికి వంగ సైనికులు రారు. ఇది ఉత్కళ దేశం సరిహద్దులో నున్న బాలేశ్వర్ గ్రామం. అడవిని దాటావు కనుక క్షేమమే! ఎందుకైనా మంచిది, గుర్రాన్ని వెనుక భాగంలో కట్టెయ్యమని చెప్తాలే.”
  మాధవుడికి ఉన్నట్లుండి నీరసం వచ్చేసింది.
  నిలుచున్న చోటే స్పృహ తప్పి తొక్కలా కిందికి వేళ్ళాడి పోయాడు.
  “అయ్యో! ముక్కు పచ్చలారని పాపడు.. వయసుకు మించిన అనుభవాలు. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు పాపం..” అనుకుంటూ నెమ్మదిగా లేపి, నడిపించి తల్పం మీద పరుండబెట్టింది బాలవ్వ, వంగ, కళింగ దేశాల మధ్య రాకపోకలు సాగించే వర్తకులకి, సైనికులకీ, యాత్రికులకీ అన్నపూర్ణాదేవిలా ఆదరించే పూటకూళ్ళవ్వ.
                                  ………………..

( *పులుగులు = పక్షులు; *నకులములు = ముంగిసలు)

 

“అజ్ఞాతకులశీలస్య..”  పార్ట్ - 1

 

 

 

 

 

......మంథా భానుమతి