Facebook Twitter
విశ్వసనీయత

విశ్వసనీయత

 

 

అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఫకీర్‌ అనే ఒక స్నేహితుడు ఉండేవాడు. ఫకీర్‌ అంటే రాజుకి చాలా ఇష్టం. అతని పట్ల ఎనలేని ప్రేమాభిమానాలు చూపేవాడు. ఒకసారి మిత్రులు ఇద్దరూ వేటకు వెళ్ళారు. జంతువుల్ని వెంటపడి తరమటంలో వాళ్లిద్దరూ తమ పరివారం నుండి దూరం పోయి, ఎక్కడో తప్పిపోయారు. ఆ సంగతి తెలిసే సరికి వాళ్ళిద్దరికీ‌ బాగా దప్పిక, ఆకలి అవుతున్నాయి. దగ్గర్లో నీళ్ళు దొరికే అవకాశం ఏదీ కనిపించలేదు. అయితే దగ్గరలోనే పెద్ద చెట్టు ఒకటి కనిపించింది. వాళ్ళిద్దరూ‌ మెల్లగా ఆ చెట్టు క్రిందికి చేరుకున్నారు. చెట్టైతే పెద్దగా ఉంది గానీ, అదేం చెట్టో తెలియదు. దానికి పెద్దగా కాయలూ లేవు, ఒకే ఒక్క కాయ ఉంది, చెట్టు మొత్తానికీ. "ఈ చెట్టు మీద పక్షులు పెద్దగా ఉన్నట్లు లేదు" అన్నాడు ఫకీర్. "అవును. దీని క్రింద పడుకుంటే పక్షుల రెట్టల సమస్య ఉండదు" నవ్వాడు రాజు "కొంచెం ఆ కాయ ఏమైనా అందుకోగలవేమో, ప్రయత్నించరాదూ?" అన్నాడు.

 

 

వెంటనే ఫకీర్ గుర్రం ఎక్కి, కొంచెం శ్రమపడి, ఆ కాయని అందుకున్నాడు. దాన్ని నిశితంగా పరిశీలిస్తూ "ఈ‌ కాయ ఏదో‌ వింతగా ఉన్నది మిత్రమా! తినచ్చో తినకూడదో తెలీదు" అన్నాడు. రాజు దాన్ని అందుకొని, తన కత్తితో దాన్ని ఆరు ముక్కలుగా కోశారు. "తిని చూద్దాం, ఏ కొంచెం‌ బాగున్నా తినచ్చు. నాకు మటుకు చాలా ఆకలిగా ఉన్నది" అంటూ అలవాటు ప్రకారం ఫకీర్‌కు ఒక ముక్కను ఇచ్చాడు. ఫకీర్‌ గబుక్కున దాన్ని నోట్లో‌ వేసుకొని, వెంటనే "ఆహా! ఎంత తియ్యగా ఉంది ఈ పండు! నా జీవితంలోనే ఇంత తియ్యటి పండును తినలేదు! ఇంకో ముక్క ఇవ్వండి!" అని అడిగాడు. రాజు ఇచ్చాడు. అది తిన్నాక మరోకటి , ఆ తరువాత మరోటి... అట్లా ఐదు ముక్కలు తినేసి, మిగిలిన ఆ ఒక్కటి కూడా అడిగాడు ఫకీర్.


రాజుగారు నవ్వారు. "ఫకీర్! బలే స్వార్థమబ్బా, నీది! నా మీద నీకు ఏ కొంచెం అన్నా ప్రేమ ఉందనుకున్నాను గానీ, అట్లాంటిదేమీ లేదని బలే నిరూపించు-కున్నావు. ఇస్తున్న కొద్దీ తీసుకుంటూనే పోతున్నావు కదా?! నాకంటూ ఒక్క ముక్కకూడా‌ మిగిల్చేట్లు లేవేం! నాకు కూడా ఆకలిగానే ఉంది- ఇది నాదే" అంటూ చటుక్కున ఆ ముక్కను నోట్లో వేసుకున్నాడు. కానీ ఆ కాయ తినేట్లే లేదసలు! ఘోరమైన రుచి, భయంకరమైన వాసన- 'తింటే ఏమైపోతామో!' అన్నట్లు ఉన్నది. రాజు వెంటనే దాన్ని ఉమ్మేసి "ఎందుకు, అబద్ధం ఎందుకు చెప్పావు? ఇంత చేదుగా ఉన్న కాయను 'తియ్యగా ఉంది' అని ఎందుకన్నావు? పైగా గడ్డు చేదుగా ఉన్నా, అన్ని ముక్కలు తిన్నావు!" ఆశ్చర్యపోతూ అడిగాడు ఫకీరును.

 

"తమ చేత్తో ప్రేమగా ఇచ్చిన పండుని బాలేదని తమర్ని నొప్పించబుద్ధి కాలేదు మహారాజా! అంతేకాక, తమరు బాగా దప్పిగొని ఉన్నారు; ఆకలిగా కూడా ఉన్నారు. నేను తినకుండా ఆపితే తమరు తింటారు. అడవి పళ్ళు- ఏది మంచిదో, ఏది విషపూరితమో కనుక్కునేందుకు ఒక పరీక్ష, వాటిని పక్షులు తింటున్నాయా, లేదా అనేది. ఈ చెట్టుమీద పక్షులు కూడా నివాసం లేవు కదా, అందువల్ల అనుమానం వచ్చింది" అన్నాడు ఫకీర్ ఆప్యాయంగా. అయితే ఆ సరికే అతని ముఖ కవళికల్లోను, మాట లోను తేడాని గమనించిన రాజు వెంటనే అతన్ని తీసుకొని ఆఘమేఘాలమీద రాజ్యం చేరుకున్నాడు. అక్కడ రాజవైద్యుల పర్యవేక్షణలో వారిద్దరి ఆరోగ్యం త్వరలోనే మెరుగైంది. అటుపైన రాజు తెలివి, విశ్వసనీయత ఉన్న ఫకీరును తన ఆంతరంగికుడుగా నియమించుకొని, అనేక సంవత్సరాలపాటు చక్కగా రాజ్యాన్ని పాలించాడు.

 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో