Home » కథలు » చేపలు - కప్పలుFacebook Twitter Google
చేపలు - కప్పలు

చేపలు - కప్పలు

 


అనగనగా ఒక మడుగులో చాలా కప్పలు, చేపలు ఉండేవి. అవి ఒకదానినొకటి గౌరవించుకుంటూ సంతోషంగా బ్రతికేవి. అయితే ఒక రోజున ఏమైందంటే, ఓ కప్పపిల్ల వెళ్ళి ఒక చేపపిల్లని తినేసింది. దాన్ని చూసింది తల్లి చేప. వెంటనే చేపలన్నీ కలిసి కప్పపిల్లని చుట్టుముట్టాయి. మా చేపపిల్లని ఎందుకు తిన్నావు?" అని నిలదీసాయి. అలా భంగపడిన చేపపిల్ల కోపంతో, సిగ్గుతో ముఖం మాడ్చుకుని ఇల్లు చేరుకున్నది. "ఏమ్మా, ఇంత సేపూ ఎక్కడున్నావు?" అంది తల్లి కప్ప.

కప్పపిల్ల చెప్పింది- "నేనేదో ముచ్చటపడి ఒక చేపపిల్లను తినేసరికి చేపలన్నీ నా మీదపడి కొట్టినంత పని చేసాయి" అని. తల్లికప్పకు కోపం వచ్చింది. "ఏమట, మామూలు చేపలకి ఇంత ధైర్యం ఎక్కడినుండి వచ్చింది? ఒక చేపను తింటే అంత రభస ఎందుకు?" అని తన తోటి కప్పలన్నిటినీ పిలువనంపింది. కప్పలు అన్నీ వచ్చాయి. చేపలమీదికి దాడికి వెళ్ళినట్లు వెళ్ళాయి. "ఎవరు, మా కప్ప పిల్లని తిట్టింది? అంత మర్యాద లేకుండా అయినామా?" అన్నాయి.

"మీ కప్ప మాచేప పిల్లని తినేసింది- తిట్టకపోతే ఊరుకుంటామా?" అని అన్నది చేప తల్లి. "నాకు ఆకలి వేసింది, కనుక తిన్నాను- ఏం తప్పు?" అంది కప్ప పిల్ల. "అదేం మాట?! మా పిల్లలే మీకు ఆహారమా! ఈ దగ్గరలో వున్న పురుగుల్ని తినచ్చుకదా!" అంది చేప తల్లి, రోషంగా. "జరిగిందేదో జరిగిందిలెండి. ఇక నుంచి మీ జోలికి మేము రాము" అంది కప్పతల్లి, కొంచెం దిగివచ్చి. "మీరు మా జోలికి వస్తే ఊరుకుంటామా?" అన్నాయి చేపలు. "మా చేపపిల్లని తిన్న ఆ కప్పపిల్లను మాకు అప్పగించాలి- అది మేం వేసే శిక్షను అనుభవించాలి. అప్పుడే మేం ఊరుకునేది" అని పట్టు పట్టాయి. "పిల్లవాడు, తెలీక ఏదో చేస్తే దాన్ని పెద్దది చేయకూడదు. ఊరికే శిక్ష-గిక్ష అని మాట్లాడతారేమి?" అన్నాయి కప్పలు.

గొడవ పెద్దదయిపోతుండగా కప్ప పిల్ల ముందుకు వచ్చింది అకస్మాత్తుగా- "సరే, కానివ్వండి. మీరు ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష భరించటానికి సిద్ధంగా ఉన్నాను. ఊరికే చేపపిల్లను తినటం తప్పే, నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను" అన్నది. తల్లికప్పతో సహా కప్పలన్నీ నిశ్శబ్దం అయిపోయాయి. చేపలన్నీ గెలిచినట్లు సంబరపడ్డాయి. కప్పలన్నీ కళ్ళనీళ్ళు పెట్టుకొని, రోషంగా వెనక్కి మళ్ళాయి. అంతలో తల్లిచేప అడిగింది మిగిలిన చేపల్ని-"దీనికి ఏం శిక్ష విధిద్దాం?" అని. "చంపేద్దాం" అన్నాయి కొన్ని.

"నీ ఇష్టం- నువ్వు ఏ శిక్షంటే ఆ శిక్ష విధిద్దాం" అన్నాయి కొన్ని చేపలు. ఒక్క ముసలి చేప మటుకు "దాన్నేం చేయద్దు- ఊరికే వదిలేద్దాం" అన్నది. తల్లి చేప ఒక్క క్షణం పాటు ఆలోచించింది- "నిజమే.. దీన్ని వదిలేద్దాం. పశ్చాత్తాప పడింది కదా, అది చాలు. దీని ప్రాణాలు తీసినంతమాత్రాన నా బిడ్డ బ్రతికి వస్తుందా, ఏమి?" అన్నది. ఆ సరికి 'చేపలన్నిటినీ ఎలా చంపెయ్యాలి?'అని వ్యూహం రచిస్తున్నాయి కప్పలు. అకస్మాత్తుగా "ఆగండి! ఆగండి! నేనూ వస్తున్నాను" అని అరుస్తూ వస్తున్న తమ కప్పపిల్లని చూసి అవన్నీ ఆశ్చర్యపోయాయి. దాన్ని ఏమీ చెయ్యకుండా వదిలేసిన చేపలంటే వాటికి చాలా గౌరవం కల్గింది. 

వెంటనే వెనక్కి వెళ్ళి చేపలకు ధన్యవాదాలు చెప్పుకున్నాయి.  "ఏమీ పర్లేదులే, తప్పులు అందరూ చేస్తూనే ఉంటారు. తెలివిగా వాటిని దిద్దుకుంటే అంతే చాలు" అన్నాయి చేపలు, హుందాగా. అటుపైన ఆ చెరువులో చేపలు, కప్పలు హాయిగా కలసి జీవించాయి. క్షమించటంలో గొప్ప శక్తి ఉన్నది.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో


అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ, మనుమడు ఉండేవాళ్ళు.
Jan 18, 2019
బ్రహ్మదత్తుడు కాశీ రాజ్య పీఠాన్ని అధిరోహించకముందు యువరాజుగా విలాస...
Dec 31, 2018
ఏసుక్రీస్తు పుట్టటానికి ఆరువందల సంవత్సరాల ముందు గ్రీసు దేశంలో...
Dec 20, 2018
నల్లమల అడవుల్లో వీరసముద్రం చెరువు చుట్టుప్రక్కల పెద్ద పెద్ద ఏనుగుల గుంపులు...
Dec 17, 2018
అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఫకీర్‌ అనే ఒక స్నేహితుడు ఉండేవాడు...
Dec 12, 2018
నక్క పాట
Dec 11, 2018
కొత్తపల్లిలో రాజు అనే పిల్లవాడు ఉండేవాడు. వాడికి పక్షులన్నా, జంతువులన్నా...
Nov 24, 2018
అనగనగా పెద్ద కొండ ఒకటి ఉండేది. ఆ కొండ మీద అనేక రకాల వృక్షజాతులు జీవనం..
Nov 22, 2018
అనగనగా ఒక రాజు. ఆయన ఏ కొరత రానివ్వక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన దగ్గర ఒక బానిస ఉన్నాడు.
Nov 16, 2018
రామాయణంలోని ప్రధాన పాత్రల్లో ఒకడు హనుమంతుడు...
Nov 9, 2018
TeluguOne For Your Business
About TeluguOne