Facebook Twitter
అన్నమయ్య భార్యా తక్కువేం కాదు!

అన్నమయ్య భార్యా తక్కువేం కాదు!

 

 

తెలుగునాట అమ్మవారి దసరా ఎంత వేడుకగా సాగుతోందో... తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు కూడా అంతే ఘనంగా జరుగుతుంటాయి. తిరుమల అనగానే వేంకటేశ్వరుని వైభవంతో పాటుగా, ఆ వైభవాన్ని కొనియాడిన అన్నమాచార్యులవారూ గుర్తుకు రాక మానరు. అన్నమాచార్యునికి తెలుగునాట తొలి వాగ్గేయకారునిగా గుర్తింపు ఉంది. కానీ ఆయన భార్య తిరుమలమ్మ తెలుగులో తొలి కవయిత్రి అన్న విషయం చాలా కొద్దిమందికే తెలుసు.

15వ శతాబ్దానికి చెందిన తిరుమలమ్మ ‘సుభద్రా కళ్యాణం’ అనే ద్విపద కావ్యాన్ని రాశారు. భర్త అన్నమయ్య ప్రభావమో, తిరుమలేశుని మీద ఉన్న భక్తి భావమో కానీ తిరుమలమ్మ ఈ కావ్యాన్ని చాలా అద్భుతంగా రాశారని అంటారు. 1100లకు పైగా పాదాలతో సాగే ఈ కావ్యంలో అర్జునుడే కథానాయకుడు. కానీ ఇందులోని కథనం అంతా తెలుగునాట సాగుతున్నట్లే కనిపిస్తుంది. తెలుగువారి ఆచారాలు, సంప్రదాయాలు ఇందులో ఎదురుపడతాయి. దక్షిణాది పుణ్యక్షేత్రాలైన తిరుపతి, అహోబిళం, కంచి, కావేటి క్షేత్రాల ప్రసక్తీ ఉంటుంది.

శ్రీరమావల్లభులు - శ్రీకృష్ణు లెలమి/ ద్వారకాపట్టణము - తమ రేలుచుండ/ శ్రీకాంతపతికృపను - జెలగి పాండవులు/ ప్రాకటంబుగను ద్రౌ - పదిని బెండ్లాడి/ రంతే నింద్రప్రస్థ - మను పట్టణమున/ సంతసంబున నున్న – సమయంబునందు/ సురముని యేతెంచె - సుదతి పూజించె... అంటూ పాండవులు ఇంద్రప్రస్థములో ఉన్న ఘట్టంతో ఈ కావ్యం మొదలవుతుంది. ఆ తర్వాత సుభద్ర అర్జునుల మధ్య ప్రేమ చిగురించడం, అది అనేక అడ్డంకులను దాటుకుని పరిణయానికి దారి తీయడంతో కావ్యం ముగుస్తుంది. సుభద్రా కళ్యాణం నిజంగా తిమ్మక్క (తిరుమలమ్మకు మరో పేరు) రాసినదేనా అనే విషయం మీద కొంత వాదోపవాదాలు ఉన్నాయి. అయితే కావ్యం చివరలో ‘ఆసుభద్రాదేవి - ఆ యర్జునుండు/ సంతోషమున నుండ్రి - సర్వ కాలమ్ము/ అవనిలో తాళ్ళపాకాన్నయ్య గారి/ తరుణి తిమ్మక చెప్పె - దాను సుభద్ర/ కళ్యాణ మను పాట - కడు మంచి తేట’ అంటూ సాగే ద్విపదలు, ఈ రచన తిమ్మక్కదే అని చెప్పకనే చెబుతున్నాయి. పైగా ఈ కావ్యంలో స్త్రీలకు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే, ఇది ఒక స్త్రీ చేసిన రచనే అని స్పష్టమవుతుంది. తాళ్లపాక అన్నమాచార్యులు, ఆయన భార్య తిమ్మక్కే కాదు... వారిద్దరికీ పుట్టిన నరసింహయ్య కూడా గొప్ప కవి అంటారు. ఈయన ‘కవికర్ణ రసాయనం’ అనే కావ్యాన్ని రాశాడట. ఇలా అన్నమయ్య వంశవృక్షాన్ని గమనిస్తూ పోతే చాలామంది కవులే తేలుతారు. వారికి మూలపురుషునిగా అన్నమయ్య దంపతులు కనిపిస్తారు.

- నిర్జర.