సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి.. అత్యున్నత పురస్కారం భారతరత్నతో పాటు పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు కూడా అందుకున్నారు. ఇవికాక లెక్కకు మించిన పురస్కారాలు ఆమెను వరించాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఇప్పుడు ఆమె జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతున్న విషయం తెలిసిందే. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక మందన్న నటించబోతున్నారు. అయితే ఇది సాధారణ సినిమా కాదు. ఎందుకంటే ఆ పాత్రలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. వాటిని సమర్థవంతంగా అభినయించడం అనేది ఇప్పుడు రష్మిక మందన్న ముందున్న అతి పెద్ద అగ్ని పరీక్ష. అసలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఏమిటి అనేది ఒకసారి పరిశీలిస్తే..
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పూర్తి పేరు మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి. ఇంట్లో ఆమెను అందరూ కుంజమ్మ అని పిలిచేవారు. మధురై మీనాక్షి అమ్మవారి ఆలయ సమీపంలో జన్మించిన ఆమె తల్లి షణ్ముఖవడివు వీణా విద్వాంసురాలు, దేవదాసి సంప్రదాయానికి చెందిన ఇసై వెల్లాలర్ కుటుంబానికి చెందినవారు. లీగల్ ఫాదర్‌గా సుబ్రమణ్య అయ్యర్ ఉన్నప్పటికీ, బయలాజికల్ ఫాదర్‌గా పుష్పవనం అయ్యర్ పేరు ప్రచారంలో ఉంది. ఆమె చిన్నతనంలోనే తండ్రి ఆసరా లేని స్థితిని ఈ విషయాలు స్పష్టం చేస్తాయి. తల్లే ఆమెకు తొలి గురువై కర్ణాటక సంగీతంలో శిక్షణ ఇచ్చింది. అయితే, కేవలం 13 సంవత్సరాల లేత వయసులోనే ఒక చెట్టియార్‌కు ఎం.ఎస్.ను ఇచ్చి పెళ్లి చెయ్యాలని తల్లి నిర్ణయించింది. కానీ, దాన్ని ఆమె వ్యతిరేకించారు. ఆనాటి ప్రముఖ విమర్శకుడు వెంకటాచలం వ్యాఖ్యానిస్తూ, పదమూడేళ్ల బాలికలో 30 ఏళ్ల మహిళకు ఉండే ఆత్మస్థైర్యాన్ని, నిశ్చయాన్ని చూశానని కొనియాడారు. 1938లో 'సేవాసదనం' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె శకుంతలై, సావిత్రి, 1945లో వచ్చిన మీరా వంటి చిత్రాల్లో నటించారు. మీరా చిత్ర విజయం ఆమె సినీ ప్రయాణానికి ముగింపు పలికినా, పవిత్రమైన భక్తి సంగీత ప్రపంచానికి మహోన్నత ద్వారాలు తెరిచింది.
సుబ్బలక్ష్మి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు టి.సదాశివం పరిచయం వల్ల జరిగింది. ఆనంద వికటన్ ప్రకటనల మేనేజర్‌గా, కల్కి పత్రిక సహ వ్యవస్థాపకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా ఉన్న సదాశివం ఆమె కెరీర్‌ను, జీవితాన్ని ఏకంగా 57 సంవత్సరాల పాటు సానబెట్టి నడిపించారు. అంతకుముందు కర్ణాటక సంగీత విద్వాంసుడు, నటుడు జి.ఎన్. బాలసుబ్రమణ్యంతో ఆమెకు భావోద్వేగ అనుబంధం ఉండేదని, దాదాపు 20 ప్రేమలేఖలు కూడా రాశారని బయోగ్రాఫర్లు పేర్కొన్నారు. అయితే, తన కళకు, సమాజంలో భద్రతకు, దేవుడిలాంటి ప్రతిష్ఠకు సదాశివం అండ అవసరమని గుర్తించి ఆమె ఆయనను వివాహమాడారు. సదాశివం మొదటి భార్య 1938లో మరణించగా, 1940 నుండి 1997లో ఆయన కన్నుమూసే వరకు ఈ దంపతుల బంధం కొనసాగింది. దేవదాసి నేపథ్యం నుండి వచ్చిన ఆమెను సంప్రదాయ బ్రాహ్మణ గృహిణిగా, కంచి పట్టు చీర, పెద్ద బొట్టుతో 'అమ్మ' అనే ఆధ్యాత్మిక బింబంగా మలచడంలో పబ్లిసిటీ నిపుణుడైన సదాశివం వ్యూహాత్మక పాత్ర పోషించారు. తన సొంత పిల్లలు లేకపోయినా, సదాశివం మొదటి భార్య కుమార్తెలైన రాధ, విజయలను ప్రాణంకంటే ఎక్కువగా పెంచారు. ఇందులో రాధ వేదికపై ఆమె వెనకాల వోకల్ సపోర్ట్ ఇస్తూ నీడలా ఉండేది. 1980ల కాలంలో రాధ అకాల మరణం సుబ్బలక్ష్మిని తీవ్ర శోకసంద్రంలో నెట్టివేసింది.
సదాశివం కఠినమైన నిబంధనలతో ప్రవర్తించినప్పటికీ, సుబ్బలక్ష్మి స్వర మాధుర్యాన్ని ప్రపంచ వేదికలకు తీసుకెళ్లారు. ఐక్యరాజ్యసమితి (UN General Assembly)లో 1966లో ప్రతిష్ఠాత్మక కచేరీ నిర్వహించిన తొలి భారతీయ సంగీత కళాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు. 1998లో భారత ప్రభుత్వం ఆమెకు దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' అందించి గౌరవించింది. సంగీత రంగానికి చెందిన కళాకారిణికి భారతరత్న దక్కడం భారతీయ చరిత్రలోనే మొదటిసారి. 1997లో సదాశివం మరణించిన తర్వాత "ఆయన లేని జగత్తులో నేను కచేరీలు చేయలేను" అంటూ ఆమె కచేరీలు పూర్తిగా నిలిపివేశారు. చివరకు 2004 సెప్టెంబర్ 16న ఈ గానకోకిల కంఠం మూగబోయింది. కన్నతల్లిని, కన్నవారిని వదిలేసిందని తమ్ముడి నుండి విమర్శలు వచ్చినా, అంతర్గత సంఘర్షణలు, సమాజపు ఆంక్షలు ఎదుర్కొన్నా, ఒక సాధారణ అమ్మాయి జగజ్జేతగా మారిన ఈ ప్రయాణాన్ని విజువల్ కాన్ప్లిక్ట్తో తెరకెక్కించడమే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ముందున్న అసలైన సవాలు కాగా, అంతే భక్తి శ్రద్ధలతో ఆ పాత్రను ఆకళింపు చేసుకొని అభినయించడం రష్మిక ముందు ఉన్న మరో పరీక్ష.
[MS Subbulakshmi Biopic, Rashmika Mandanna, Gowtam Tinnanuri, Geetha Arts, MS Subbulakshmi Life Story, Unheard Truths of MS Subbulakshmi]