తెలంగాణ భూములు: ఓ విధ్వంసం.!
Published on: Thu Sep 17, 2026 4:06PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో తెలంగాణ భూములపై చేసిన ప్రసంగం ప్రకంపనలు సృష్టించింది. రాజకీయ నాయకులకు భూమి, భారీ ప్రాజెక్టుల్లో కమిషన్లు అనేవి ప్రధాన ఆదాయ వనరులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ భూమికి సంబంధించిన అక్రమాలు, కబ్జాలు లెక్కకు మించి జరిగాయనే విమర్శలు ఉన్నాయి. దీనికి సంబంధించి అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. బడా రాజకీయ నాయకుల నుంచి గ్రామ స్థాయి రాజకీయ నాయకుల వరకు భూకబ్జాలకు, అక్రమ భూఆక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. పోరంబోకు, అటవీ, అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయి. వాటిని ధరణి ద్వారా న్యాయబద్దత లేదా చట్టబద్ధత కల్పించుకోవడానికి ప్రయత్నించారనే ఆరోపణలు కూడా వున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో నిజం వుంది. అయితే, ఇది బిఆర్ఎస్ నాయకులకు మాత్రమే వర్తిస్తుందా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వర్తించదా అనేది ప్రశ్న. అదికారంలో వున్న పార్టీకి భూములను భుక్తం చేసుకునే వెసులుబాటు ఎక్కువగా వుంటుంది. చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది. ఈ చట్టానికి లోబడి భూమిని కలిగి వుండేలా చాలా మంది జాగ్రత్త పడి వుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అది అతిక్రమణకు గురైంది. భూ పరిమితి చట్టం అమలులో వుందనే విషయం తెలియని ఓ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను సమర్పించిన అఫిడవిట్‌లో 110 ఎకరాలు ఉన్నట్లు చెప్పుకున్నాడు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్, ఆ తర్వాతి బిఆర్ఎస్ ప్రభుత్వాలు భూ హక్కుల పాబందిని ధ్వంసం చేశాయి. ఆ విధ్వంసం బహుశా 2018 నుంచి ఎక్కువగా జరుగుతూ వచ్చింది. ఆ ఏడాది నుంచి పహణీ రాయడం ఆపేశారు. పహాణీ అనేది భూ యాజమాన్యాన్ని పక్కా చేస్తుంది. అంటే ఏ భూమి ఎవరి పేరు మీద వుందనే విషయాన్ని అది తేటతెల్లం చేస్తుంది. ఇది వేర్వేరు సర్వే నెంబర్లలో ఒక వ్యక్తి కలిగి వున్న భూమిని తెలియజేస్తుంది. ఆసామీవారి ఖాతాలు మాయమయ్యాయి.

పట్వారీ వ్యవస్థను ఎన్‌టీ రామారావు ప్రభుత్వం రద్దు చేస్తే, వీఆర్వో వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది మస్కూర్ వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఒక గ్రామంలో ఏ భూమి ఎవరి పేరు మీద ఉందనే విషయం తెలియకుండా పోయింది, ఆర్డీవోలకు ఉన్న హక్కులను రద్దు చేసి కలెక్టర్ చేతిలో పెట్టారు. దీంతో భూముల యాజమాన్య హక్కులు తెలుసుకోవడం సమస్యగా తయారైంది. రాత్రికి రాత్రి బలవంతులు భూములను ధరణిలో ఎక్కించుకుని కబ్జాలు చేసిన వైనాలున్నాయనే విషయం ఏ గ్రామానికి వెళ్లినా తెలుస్తుంది. దీంతో గ్రామాల్లో భూ తగాదాలు పెరిగాయి.
కేసీఆర్ ప్రభుత్వం భూములకు సంబంధించి కొత్త పద్ధతి ప్రవేశపెట్టడం వల్ల కూడా భూ యాజమాన్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఎవరైనా తమ భూమి వివరాలను దాచి పెట్టుకునే అవకాశం అది. అంటే ఒక వ్యక్తి తన భూమి వివరాలను రెండో కంటికి కనిపించకుండా దాచి పెట్టుకోవచ్చు
రేవంత్ రెడ్డి భూ వివరాలను బయటపెడతానని చెబుతున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ మీద చాలా గట్టి ప్రకటనే చేశారు. దాన్ని అమలు చేస్తారా, లేదా అనేది తర్వాతి విషయం. బీఆర్ఎస్ బడా నేతల భూముల లెక్కలు కూడా చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, ఇతర పార్టీల నాయకుల భూముల వివరాలను కూడా బయటపెడతారా, చూడాలి.
మరో విషయం.. చోటా మోటా నాయకులు గ్రామాల్లో వందల ఎకరాలు సంపాదించుకున్న వైనం కూడా వుంది. వాటిని బయటకు తీస్తారా? రేవంత్ రెడ్డి మీద కూడా భూములకు సంబంధించి ఆరోపణలు వున్నాయి. తన విషయాన్ని ఆయన స్పష్టం చేస్తారా? తెలంగాణలో భూమి అనేదే ఇప్పుడు ప్రధానమైన చర్చ. దాని అంతు తేలిస్తే చాలా సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. అందుకు రాజకీయ నాయకులు సిద్ధపడుతారా అనేది సందేహం.
Telangana Lands, Telangana Politcs, Revanth reddy, KCR, BRS, Dharni, Telugu One


