మహిళలు గర్భనిరోధక మాత్రలు ఎక్కువ కాలం వాడితే వచ్చే సమస్యలు ఇవే..!
Published on: Wed Sep 16, 2026 6:19PM

గర్భనిరోధక మాత్రలు మహిళల జీవితంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి. కుటుంబ నియంత్రణతో పాటు నెలసరి సరిగ్గా రానప్పుడు వాటిని రీసెట్ చేయడానికి, తీవ్రమైన కడుపునొప్పి, పిసిఓడి వంటి హార్మోన్ల సమస్యల చికిత్సకు కూడా వైద్యులు వీటిని సూచిస్తుంటారు. అయితే వీటిని కొద్దికాలం పాటు వైద్యుల పర్యవేక్షణలో వాడటం సురక్షితమే.. అయినప్పటికీ, ఎక్కువ కాలం పాటు ముఖ్యంగా వైద్యుల సలహా లేకుండా క్రమం తప్పకుండా వాడటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా మహిళలు వైద్యుల సలహాతో అయినా సరే.. ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం మంచిది కాదు.. దీర్ఘకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు , సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది? మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి? వివరంగా తెలుసుకుంటే..
హార్మోన్ల అసమతుల్యత , మూడ్ స్వింగ్స్...
గర్భనిరోధక మాత్రలలో ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టిన్ అనే హార్మోన్లు ఉంటాయి. వీటిని ఎక్కువకాలం తీసుకోవడం వల్ల శరీరంలో సహజమైన హార్మోన్ల ఉత్పత్తి ప్రభావితమవుతుంది. దీనివల్ల మానసిక ఆందోళన, నిరాశ, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు తరచూ ఎదురవుతాయి.
రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం..
ఎక్కువకాలం పాటు గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ముప్పు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా కాళ్లలోని నాళాలలో లేదా ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అధిక బరువు ఉన్నవారిలో, ముప్పై ఐదేళ్లు పైబడిన మహిళల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.
గుండె సంబంధిత సమస్యలు , అధిక రక్తపోటు..
గర్భనిరోధక మాత్రల వల్ల కొందరిలో రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా చాలా ఏళ్ల పాటు వీటిని వాడటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు , స్ట్రోక్ వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది.
విటమిన్లు , ఖనిజాల లోపం..
ఈ మాత్రలు ఎక్కువ కాలం పాటు వాడటం వల్ల జీర్ణ వ్యవస్థలో పోషకాల శోషణ తగ్గుతుంది. ముఖ్యంగా విటమిన్ బి6, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి , మెగ్నీషియం, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల లోపం శరీరంలో ఏర్పడుతుంది. దీనివల్ల ఎప్పుడూ అలసట, నీరసం , రోగనిరోధక శక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
రొమ్ము నొప్పులు..
ఎక్కువ కాలం ఈ మాత్రల వాడకం వల్ల శరీరంలో హార్మోన్ల స్థాయిలో వచ్చే మార్పుల కారణంగా రొమ్ములో బరువుగా అనిపించడం, వాపు లేదా నొప్పి రావడం జరుగుతుంది.
కాలేయం , పిత్తాశయ సమస్యలు..
మాత్రల రూపంలో తీసుకునే ఈ హార్మోన్లను కాలేయం జీర్ణం చేయాల్సి ఉంటుంది. ఎక్కువ కాలం వీటిని వాడటం వల్ల కాలేయ పనితీరుపై ప్రభావం పడి కాలేయ గడ్డలు ఏర్పడటం లేదా పిత్తాశయంలో రాళ్లు తయారయ్యే ప్రమాదం ఉంటుంది.
క్యాన్సర్ ప్రమాదం..
ఎక్కువ కాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల గర్భాశయ ముఖద్వారం , రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు కొద్దిగా పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయితే అదే సమయంలో ఇవి అండాశయ , గర్భాశయ క్యాన్సర్ల నుండి రక్షణ ఇస్తాయట.
మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడే ముందు , వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. సొంత వైద్యం చేసుకోవద్దు. వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రారంభించాలి. ప్రతి కొన్ని నెలలకోసారి సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. కొందరు వైద్యులు కేవలం సమస్యను తగ్గించాలనే కారణంతో ఈ మాత్రలను ఎక్కువ నెలలు రికమెండ్ చేస్తూ ఉంటారు. అవగాహన లోపం వల్ల కంటిన్యు గా ఎక్కువ నెలలు ఈ మాత్రలు రికమెండ్ చేయడం లేదా వాడటం మంచిది కాదు.
రక్తపోటు , కాలేయ పనితీరును తరచూ సరిచూసుకోవాలి. మాత్రలు వాడుతున్న సమయంలో తరచూ తలనొప్పి, కాళ్ల వాపు, తీవ్రమైన కడుపునొప్పి లేదా చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
*రూపశ్రీ.


