అమరాంత్ సీడ్స్.. ఇవి ఆహారంలో తీసుకుంటే జరిగే మ్యాజిక్ తెలుసా.!
Published on: Thu Sep 17, 2026 10:22AM

అమరాంత్ సీడ్స్.. తోటకూర గింజలు లేదా రాజ్‌గిరా అని వీటిని పిలుస్తారు. ఇవి ఇటీవల కాలంలో సూపర్ ఫుడ్‌గా విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రాచీన కాలం నుండి మన సాంప్రదాయ ఆహారంలో భాగమైన ఈ గింజలు, ఆధునిక ఆరోగ్య నిపుణుల ప్రశంసలు అందుకుంటున్నాయి. మన నిత్య జీవితంలో తోటకూరను ఆకుకూరగా ఎంతగా ఉపయోగిస్తామో, దాని గింజలలో ఉన్న పోషక విలువలు కూడా అంతకంటే ఎక్కువే. సాధారణంగా కనిపించే ఈ చిన్న గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే..
అమరాంత్ సీడ్స్ అంటే..
అమరాంత్ సీడ్స్ అనేది 'అమరాంథస్' అనే మొక్క నుండి లభించే గింజలు. తెలుగులో వీటిని తోటకూర గింజలు అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో వీటిని 'రాజ్‌గిరా' లేదా 'రామ్‌దానా' అని అంటారు. అమరాంత్ గింజలను ధాన్యాల జాబితాలో చేర్చినప్పటికీ, వృక్షశాస్త్రం ప్రకారం ఇవి నిజానికి సూడోసిరియల్స్ గా పిలుస్తున్నారు. అంటే బియ్యం, గోధుమల లాగా కాకుండా, ఇవి ఆకుకూరల జాతికి చెందిన గింజలు. అందుకే వీటిలో ఇతర సాధారణ ధాన్యాల కంటే పోషకాలు ఎంతో ఎక్కువగా ఉంటాయి. ఇందులో గ్లూటెన్ ఉండకపోవడం వల్ల ఇది గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది.
ఆరోగ్యానికి అమరాంత్ సీడ్స్ చేసే మేలు..
పోషకాల గని:
అమరాంత్ గింజలలో శరీరానికి కావలసిన అత్యంత ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫోస్ఫరస్ , పోటాషియం సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియం ఇతర ధాన్యాలతో పోలిస్తే ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది.
ప్రొటీన్:
సాధారణంగా వృక్ష సంబంధిత ఆహారాలలో అన్ని రకాల అమైనో ఆసిడ్లు లభించడం చాలా అరుదు. కానీ అమరాంత్ లో శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అవసరమైన అమైనో ఆసిడ్లు ఉంటాయి. ముఖ్యంగా 'లైసిన్' అనే అమైనో ఆసిడ్ ఇందులో ఉండటం వల్ల ఇది శరీరంలో ప్రొటీన్ శోషణకు ఎంతగానో తోడ్పడుతుంది. శాఖాహారులకు, కండరాల పుష్టిని కోరుకునే వారికి ఇది సరైన పోషకాహారం.
జీర్ణవ్యవస్థ మెరుగుదల:
అమరాంత్ గింజలలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అలాగే ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్ ఎక్కువ సమయం కడుపు నిండిన భావనను కలిగిస్తుంది కాబట్టి, అతిగా తినే అలవాటు తగ్గుతుంది.
గుండె ఆరోగ్యం , కొలెస్ట్రాల్ నియంత్రణ:
అమరాంత్ లో ఉండే సహజ నూనెలు , ఫైబర్ రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు గుండె నాళాల్లో పూడికలు ఏర్పడకుండా నిరోధించి, రక్తప్రసరణను నార్మల్ గా ఉండేలా చేస్తాయి. తద్వారా రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.
బరువు తగ్గడానికి:
బరువు తగ్గాలనుకునే వారికి అమరాంత్ సీడ్స్ చక్కని ఎంపిక. తక్కువ క్యాలరీలు, అధిక ప్రొటీన్ , పీచు పదార్థం కలిగి ఉండటం వల్ల శరీర జీవక్రియ రేటు అంటే మెటబాలిజం పెరుగుతుంది. కొవ్వును కరిగించే ప్రక్రియ వేగవంతమై, ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి ఇది దోహదపడుతుంది.
డయాబెటిస్ నియంత్రణ:
ఈ గింజలలో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ సాధారణ ధాన్యాల కంటే తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా క్రమబద్ధంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రోజువారీ ఆహారంలో అమరాంత్ ను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
వ్యాధి నిరోధక శక్తి..
అమరాంత్ లో స్క్వాలేన్ , లోనాఫిన్ వంటి శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో తోడ్పడతాయి. శరీర కణజాలాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
ఆహారంలో అమరాంత్ సీడ్స్ ఎలా తీసుకోవాలి?
అమరాంత్ సీడ్స్ ని వివిధ రకాలుగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
వీటిని వేయించి, పాప్‌కార్న్ లాగా మార్చి పాలు లేదా తేనెతో కలిపి ఉదయపు అల్పాహారంగా తీసుకోవచ్చు.
వరి అన్నం లాగే వీటిని ఉడికించి తీసుకోవచ్చు లేదా ఉప్మా రూపంలో వండుకోవచ్చు.
అమరాంత్ గింజలను పిండిగా తయారుచేసి గోధుమ పిండితో కలిపి రొట్టెలు, చపాతీలు తయారు చేసుకోవచ్చు.
పాయసం లేదా పానీయాలలో ఉడకబెట్టిన అమరాంత్ గింజలను చేర్చి పౌష్టికాహారంగా తీసుకోవచ్చు.
సలాడ్లు లేదా సూప్‌లలో వేయించిన అమరాంత్ గింజలను పైన చల్లుకోవడం ద్వారా పోషక విలువలతో పాటు రుచిని పెంచుకోవచ్చు.
*రూపశ్రీ.


