అష్టాంగ నడక..రోజు నడిచేలా కాకుండా ఒక్కసారి ఇలా వాకింగ్ చేయండి..!
Published on: Wed Sep 16, 2026 6:34PM

ఆరోగ్యం కోసం వాకింగ్ చేయాలని చాలామంది అనుకుంటారు. వాకింగ్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. బ్రిస్క్ వాకింగ్ , బ్యాక్ వాకింగ్.. అంటూ చాలా రకాలు ఉన్నాయి. వీటిలో 8 ఆకారంలో వాకింగ్ చేయడం చాలా పవర్ఫుల్ అంటున్నారు. దీన్ని అష్టాంగ నడక లేదా ఎనిమిది ఆకారపు నడక అని కూడా అంటారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన సాంప్రదాయ వ్యాయామ పద్ధతి. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
అష్టాంగ నడక..
సాధారణంగా మనం ప్రతిరోజూ నేరుగా లేదా పార్కుల్లో రౌండ్‌గా నడుస్తుంటాం. కానీ ఒకే రీతిలో నడిచే నడక కంటే, ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల శరీరానికి ఎన్నో రెట్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. సరైన పద్ధతిలో ఈ నడకను దినచర్యలో భాగం చేసుకుంటే, కొద్దిరోజుల్లోనే శరీరంలో వచ్చే మార్పులను ప్రత్యక్షంగా చూడవచ్చు.
చిన్న స్థలం చాలు..
ఈ నడకను సాధన చేయడానికి పెద్దగా స్థలం లేదా ఖరీదైన పరికరాలు అవసరం లేదు. ఇంటి ఆవరణలో లేదా ఒక ఖాళీ గదిలో దక్షిణం నుండి ఉత్తర దిశగా ఎనిమిది ఆకారాన్ని ఊహించుకుని లేదా సుద్ద ముక్కతో గీసుకుని నడవడం ప్రారంభించాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పరగడుపున పరధ్యానం లేకుండా పాదరక్షలు లేకుండా నడవడం చాలా మంచిది.
ఎలా నడవాలి?
నడిచేటప్పుడు శ్వాసపై ధ్యాస ఉంచుతూ ప్రశాంతంగా, నిలకడగా అడుగులు వేయాలి. దాదాపు పదిహేను నిమిషాలు ఒక దిశలో నడిచిన తర్వాత, తదుపరి పదిహేను నిమిషాలు వ్యతిరేక దిశలో నడవడం ఈ పద్ధతి లో ఉండే ముఖ్య నియమం.
అష్టాంగ నడక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
గుండె ఆరోగ్యం..
ఎనిమిది ఆకారంలో తిరుగుతూ నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ ఎంతో మెరుగుపడుతుంది. రెండు వైపులా అడుగులు వేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు, ముఖ్యంగా గుండెకు తగినంత ప్రాణవాయువు అందుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది.
నాడీ వ్యవస్థ..
కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఎనిమిది ఆకారంలో నడిచేటప్పుడు మోకాళ్లు, తుంటి భాగాలు, వెన్నుముక సహజంగా వంగుతాయి. దీనివల్ల వెన్నుముక బలపడి, నడుము నొప్పి , సయాటికా వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పాదాల కింద ఉండే ఆక్యుప్రెజర్ పాయింట్లు నేలను తాకడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది.
మానసిక ఆరోగ్యం..
అష్టాంగ నడక మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎనిమిది ఆకారాన్ని అనుసరిస్తూ నడిచేటప్పుడు మనస్సు పూర్తిగా ఆకారం పైన నడక పైన దృష్టి పెడుతుంది. దీనివల్ల అనవసరమైన ఆలోచనలు తగ్గి, మెదడు ప్రశాంతంగా మారుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ నడకను సాధన చేస్తే మంచి నిద్ర పడుతుంది.
డయాబెటిస్ కు మంచిది..
అష్టాంగ నడక వల్ల జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యాయామం వల్ల పొత్తికడుపు భాగంలో కదలికలు ఏర్పడి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరిగి, బరువు అదుపులోకి వస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ స్థాయిలు సమతుల్యంగా ఉండటానికి, రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి ఈ నడక ఎంతగానో సహాయపడుతుంది.
ముఖ్యమైన విషయం..
సాధారణ నడకతో పోలిస్తే అష్టాంగ నడక శరీరంలోని రెండు వైపుల కండరాలను సమంగా ఉపయోగిస్తుంది. దీనివల్ల శరీర సమతుల్యత పెరుగుతుంది. వయసు పైబడిన వారు పడిపోకుండా స్థిరంగా నడవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రోజూ నార్మల్ బ్యాకింగ్ కు బదులుగా ప్రతిరోజూ కనీసం అర్ధగంట సేపు ఈ అష్టాంగ నడకను సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని , కొత్త ఉత్సాహాన్ని సొంతం చేసుకోవచ్చు.
*రూపశ్రీ.


