2019 ఎన్నికలకు ముందు అప్పటికి పొత్తులో ఉన్న తెలుగుదేశం, బీజేపీల మధ్య చిచ్చు పెట్టింది తానేనని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా 2018 నాటి రాజకీయ పరిణామాలపై ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ హాట్ చర్చ నడుస్తోంది. బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెండు పార్టీఅ మధ్యా విభేదాలు పొడసూపి, అవి ముదిరి మైత్రిబంధం తెగిపోవడానికి 2016 నుంచి తాను ప్రయత్నాలు చేశాననీ, చివరకు ఆ ప్రయత్నాలు 2018 నాటికి ఫిలించాయని అప్పట్లో వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డి తాజాగా చెప్పారు.  ఈ వ్యాఖ్యలను ఆయన తిరుపతిలో ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం,  బీజేపీ, జనసేన మధ్య పొత్తు  ఉండేది. ఎన్నికల అనంతరం తెలుగుదేశం నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ,  ప్రత్యేక హోదా, కేంద్ర నిధులు, రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై సైకిల్, కమలం పార్టీల మధ్య విభేదాలు పొడసూపాయి.   2018లో తెలుగుదేశం బీజేపీతో పొత్తు తెంచుకుని,  ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఈ పరిణామం అప్పట్లో  రాష్ట్ర రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చివేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. వైసీపీ ఘన విజయం సాధించి అధికారపగ్గాలను చేపట్టింది.   నాటి పరిణామాలపై తాజాగా నోరు విప్పిన విజయసాయి రెడ్డి.. 2016 నుంచి 2018 వరకు టీడీపీ, బీజేపీ మధ్య దూరం పెంచేందుకు తాను అనేక విధాలుగా ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చారు.  అలా దూరం పెంచి, ఆ రెండు పార్టీల పొత్తునూ విచ్ఛిన్నం చేయడంలో సక్సెస్ అయ్యాను కనుకనే.. 2019 ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించిందని ఆయన చెప్పకనే చెప్పారు. అప్పట్లో వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం సిద్ధించి అధికార పగ్గాలు చేపట్టడం వెనుక ఉన్నది తానేనని విజయసాయి అన్యాపదేశంగా చెప్పారు.     [Vijayasai Reddy Behind Differences Betweem BJP And TDP, Split, TDP BJP Alliance, 2018,  YS Jagan Political Advantage,   2019 AP Elections,Andhra Pradesh Politics, Telugu One]
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీ్ు అధినేత   విజయ్ ఎన్నికకు సంబంధించిన వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చెన్నైలోని మద్రాస్ హైకోర్టు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై  తుది తీర్పును ఈ నెల  14కు వాయిదా వేసింది. పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయ్ గెలుపును సవాలు చేస్తూ  దినేశ్  అనే వ్యక్తి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. తమిళనాడు  అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్  తన సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్‌పై 53 వేల 715 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే విజయ్ ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదని ఆరోపిస్తూ  దినేశ్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణల ఆధారంగా ఆయన ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్‌లో  కోరారు.  పిటిషనర్ తరఫున విజయ్‌కు సంబంధించిన కొన్ని ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తిగా వెల్లడించలేదని వాదించారు. ముఖ్యంగా పన్రుటి ప్రాంతంలో కొనుగోలు చేసినట్లు పేర్కొన్న వ్యవసాయ భూమి విలువ సుమారు  30 కోట్ల రూపాయలు ఉంటుందనీ,   దాని వివరాల వెల్లడిపై అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. అలాగే కొడైకెనాల్‌లోని విల్పట్టి గ్రామంలో ఉన్నట్లు పేర్కొన్న 50 సెంట్ల భూమి ప్రభుత్వ భూమి అయి ఉండవచ్చని రెవెన్యూ రికార్డులను ప్రస్తావించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనిపై విజయ్ తరఫు న్యాయవాదులు  ఎన్నికల అఫిడవిట్‌లో అవసరమైన సమాచారాన్ని వెల్లడించామని, చిన్నపాటి లోపాలు లేదా వివరాలపై వివాదాలను మాత్రమే ఆధారంగా చేసుకుని ఎన్నికను రద్దు చేయలేమని వాదించినట్లు సమాచారం. ఆస్తుల వివరాలపై వచ్చిన ఆరోపణలు ఎన్నికల ఫలితాన్ని ఎలా ప్రభావితం చేశాయో చూపాల్సిన అవసరం ఉందని కూడా   పేర్కొన్నారు.  ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం పిటిషన్‌పై తుది తీర్పు  అక్టోబర్ 14న ప్రకటించనున్నట్లు కోర్టు తెలిపింది. అప్పటిలోగా సంబంధిత పక్షాలు తమ రాతపూర్వక వాదనలు సమర్పించాలని సూచించింది. ప్రస్తుతం కోర్టు ముందున్న ప్రశ్న విజయ్ ఎన్నికను వెంటనే రద్దు చేయాలా అన్నది మాత్రమే కాదు; ఆయన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా,  లేదా అన్న అంశంపైనా కోర్టు తీర్పు వెలువరించనుంది.    [Verdict on Tamilnadu CM Vijay Election Case,    Madras High Court, Perambur Constituency, Election Affidavit, Tamil Nadu Politics, October 14 Verdict, Telugu One]
సింహం సింగిల్ గానే వస్తుందంటూ తన భుజాలను తానే చరచుకునే జగన్ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ, తాను కన్ఫ్యూజన్ లో ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఆయనలోని అయోమయానికీ, కన్ఫ్యూజన్ కు అద్దంపట్టింది.   గతంలో ఢిల్లీలో  కాక్రోచ్ జనతా పార్టీ  ఉద్యమం జరుగుతున్నప్పుడు, తాను కూడా   పోరాడే  బొద్దింకనని జగన్ ప్రకటించారు. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడేందుకు తాను కాక్రోచ్ ల ఉద్యమంలో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నానని విస్పష్ట సందేశాన్నిచ్చారు. జగన్ తన రాజకీయ జీవితంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా ఒక స్టేట్ మెంట్ ఇవ్వడం అదే ప్రథమం.  దీంతో జగన్ ఇక తన పొలిటికల్ మార్గాన్ని బీజేపీకి వ్యతిరేకంగా ఆరంభిస్తున్నారా అన్న అనుమానాలు అప్పట్లో వెల్లువెత్తాయి. దానికి కొనసాగింపుగానే జగన్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి దగ్గరౌతున్నారన్న విశ్లేషణలూ వెల్లువెత్తాయి. ఇక సీపీఐ నేతలు ఆయనతో భేటీ కావడం ఈ విశ్లేషణలకు బలం చేకూర్చాయి కూడా. అయితే తాను ఏ కూటమిలోనూ భాగస్వామిని కాబోవడం లేదని జగన్ వివరణ ఇచ్చుకున్నారు.  ఇప్పుడు తాజాగా ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల ప్రస్థానం ( గుజరాత్ సీఎంగా, పీఎంగా)  పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలపడం ద్వారా జగన్ తన కన్ఫ్యూజన్ ను బయటపెట్టుకున్నారు. మోడీని అభినందిస్తూ ఆయన చేసిన ట్వీట్ లో ప్రజా సేవలో మోడీ చారిత్రాత్మక మైలు రాయిని చేరుకున్నారని పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా పాతికేళ్లుగా  నిరంతర ప్రజా సేవను పూర్తి చేసుకున్న గౌరవనీయులైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ జగన్ సోషల్ మీడియాలో ఓ సందేశం షేర్ చేశారు. నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  మొత్తానికి ఒకే సమయంలో  రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న  రాజకీయ నాయకుడిగా జగన్ ను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  [YS Jagan Praises Narendra Modi, Jagan Modi Tweet, YCP, CJP,  Andhra Pradesh Politics, Jagan Political Strategy, Duel Standards, Confusion, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించేందుకు భారీ లైనప్ సిద్ధమైంది. ఈ వారం ఏకంగా 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ డిజిటల్ వేదికల్లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా ‘ఎపిక్’, ‘మండాడి’, ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటితో పాటు విభిన్న జానర్లలో కొత్త కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామాకు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. లివిన్ రిలేషన్, ప్రేమ, తల్లిదండ్రుల ఆశలు, యువత తమ కలలను నెరవేర్చుకునే క్రమంలో ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో కథ సాగుతుంది. అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. మండాడి: సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ యాక్షన్ డ్రామా అక్టోబర్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సముద్ర తీర ప్రాంతంలో జరిగే పడవ పందేలు, ఇద్దరి మధ్య వైరం వంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్: పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటించిన ఈ మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. పోలీసు విధుల్లో ఎదురయ్యే సవాళ్లు, దర్యాప్తు చుట్టూ కథ తిరుగుతుంది. రిపోర్టింగ్ లైవ్: వార్తా ప్రపంచం, దర్యాప్తు అంశాలతో తెరకెక్కిన ఈ హిందీ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. థ్రిల్లర్ కథలను ఇష్టపడేవారికి ఇది మరో ఆప్షన్. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్: హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన ఈ తెలుగు కామెడీ సిరీస్ అక్టోబర్ 9 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. పెళ్లి వయసు దాటిపోతున్న యువకుడిపై కుటుంబం, సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లు.. ఆ క్రమంలో చోటుచేసుకునే హాస్యభరిత సంఘటనల నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందింది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తెలుగు డబ్బింగ్ వెర్షన్, హారర్ చిత్రం ‘ఇన్సిడియస్: ఔట్ ఆఫ్ ద ఫర్దర్’ వంటి సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. ఖలీఫా: మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఐస్: మలయాళ క్రైమ్ మిస్టరీ సిరీస్ ‘ఐస్’ సోనీ లివ్‌లో అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. సస్పెన్స్, క్రైమ్ కథలను ఇష్టపడేవారికి ఇది మరో ఎంపిక. మొత్తానికి ఈ వారం ఓటీటీల్లో తెలుగు ప్రేక్షకులకు ‘ఎపిక్’, ‘మండాడి’, ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. వీటితో పాటు ఇతర భాషల థ్రిల్లర్లు, యాక్షన్ సినిమాలు కూడా ఉన్నాయి.  ఇది కూడా చదవండి: నానా పటేకర్‌ చివరి మెసేజ్.. అర్ధరాత్రి ఏం జరిగింది.. ఫ్రెండ్ ఆ మెసేజ్ చూసుంటే.?       [OTT Releases This Week, Telugu OTT Movies, Least Eligible Bachelor, Epic First Semester, Mandaadi Movie, Khalifa Movie, Pradhama Drishtiya Kuttakkar, Spider Man Brand New Day, Eyes Web Series]  
సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్‌కు ఇప్పుడు బాలీవుడ్‌లో తన సత్తా చాటుకునే అవకాశం వచ్చింది. గతంలో కొన్ని హిందీ సినిమాలకు పనిచేసిన ఆయన.. ఇప్పుడు ఏకంగా ఒక పూర్తి హిందీ సినిమా ఆల్బమ్‌కు సంగీతం అందిస్తున్నారు. యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘నయీ నవేలీ’ సినిమాకు పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను కూడా ఆయనే సమకూర్చారు. అక్టోబర్ 16న విడుదల కానున్న ఈ సినిమాపై జీవీ ప్రకాష్ చాలా ఆశలు పెట్టుకున్నారు. నిజానికి జీవీ ప్రకాష్‌కు బాలీవుడ్ కొత్తేమీ కాదు. గతంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడంతో పాటు ‘జోకర్’, ‘అగ్లీ’ వంటి చిత్రాలకు పాటలు కంపోజ్ చేశారు. అయితే ఒక హిందీ సినిమాకు పూర్తి స్థాయిలో సంగీతం అందించడం మాత్రం ‘నయీ నవేలీ’తోనే జరుగుతోంది. ఆనంద్ ఎల్. రాయ్ నిర్మాణంలో, మారి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బాలాజీ మోహన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ జీవీ ప్రకాష్ కెరీర్‌లో కీలకమైన మైలురాయిగా మారనుంది. ఇక ఈ ఏడాది జీవీ ప్రకాష్‌కు కలిసొస్తున్నట్టే కనిపిస్తోంది. గతంలో ఆయన సంగీతం అందించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయినా.. ఈ ఏడాది మాత్రం వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘ఇరుముడి’, ‘మండాడి’ వంటి సినిమాలతో బిజీగా ఉన్న ఆయనకు ‘అమరన్’ చిత్రానికి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు జాతీయ అవార్డు కూడా దక్కింది. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. సంగీతానికి భాషా సరిహద్దులు ఉండవని నమ్మే జీవీ ప్రకాష్.. తెలుగు, తమిళ సినిమాలకు పనిచేసినట్టే హిందీ చిత్రానికీ పూర్తి స్థాయిలో సంగీతం అందించడం మరో సవాలుగా భావిస్తున్నారు. ‘నయీ నవేలీ’ పాటలు ప్రేక్షకులకు నచ్చితే బాలీవుడ్‌లో మరిన్ని పెద్ద అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ హారర్ కామెడీ సినిమా జీవీ ప్రకాష్‌కు హిందీలో మంచి గుర్తింపు తీసుకొస్తుందా? ఆయన కెరీర్‌కు కొత్త మలుపు అవుతుందా? అనేది చూడాలి.     [GV Prakash Kumar, Nayyi Navelli Movie, GV Prakash Bollywood Debut, Yami Gautam Nayyi Navelli, Nayyi Navelli Release Date, GV Prakash Latest News, Aanand L Rai Movies]
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆయన.. ఇటీవల ‘ఐ యామ్ గేమ్’తో మలయాళంలోకి రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. విడుదల సమయంలో కొన్ని ప్రాంతాల్లో షోలు రద్దు కావడం, సినిమా కంటెంట్‌పై ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో దుల్కర్‌తో పాటు ఆయన నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్‌పై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది.  తాజాగా ఈ సినిమా ఫలితంపై దుల్కర్ సల్మాన్ స్పందించారు. సినిమా వైఫల్యంపై తనకు వచ్చిన విమర్శల్లో నిజం ఉందని అంగీకరిస్తూనే, ఒక సినిమాను రూపొందించడం అంత సులభమైన విషయం కాదని చెప్పారు. తెరపై కనిపించే తుది ఫలితాన్ని విశ్లేషించడం సులభమేనని, కానీ ఒక సినిమా వెనుక వందల మంది కష్టం ఉంటుందని వివరించారు. అందరూ తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనుకున్నట్టుగా ఉండవని పేర్కొన్నారు. సినిమా నిర్మాణంలో తప్పులు జరిగితే వాటికి తననే బాధ్యుడిగా చూడాలని, తన టీమ్‌ను మాత్రం తాను ఎప్పుడూ సమర్థిస్తానని చెప్పడం ఆయన హుందాతనాన్ని చాటింది.  ‘ఐ యామ్ గేమ్’ విడుదలైన నెల రోజుల తర్వాత దుల్కర్ ఈ విధంగా స్పందించడంతో అభిమానులు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక సినిమా విజయం సాధించడానికి నిర్దిష్టమైన ఫార్ములా ఏదీ ఉండదని, పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడమే ముఖ్యమని ఆయన వ్యాఖ్యల సారాంశం. గతంలో తెలుగులో వరుస విజయాలు అందుకున్న దుల్కర్‌కు ఇటీవల ‘కాంత’, ‘ఐ యామ్ గేమ్’ సినిమాల ఫలితాలు నిరాశ కలిగించాయి. దీంతో ఇప్పుడు ఆయన తదుపరి తెలుగు సినిమా ‘ఆకాశంలో ఒక తార’పై దృష్టి పెట్టారు.  పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దుల్కర్ సరసన సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తున్నారు. కలలు, ఆశయాల నేపథ్యంలో సాగే ఈ సినిమా నవంబర్ 20, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ‘ఆకాశంలో ఒక తార’తో దుల్కర్ మళ్లీ విజయాల బాట పడతారా? తెలుగు ప్రేక్షకుల్లో తనకున్న క్రేజ్‌ను మరోసారి బాక్సాఫీస్ విజయంగా మార్చుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.     [Dulquer Salmaan, I'm Game Movie Failure, Dulquer Salmaan Latest News, Aakasamlo Oka Tara Movie, Dulquer Salmaan Upcoming Movies, Aakasamlo Oka Tara Release Date, Dulquer Salmaan Box Office Failure]
ప్రముఖ నటుడు నానా పటేకర్ మరణం సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. 75 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. అయితే మరణానికి కొన్ని గంటల ముందు ఆయన తన స్నేహితుడికి పంపిన ఓ మెసేజ్ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.  నానా పటేకర్ గోవాలోని తన నివాసంలో ఉండగా అక్టోబర్ 8 తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి సుమారు 2.30 గంటలకు తనకు ఒంట్లో బాగోలేదని స్నేహితుడికి మెసేజ్ పంపించారు. అయితే అర్ధరాత్రి కావడంతో ఆ మెసేజ్‌ను స్నేహితుడు వెంటనే చూడలేదు. ఆ తర్వాత నానా స్వయంగా ఫోన్ చేసి తన పరిస్థితి గురించి చెప్పడంతో.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయన ఇంటికి చేరుకున్నాడు. నానా ఇంటికి వెళ్లిన స్నేహితుడికి అక్కడ కనిపించిన పరిస్థితి ఆందోళన కలిగించింది. అప్పటికే ఆయన ఒళ్లంతా చెమటలు పట్టి, క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్తున్నారు. దీంతో వెంటనే అంబులెన్స్ ని పిలిపించి, అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు నానాను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. 45 నిమిషాలకు పైగా సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. తెల్లవారుజామున 5.20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. నానా పటేకర్ పంపించిన మెసేజ్‌ను ఆయన స్నేహితుడు వెంటనే చూసి ఉంటే.. మరింత ముందుగానే సహాయం అందేదేమోనన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ఆయనను త్వరగా ఆసుపత్రికి తరలించి ఉంటే ఫలితం మరోలా ఉండేదా? అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రణబాలి ట్రైలర్ లాంచ్‌లో రష్మిక మిస్సింగ్: ఆమె రాకపోవడానికి అసలు కారణమేంటి.?        [Nana Patekar Last Message, Nana Patekar Friend, Nana Patekar Death Reason, Nana Patekar Passed Away, Nana Patekar News, Nana Patekar, Telugu News]  
ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. 75 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూయడంతో అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మరణానికి సంబంధించి గోవాలోని పనాజీ పోలీసులు ‘అన్‌నేచురల్ డెత్’ కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి, మరణానికి సంబంధించిన పరిస్థితులపై విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 8న గోవాలోని దోనా పౌలా ప్రాంతంలో ఉన్న తన నివాసంలో నానా పటేకర్ అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆయనను బాంబోలిమ్‌లోని మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. అయితే మరణానికి సంబంధించిన పూర్తి వివరాలను నిర్ధారించేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు.  అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. పోలీసులు ‘అన్‌నేచురల్ డెత్’ కేసు నమోదు చేసినంత మాత్రాన నానా పటేకర్ మరణంలో ఏదైనా కుట్ర లేదా అనుమానాస్పద చర్య ఉన్నట్లు అర్థం కాదు. ఒక వ్యక్తి ఆసుపత్రికి మృతదేహంగా తీసుకొచ్చినప్పుడు, మరణానికి గల కారణాలను నిర్ధారించేందుకు చట్టపరమైన ప్రక్రియలో భాగంగా ఇలాంటి కేసు నమోదు చేయవచ్చు. ఈ కేసులోనూ మరణానికి సంబంధించిన పరిస్థితులను పరిశీలించడమే పోలీసుల ప్రాథమిక ఉద్దేశంగా తెలుస్తోంది.  మరోవైపు.. మరణానికి సంబంధించిన వివరాలను సేకరించడంతో పాటు అవసరమైన వైద్య, చట్టపరమైన ప్రక్రియలను పోలీసులు చేపట్టారు. విచారణలో సహజ మరణమేనని నిర్ధారణ అయితే కేసును ముగించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏవైనా అనుమానాస్పద అంశాలు బయటపడితే తదుపరి చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, నానా పటేకర్ మరణానికి గుండెపోటు కారణమై ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. పోలీసుల విచారణతో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.  నానా పటేకర్ దాదాపు ఐదు దశాబ్దాల పాటు హిందీ, మరాఠీ చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘పరిందా’, ‘క్రాంతివీర్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఒక విలక్షణ నటుడిని కోల్పోయింది.     [Nana Patekar Death, Nana Patekar Death Case, Nana Patekar Latest News, Nana Patekar Unnatural Death Case, Goa Police Nana Patekar, Nana Patekar Death Investigation, Nana Patekar Heart Attack, Bollywood News, Nana Patekar News Today, Nana Patekar Biography]
పెళ్ళి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘రణబాలి’. అక్టోబర్ 16న ఈ సినిమా థియేటర్లలోకి రానుండటంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రష్మిక హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో ఆమె ఎందుకు రాలేదనే ప్రశ్నలు మొదలయ్యాయి. అక్టోబర్ 8న హైదరాబాద్‌లో ‘రణబాలి’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు రష్మిక కూడా వస్తుందని ముందుగా ప్రచారం జరిగినప్పటికీ.. ఆమె కనిపించలేదు.  దీంతో ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రష్మిక ఎందుకు రాలేదంటూ ఫ్యాన్స్ చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే 'రాకా' షూటింగ్ కారణంగానే రష్మిక ఈ ఈవెంట్ కి రాలేకపోయారని తెలుస్తోంది.  అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'రాకా' మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న రష్మిక కూడా ఆ షూటింగ్ లో పాల్గొతున్నట్లు సమాచారం. అందుకే ‘రణబాలి’ వెంట్‌కు రాలేకపోయిందని అంటున్నారు. ఈ విషయంపై విజయ్ కూడా స్పందించారు. రష్మిక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. షూటింగ్స్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది. అందుకే ట్రైలర్ లాంచ్ కు ఆమె రాలేకపోయినట్లు చెప్పారు. అంతేకాదు, నెక్స్ట్ జరిగే రణబాలి ప్రమోషనల్ కార్యక్రమాల కోసం రష్మిక వస్తుందని విజయ్ తెలిపారు. ఇది కూడా చదవండి: తమిళ రాజకీయాల్లో ట్విస్ట్.. పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న లతా రజనీకాంత్.?       [Ranabaali Trailer Launch Event, Rashmika Absent, Ranabaali Trailer, Ranabaali Movie, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Telugu Film News]  
యంగ్ హీరో నితిన్‌ నటిస్తున్న కొత్త సినిమా ‘అలియాస్ రుక్మిణి’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను సమర్పిస్తుండగా.. యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.  అయితే ఈ సినిమాలో రుక్మిణి ఎవరు? అనే ప్రశ్నకు మాత్రం చిత్ర బృందం ఇంకా సమాధానం చెప్పలేదు. అక్టోబర్ 13న రుక్మిణి గురించి కీలక వివరాలు వెల్లడించనున్నట్లు ప్రకటించి సస్పెన్స్‌ను మరింత పెంచారు. దీంతో నితిన్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇప్పటివరకు కథానాయిక వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌ కూడా వినూత్నంగా ఉంది. దర్శకుడు మురళీ కాంత్ ఈ సినిమా కథను నానికి వివరిస్తున్నట్లు వీడియో మొదలవుతుంది. ఇది కృష్ణుడి కథ అని దర్శకుడు చెప్పడంతో నాని ఆసక్తిగా వింటారు. అయితే అక్కడ కనిపించే పుస్తకాలన్నీ రుక్మిణి రాసినవని తెలిసి.. ‘ఈ రుక్మిణి ఎవరు?’ అని ప్రశ్నిస్తారు. అప్పటివరకు నిద్రపోతున్న నితిన్ మేల్కొని ‘రుక్మిణి నా భార్య’ అని చెప్పడంతో గ్లింప్స్ ముగుస్తుంది. ఈ చిన్న సన్నివేశంతోనే సినిమా కథపై ఆసక్తి పెంచారు. ఇక ఈ చిత్రంలో సాయికుమార్, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జోమోన్ టీ. జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌తోనే ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా.. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 13న రుక్మిణి పాత్రకు సంబంధించిన వివరాలు బయటకు వస్తే ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది.      [Nithiin Alias Rukmini, Alias Rukmini Release Date, Nithiin New Movie, Nani Presents Alias Rukmini, Murali Kanth Devasoth, Alias Rukmini Heroine, Nithiin Movies, Vijai Bulganin, Telugu Movie Updates, Alias Rukmini December 4]
సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఒకప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పార్టీ ఏర్పాటు చేసి తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని అభిమానులు ఆశించారు. కానీ చివరి నిమిషంలో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రపతి కోటాలో తనను రాజ్యసభకు నామినేట్ చేయాలని కోరుతూ లతా రజనీకాంత్ కేంద్రంలోని కీలక నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి తదితరులతో ఆమె మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ కావచ్చని తెలుస్తోంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని చాలాకాలం పాటు చర్చ జరిగింది. 2017లో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. ఆ తర్వాత పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేసినా, 2020 చివర్లో అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పార్టీని ప్రారంభించడం లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై అప్పటివరకు ఉన్న అంచనాలకు తెరపడింది. అయితే ఇప్పుడు లతా రజనీకాంత్ పేరు తెరపైకి రావడం ఆసక్తిని పెంచుతోంది. ఆమెకు రాజ్యసభ సభ్యత్వం లభిస్తే రజనీకాంత్ కుటుంబం రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లవుతుంది.  తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రముఖుల ప్రభావం ఎప్పటి నుంచో ఉంది. ఎంజీఆర్, జయలలిత నుంచి తాజాగా విజయ్ వరకు సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పలువురు ప్రజాదరణతో కీలక స్థానాలకు చేరుకున్నారు.  తమిళనాడులో తమ రాజకీయ బలాన్ని పెంచుకోవాలని చూస్తోన్న బీజేపీకి.. రజనీకాంత్ కుటుంబంతో సాన్నిహిత్యం రాజకీయంగా ఉపయోగపడుతుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి. లతా రజనీకాంత్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా రజనీ అభిమానుల మద్దతు పొందవచ్చని బీజేపీ భావిస్తోందన్న ప్రచారం ఉంది. ఇది కూడా చదవండి: విజయ్ దేవరకొండపై నెగెటివ్ ప్రచారం.. వెనకుండి నడిపిస్తున్నది ఎవరు.?       [Latha Rajinikanth Rajya Sabha, Rajya Sabha Nomination, Latha Rajinikanth, Rajinikanth Wife, Tamil Nadu Politics, Rajinikanth, BJP Tamil Nadu, Amit Shah, Rajnath Singh, Telugu News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
తెలుగువారి ఇళ్లల్లో ఆదివారం ఉదయమైనా, విశేషమైన పండుగల వేళ అయినా అందరూ ఎంతో సంబరంగా చేసుకునే ప్రత్యేక ఉపహారాల్లో పూరీ ఒకటి. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఇంట అందరూ ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తినే ఈ పూరీలలో ఒకే ఒక్క సమస్య ప్రతీ ఇంటా ఇల్లాళ్లను తరచూ వేధిస్తూ ఉంటుంది. అదేంటంటే పూరీలు కడాయిలోని నూనెను విపరీతంగా పీల్చేయడం. అలా నూనె జిడ్డుగా మారిన పూరీలు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాకపోగా, రుచిని మరియు తినే ఉత్సాహాన్ని పూర్తిగా పాడుచేస్తాయి. అయితే ఈ నిత్యం ఎదురయ్యే సమస్యకు సులువైన, అద్భుతమైన పరిష్కారంతో ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అనితా మోహన్ కొన్ని ప్రతిరోజూ పాటించదగిన కిచెన్ హ్యాక్స్ పంచుకున్నారు. చాలామంది పూరీ పిండిని నలిపేటప్పుడు చపాతీ పిండిలా బాగా మెత్తగా కలుపుతుంటారు, కానీ అది చాలా పెద్ద పొరపాటు. అనితా మోహన్ చెప్పిన వివరణ ప్రకారం, పూరీ పిండిని ఎప్పుడూ తగినన్ని నీళ్లు మాత్రమే పోస్తూ చాలా గట్టిగా, బిగుతుగా కలుపుకోవాలి. పిండి ఎంత గట్టిగా ఉంటే, పూరీలు వేయించేటప్పుడు నూనెను అంత తక్కువగా పీల్చుకుని, పూరి గుల్లగా బంతిలా పొంగుతుంది. దీనితో పాటు పిండి కలిపే సమయంలో కేవలం ఒకట్రెండు స్పూన్ల ఉప్మా రవ్వ (సుజీ)ని కలిపితే చాలు. ఇది పూరీలు వేడెక్కిన తర్వాత కూడా త్వరగా మెత్తబడిపోకుండా, ఎక్కువసేపు కరకరలాడుతూ ఉండేలా చేస్తుంది. మరొక ముఖ్యమైన వినూత్న చిట్కా ఏమిటంటే, పిండి కలిపిన వెంటనే పూరీలు ఒత్తేసి వేయించడం కంటే, ఆ పిండిపై మూతపెట్టి కనీసం 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చల్లబడిన పిండితో పూరీలు ఒత్తి వేడి నూనెలో వేసినప్పుడు, ఉష్ణోగ్రత వైవిధ్యం వల్ల పిండి నూనెను అస్సలు పీల్చుకోదు. ముఖ్యంగా పండుగ రోజుల్లో లేదా ఇంట్లో గెస్టులు వచ్చినప్పుడు ముందుగానే పిండి సిద్ధం చేసుకునేవారికి ఈ ఫ్రిజ్ టెక్నిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక పూరీలు వేయించడానికి కడాయి పొయ్యిపై పెట్టి నూనె బాగా కాగుతున్న సమయంలో, ఆ నూనెలో చిటికెడు ఉప్పు వేయాలి. ఇలా వేసిన ఉప్పు నూనెపై ఒక రక్షక పొరలా పనిచేసి పూరీలు ఎక్కువ నూనెను పీల్చకుండా అడ్డుకుంటుంది. అయితే వేసే ఉప్పు పరిమాణం చాలా చిటికెడు మాత్రమే ఉండాలి, లేకపోతే వేడి నూనె పైకి తుల్లే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి. చివరగా, పూరీలు రుద్దేటప్పుడు చాలామంది పొడి పిండిని చల్లుతుంటారు. ఆ పొడి పిండి వేడి నూనెలో రాలిపోయి మాడిపోవడం వల్ల నూనె రంగు మారి నూనె పాడవుతుంది. అందుకే పూరీ పీట, లంబకోణ కర్రకు కాస్త నూనె రాసి మాత్రమే పూరీలను సమానంగా ఒత్తుకోవాలి. నూనె పొగలు రాకుండా బాగా వేడెక్కిన తర్వాతే మీడియం-హై ఫ్లేమ్‌పై పూరీలను వేయించాలి. చల్లటి లేదా తక్కువ వేడి ఉన్న నూనెలో వేస్తే పూరీ స్పాంజిలా నూనె మొత్తాన్ని తాగేస్తుంది. ఈ చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే తక్కువ నూనెతో, ఎంతో హెల్దీగా, బంతిలా పొంగే కరకరలాడే రుచికరమైన పూరీలను మీ ఇంట్లోనే అత్యంత సులభంగా తయారు చేసుకోవచ్చు!       [Poori Making Tips, Crispy Poori, Oil Free Cooking Tips, Anita Mohan, Poori Recipe, Kitchen Hacks, Suji Poori, Perfect Puffy Poori, Cooking Tips Telugu, Indian Breakfast Recipes]  
సూది గుచ్చుకుంటే విపరీతమైన భయం వేస్తుందా? ఇంజెక్షన్ తీసుకోవడం లేదా క్యాన్యులా అమర్చుకోవడం వంటి చిన్న వైద్య ప్రక్రియల సమయంలో కలిగే నొప్పులు మిమ్మల్ని కలవరపెడుతున్నాయా? అయితే మీకో అద్భుతమైన శుభవార్త! మీ ఫేవరెట్ మ్యూజిక్ వినడం ద్వారా ఇటువంటి శారీరక నొప్పులను గణనీయంగా తగ్గించుకోవచ్చని ఇటీవల జరిగిన ఒక క్లినికల్ పరిశోధనలో సైంటిస్టులు నిరూపించారు. నొప్పు నివారణకు మందులు వాడకుండానే సంగీతం ఒక నాచురల్ నివారిణిగా పనిచేస్తుందని ఈ వైద్య పరిశోధన స్పష్టం చేస్తోంది. పరిశోధకులు నిర్వహించిన ప్రత్యేక ప్రయోగాల్లో, తమకు ఇష్టమైన పాటలు లేదా సంగీతాన్ని విన్న వ్యక్తులలో నొప్పిని తట్టుకునే శక్తి (Pain Tolerance) గణనీయంగా పెరిగినట్లు తేలింది. సాధారణంగా సంగీతం వినడానికి ముందు సగటున 33.8 సెకన్ల పాటు మాత్రమే నొప్పిని ఓర్చుకోగలిగిన వారు, తమకు నచ్చిన ట్యూన్స్ వింటున్న సమయంలో ఏకంగా 56.2 సెకన్ల పాటు నొప్పిని తట్టుకోగలిగారు. అంటే సంగీతం వినడం వల్ల వారి నొప్పి सहनశక్తి సుమారు 66 శాతం మేర పెరిగిందని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. మ్యూజిక్ పూర్తయిన తర్వాత కూడా ఈ ప్రభావం కొంతసేపు ఉండి, నొప్పి ఓర్పు సమయం 45.4 సెకన్లుగా నమోదైంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న మొత్తం 20 మంది ప్రయోగ అభ్యర్థులలో ఏకంగా 85 శాతం మంది (17 మంది) తమకు ఇష్టమైన సంగీతం వింటున్నప్పుడు తక్కువ నొప్పిని అనుభవించామని, ఎక్కువ సేపు ఓర్పు ప్రదర్శించగలిగామని ధృవీకరించారు. అంతేకాకుండా శస్త్రచికిత్సలు లేదా చిన్నపాటి వైద్య ప్రక్రియల సమయంలో రోగులకు నచ్చిన పాటలను ప్లే చేయడం వల్ల వారిలో ఆందోళన స్థాయిలు (Anxiety Scores) భారీగా తగ్గాయి. అంతేకాక కోలుకునే వేగం (Quality of Recovery) సూచికలలో 123 శాతానికి పైగా ఆశించిన స్థాయి కంటే మెరుగైన ఫలితాలు నమోదైనట్లు సైంటిస్టులు గుర్తించారు. మనస్సును మైమరిపించే పాటలు వింటున్నప్పుడు మెదడులో విడుదలయ్యే ఎండోర్ఫిన్లు మరియు డోపమైన్ వంటి కెమికల్స్ నొప్పి సంకేతాల తీవ్రతను తగ్గిస్తాయి. ముఖ్యంగా, రోగికి సంబంధం లేని సాధారణ సంగీతం కంటే, వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఎంచుకున్న ఫేవరెట్ పాటలే 85 శాతానికి పైగా ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని నిపుణులు తేల్చారు. ఆసుపత్రుల్లో ఇంజెక్షన్లు, చిన్న సర్జరీలు, లేదా మోకాలి ఆపరేషన్ల తర్వాత ఇచ్చే నొప్పి నివారణ మందుల (Analgesics) వాడకాన్ని తగ్గించడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుందని వైద్య రంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. [Music Therapy, Pain Relief, Pain Tolerance, Clinical Research, Favorite Music, Endorphins, Dopamine, Anxiety Reduction, Postoperative Recovery, Pain Management]  
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే.. భారత వైమానిక దళం ఎలా మొదలైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! ఈనాడు భారతదేశ గగనతలాన్ని కాపాడుతున్న భారతీయ వాయుసేన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దళాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆకాశంలో శబ్దవేగాన్ని మించి దూసుకెళ్లే రఫేల్, సుఖోయ్, తేజస్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు భారత సైనిక సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. అయితే ఈ ప్రస్థానం ఎలా ప్రారంభమైందో తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. కేవలం నాలుగు పాత రకం రెండు చక్రాల విమానాలు, ఐదుగురు యువ పైలట్లతో చాలా చిన్నదిగా ప్రారంభమైన వాయుసేన, ఈ రోజు ప్రపంచం మెచ్చే స్థాయికి ఎదిగింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న జరుపుకునే ఎయిర్ ఫోర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ వాయుసేన ఆవిర్భావం, దాని తొలి అడుగుల వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్రను తెలుసుకుంటే.. ఎప్పుడు ప్రారంభమైంది? భారతీయ వాయుసేన అధికారికంగా 1932 అక్టోబర్ 8న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్ట్ ప్రకారం బ్రిటిష్ ఇండియాలో రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు అనుబంధ దళంగా రూపుదిద్దుకుంది. ఆ సమయంలో బ్రిటన్‌లోని క్రాన్‌వెల్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కాలేజీలో శిక్షణ పొందిన ఐదుగురు భారతీయ యువకులు పైలట్లుగా బాధ్యతలు స్వీకరించారు. హరీష్ చంద్ర సిర్కార్, సుబ్రతో ముఖర్జీ, భూపేంద్ర సింగ్, ఐజాద్ బక్ష్ అవాన్ , అమర్జీత్ సింగ్ ఈ చారిత్రక ఘట్టంలో భాగమయ్యారు. మరో యువకుడు జె.ఎన్. టాండన్ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల విమానం నడపడానికి అవకాశం లభించక, సైనిక సరుకుల రవాణా విభాగానికి మారాల్సి వచ్చింది. రెండు చక్రాల విమానాలతో ప్రారంభం.. వాయుసేన ఏర్పడిన మరుసటి సంవత్సరం అంటే 1933 ఏప్రిల్ 1న కరాచీలోని డ్రిగ్ రోడ్ ప్రాంతంలో మొదటి స్క్వాడ్రన్ రూపుదిద్దుకుంది. ఈ స్క్వాడ్రన్‌కు 'ఎ' ఫ్లైట్ అని పేరు పెట్టారు. దీనికి నాయకత్వం వహించడానికి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అనుభవజ్ఞుడైన డెసిల్ బౌచర్ ముందుకు వచ్చారు. ఈ విభాగం దగ్గర ఉన్నవి కేవలం నాలుగు వెస్ట్‌ల్యాండ్ వాపిటి రకానికి చెందిన రెండు చక్రాల విమానాలు మాత్రమే. ఇవి వేగంగా దాడి చేసే యుద్ధ విమానాలు కావు, కేవలం నిఘా , సైన్యానికి సహకారం అందించడానికి మాత్రమే ఉపయోగపడేవి. అయినప్పటికీ భారతీయ పైలట్లు తమ విమానయాన ప్రయాణాన్ని వీటితోనే ఎంతో  ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు. స్వాతంత్ర్య కాంక్షే ఊపిరి పోసింది.. ఆ రోజుల్లో డ్రిగ్ రోడ్‌లోని సైనిక నివాస ప్రాంగణాన్ని అక్కడి సిబ్బంది గాంధీ హిల్ అని పిలుచుకునేవారు. అప్పటికే దేశంలో స్వాతంత్ర్య కాంక్ష ఎంత బలంగా ఉందో ఈ చిన్న అంశం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 1937లో వాయుసేన తన మొదటి ప్రత్యక్ష సైనిక చర్యలను వజీరిస్థాన్ ప్రాంతంలో నిర్వహించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ దళం వేగంగా విస్తరించింది. బర్మా సరిహద్దుల్లో, ఇంఫాల్ ప్రాంతంలో శత్రువులపై సాధించిన విజయాలు భారత వాయుసేన ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పాయి. ఈ సేవలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం 1945లో దీనికి 'రాయల్' అనే గౌరవ పదాన్ని చేర్చి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని పేరు మార్చింది. ఆ తర్వాత 1950లో  గణతంత్ర రాజ్యంగా మారినప్పుడు 'రాయల్' అనే పదాన్ని తొలగించి మళ్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా స్థిరపరిచారు. వాయుసేన పితామహుడు సుబ్రతో ముఖర్జీ.. ఆరంభంలో ఉన్న ఐదుగురు పైలట్లలో ఒకరైన సుబ్రతో ముఖర్జీ భారత వాయుసేన చరిత్రలో మైలురాయిగా నిలిచారు. ఈయన 1954 ఏప్రిల్ 1న భారతీయ వాయుసేనకు తొలి భారతీయ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. అందుకే ఈయన్ను భారతీయ వాయుసేన పితామహుడిగా గౌరవిస్తారు. ఇక తొలిసారిగా నాలుగు చిన్న విమానాలతో మొదలైన మొదటి స్క్వాడ్రన్ ఇప్పటికీ క్రియాశీలంగా పనిచేస్తుండటం విశేషం. ప్రస్తుతం 'ది టైగర్స్' అని పిలిచే ఈ స్క్వాడ్రన్ గ్వాలియర్ కేంద్రంగా మిరాజ్ 2000 యుద్ధ విమానాలను నడుపుతోంది. వాయుసేనకు ఆదర్శ వాక్యం ఇదే.. భగవద్గీతలోని 11వ అధ్యాయం నుండి తీసుకున్న 'నభః స్పృశం దీప్తం' అంటే 'గగనాన్ని దేదీప్యమానంగా స్పృశించు' అనే  సూక్తిని వాయుసేన తన ఆదర్శవాక్యంగా స్వీకరించింది. తొంబై ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భారత వాయుసేన, కరాచీలోని చిన్న విమానాశ్రయం నుంచి ప్రయాణం మొదలుపెట్టి నేడు ఆధునిక సాంకేతికతతో ఆకాశమే హద్దుగా దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది.                                                                                                                                                 *రూపశ్రీ.
మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..! నేటి వేగవంతమైన ప్రపంచంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఎంతగానో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతి ఏటా అక్టోబరు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం , ఈ విషయాలపై బహిరంగంగా మాట్లాడటాన్ని ప్రోత్సహించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ప్రస్తుత కాలంలో ఉద్యోగ ఒత్తిడి, సరిపడా నిద్ర లేకపోవడం, సోషల్ మీడియా అధికంగా వాడటం , వ్యక్తిగత సమస్యలు మన మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి. మనసు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండటానికి రోజువారీ జీవితంలో అలవర్చుకోవాల్సిన కొన్ని సులభమైన అలవాట్లు ఫాలో అవ్వాలి.  అవేంటో తెలుసుకుంటే.. నిద్ర.. తగినంత నిద్రపోవడం ప్రశాంతమైన మనస్సుకు పునాది లాంటిది. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. రాత్రి వేళల్లో ఎక్కువ సమయం మొబైల్ వాడటం తగ్గించడం వల్ల నాణ్యమైన నిద్ర పడుతుంది. ఇది రోజంతా మంచి మూడ్, ఏకాగ్రత , ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాయామం.. క్రమం తప్పకుండా చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల మానసిక అలసట దూరమవుతుంది. రోజూ అర గంట పాటు నడవడం, యోగా చేయడం లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరంతో పాటు మనస్సు కూడా ఉత్తేజితమవుతుంది. డిజిటల్ బ్రేక్.. సామాజిక మాధ్యమాలకు కాసేపు దూరంగా ఉండటం మనస్సుకు మంచిది. ఎప్పుడూ ఫోన్ చూడటం, ఇతరుల జీవితాలతో మనల్ని పోల్చుకోవడం వల్ల తెలియకుండానే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే రోజులో కొంత సమయం డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటూ డిజిటల్ బ్రేక్ తీసుకోవడం అవసరం. ఒత్తిడి.. మనసులోని బాధను లేదా ఒత్తిడిని లోపలే దాచుకోకుండా నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఆత్మీయులతో సమస్యల గురించి మాట్లాడటం వల్ల మనసు తేలికపడుతుంది. ధ్యానం.. రోజూ కొన్ని నిమిషాలు ధ్యానం , ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు అదుపులోకి వస్తుంది. ఆహారం.. మనం తినే ఆహారం కూడా మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్లు ఉన్న సమతుల ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం తగ్గించి, తగినన్ని నీళ్లు తాగుతుండాలి. విరామం.. పని లేదా చదువు మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవడం చాలా ముఖ్యము. గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల మానసిక అలసట పెరుగుతుంది. మధ్యమధ్యలో కాసేపు నడవడం లేదా కళ్లకు విశ్రాంతి ఇవ్వడం వల్ల తిరిగి ఉత్సాహంగా పనిచేయవచ్చు. పర్సనల్ టైమ్.. వ్యక్తిగత సమయాన్ని కేటాయించుకోవడం మర్చిపోకూడదు. మనసుకు నచ్చిన సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, మొక్కల పెంపకం లేదా ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టడం వల్ల రోజువారీ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ చిన్న మార్పులను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని సులభంగా కాపాడుకోవచ్చు.                                                                                                                                                   *రూపశ్రీ.
చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం, అరికాళ్లు మంటగా అనిపించడం, నడిచేటప్పుడు పాదాల్లో మంట లేదా సూదులు గుచ్చినట్లుగా ఉండటం వంటి సమస్యలను చాలామంది సాధారణంగా తీసుకుంటారు. ముఖ్యంగా షుగర్ ఉన్నవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అవి మధుమేహం వల్లే వచ్చాయని భావిస్తుంటారు. అయితే ప్రతి సందర్భంలోనూ కారణం షుగర్ మాత్రమే కాకపోవచ్చు. మన శరీరంలో నరాల పనితీరు సక్రమంగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు అవసరం. వీటిలో Vitamin B12, Vitamin B1, Folate, Calcium వంటి పోషకాలు ముఖ్యమైనవి. వీటిలో ఏదైనా లోపించినప్పుడు నరాలపై ప్రభావం పడి చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం, మంట, బలహీనత లేదా నడకలో అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో Vitamin D లోపం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఇలాంటి లక్షణాలతో సంబంధం కలిగి ఉండవచ్చు. అదే సమయంలో మధుమేహం ఎక్కువకాలం నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీనిని Diabetic Neuropathy అంటారు. ముఖ్యంగా పాదాల్లో మంట, నొప్పి, తిమ్మిర్లు, స్పర్శ తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కేవలం షుగర్‌నే కారణంగా భావించకుండా, అసలు కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. అయితే శరీరంలో పోషక లోపం ఉందని లక్షణాలను బట్టి మాత్రమే నిర్ణయించలేం. అవసరమైన సందర్భాల్లో వైద్యులు సూచించే రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు, Vitamin B12 వంటి పోషకాల స్థాయిలను పరిశీలించడం ద్వారా సమస్యకు కారణం ఏమిటో తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో చేతులు, కాళ్లలో తిమ్మిర్లు ఎందుకు వస్తాయి? అరికాళ్లలో మంటకు షుగర్‌తో పాటు ఇంకా ఏ కారణాలు ఉండవచ్చు? Vitamin B12, B1, Folate, Calcium వంటి పోషకాల లోపాన్ని ఎలా గుర్తించాలి?  వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో Dr. Swathi సులభమైన తెలుగులో వివరిస్తున్నారు. తరచుగా చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం, పాదాల్లో మంట లేదా నొప్పి ఉండటం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వాటి వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడం అవసరం. ఈ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే లేదా తీవ్రంగా ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. గమనిక: ఈ కథనం మరియు వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీకు ఉన్న లక్షణాలకు కారణాన్ని స్వయంగా నిర్ధారించుకోకుండా, అవసరమైన పరీక్షలు మరియు చికిత్స కోసం అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)