
సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఒకప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పార్టీ ఏర్పాటు చేసి తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని అభిమానులు ఆశించారు. కానీ చివరి నిమిషంలో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు ఆసక్తికరంగా మారాయి.
రాష్ట్రపతి కోటాలో తనను రాజ్యసభకు నామినేట్ చేయాలని కోరుతూ లతా రజనీకాంత్ కేంద్రంలోని కీలక నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి తదితరులతో ఆమె మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ కావచ్చని తెలుస్తోంది.
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని చాలాకాలం పాటు చర్చ జరిగింది. 2017లో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. ఆ తర్వాత పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేసినా, 2020 చివర్లో అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పార్టీని ప్రారంభించడం లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై అప్పటివరకు ఉన్న అంచనాలకు తెరపడింది.

అయితే ఇప్పుడు లతా రజనీకాంత్ పేరు తెరపైకి రావడం ఆసక్తిని పెంచుతోంది. ఆమెకు రాజ్యసభ సభ్యత్వం లభిస్తే రజనీకాంత్ కుటుంబం రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లవుతుంది.
తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రముఖుల ప్రభావం ఎప్పటి నుంచో ఉంది. ఎంజీఆర్, జయలలిత నుంచి తాజాగా విజయ్ వరకు సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పలువురు ప్రజాదరణతో కీలక స్థానాలకు చేరుకున్నారు.
తమిళనాడులో తమ రాజకీయ బలాన్ని పెంచుకోవాలని చూస్తోన్న బీజేపీకి.. రజనీకాంత్ కుటుంబంతో సాన్నిహిత్యం రాజకీయంగా ఉపయోగపడుతుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి. లతా రజనీకాంత్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా రజనీ అభిమానుల మద్దతు పొందవచ్చని బీజేపీ భావిస్తోందన్న ప్రచారం ఉంది.
ఇది కూడా చదవండి: విజయ్ దేవరకొండపై నెగెటివ్ ప్రచారం.. వెనకుండి నడిపిస్తున్నది ఎవరు.?
[Latha Rajinikanth Rajya Sabha, Rajya Sabha Nomination, Latha Rajinikanth, Rajinikanth Wife, Tamil Nadu Politics, Rajinikanth, BJP Tamil Nadu, Amit Shah, Rajnath Singh, Telugu News]





