ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే.. భారత వైమానిక దళం ఎలా మొదలైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Published on: Fri Oct 9, 2026 11:22AM
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే.. భారత వైమానిక దళం ఎలా మొదలైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఈనాడు భారతదేశ గగనతలాన్ని కాపాడుతున్న భారతీయ వాయుసేన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దళాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆకాశంలో శబ్దవేగాన్ని మించి దూసుకెళ్లే రఫేల్, సుఖోయ్, తేజస్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు భారత సైనిక సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. అయితే ఈ ప్రస్థానం ఎలా ప్రారంభమైందో తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. కేవలం నాలుగు పాత రకం రెండు చక్రాల విమానాలు, ఐదుగురు యువ పైలట్లతో చాలా చిన్నదిగా ప్రారంభమైన వాయుసేన, ఈ రోజు ప్రపంచం మెచ్చే స్థాయికి ఎదిగింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న జరుపుకునే ఎయిర్ ఫోర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ వాయుసేన ఆవిర్భావం, దాని తొలి అడుగుల వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్రను తెలుసుకుంటే..
ఎప్పుడు ప్రారంభమైంది?
భారతీయ వాయుసేన అధికారికంగా 1932 అక్టోబర్ 8న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్ట్ ప్రకారం బ్రిటిష్ ఇండియాలో రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు అనుబంధ దళంగా రూపుదిద్దుకుంది. ఆ సమయంలో బ్రిటన్‌లోని క్రాన్‌వెల్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కాలేజీలో శిక్షణ పొందిన ఐదుగురు భారతీయ యువకులు పైలట్లుగా బాధ్యతలు స్వీకరించారు. హరీష్ చంద్ర సిర్కార్, సుబ్రతో ముఖర్జీ, భూపేంద్ర సింగ్, ఐజాద్ బక్ష్ అవాన్ , అమర్జీత్ సింగ్ ఈ చారిత్రక ఘట్టంలో భాగమయ్యారు. మరో యువకుడు జె.ఎన్. టాండన్ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల విమానం నడపడానికి అవకాశం లభించక, సైనిక సరుకుల రవాణా విభాగానికి మారాల్సి వచ్చింది.
రెండు చక్రాల విమానాలతో ప్రారంభం..
వాయుసేన ఏర్పడిన మరుసటి సంవత్సరం అంటే 1933 ఏప్రిల్ 1న కరాచీలోని డ్రిగ్ రోడ్ ప్రాంతంలో మొదటి స్క్వాడ్రన్ రూపుదిద్దుకుంది. ఈ స్క్వాడ్రన్‌కు 'ఎ' ఫ్లైట్ అని పేరు పెట్టారు. దీనికి నాయకత్వం వహించడానికి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అనుభవజ్ఞుడైన డెసిల్ బౌచర్ ముందుకు వచ్చారు. ఈ విభాగం దగ్గర ఉన్నవి కేవలం నాలుగు వెస్ట్‌ల్యాండ్ వాపిటి రకానికి చెందిన రెండు చక్రాల విమానాలు మాత్రమే. ఇవి వేగంగా దాడి చేసే యుద్ధ విమానాలు కావు, కేవలం నిఘా , సైన్యానికి సహకారం అందించడానికి మాత్రమే ఉపయోగపడేవి. అయినప్పటికీ భారతీయ పైలట్లు తమ విమానయాన ప్రయాణాన్ని వీటితోనే ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు.
స్వాతంత్ర్య కాంక్షే ఊపిరి పోసింది..
ఆ రోజుల్లో డ్రిగ్ రోడ్‌లోని సైనిక నివాస ప్రాంగణాన్ని అక్కడి సిబ్బంది గాంధీ హిల్ అని పిలుచుకునేవారు. అప్పటికే దేశంలో స్వాతంత్ర్య కాంక్ష ఎంత బలంగా ఉందో ఈ చిన్న అంశం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 1937లో వాయుసేన తన మొదటి ప్రత్యక్ష సైనిక చర్యలను వజీరిస్థాన్ ప్రాంతంలో నిర్వహించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ దళం వేగంగా విస్తరించింది. బర్మా సరిహద్దుల్లో, ఇంఫాల్ ప్రాంతంలో శత్రువులపై సాధించిన విజయాలు భారత వాయుసేన ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పాయి. ఈ సేవలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం 1945లో దీనికి 'రాయల్' అనే గౌరవ పదాన్ని చేర్చి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని పేరు మార్చింది. ఆ తర్వాత 1950లో గణతంత్ర రాజ్యంగా మారినప్పుడు 'రాయల్' అనే పదాన్ని తొలగించి మళ్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా స్థిరపరిచారు.
వాయుసేన పితామహుడు సుబ్రతో ముఖర్జీ..
ఆరంభంలో ఉన్న ఐదుగురు పైలట్లలో ఒకరైన సుబ్రతో ముఖర్జీ భారత వాయుసేన చరిత్రలో మైలురాయిగా నిలిచారు. ఈయన 1954 ఏప్రిల్ 1న భారతీయ వాయుసేనకు తొలి భారతీయ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. అందుకే ఈయన్ను భారతీయ వాయుసేన పితామహుడిగా గౌరవిస్తారు. ఇక తొలిసారిగా నాలుగు చిన్న విమానాలతో మొదలైన మొదటి స్క్వాడ్రన్ ఇప్పటికీ క్రియాశీలంగా పనిచేస్తుండటం విశేషం. ప్రస్తుతం 'ది టైగర్స్' అని పిలిచే ఈ స్క్వాడ్రన్ గ్వాలియర్ కేంద్రంగా మిరాజ్ 2000 యుద్ధ విమానాలను నడుపుతోంది.
వాయుసేనకు ఆదర్శ వాక్యం ఇదే..
భగవద్గీతలోని 11వ అధ్యాయం నుండి తీసుకున్న 'నభః స్పృశం దీప్తం' అంటే 'గగనాన్ని దేదీప్యమానంగా స్పృశించు' అనే సూక్తిని వాయుసేన తన ఆదర్శవాక్యంగా స్వీకరించింది. తొంబై ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భారత వాయుసేన, కరాచీలోని చిన్న విమానాశ్రయం నుంచి ప్రయాణం మొదలుపెట్టి నేడు ఆధునిక సాంకేతికతతో ఆకాశమే హద్దుగా దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది.
*రూపశ్రీ.


