Home

»

Latest News

తప్పు జరిగితే దానికి నేనే బాధ్యుడ్ని.. విమర్శలకు దుల్కర్ సల్మాన్ సమాధానం ఇదే.!

Oct 9, 2026 12:37PM

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆయన.. ఇటీవల ‘ఐ యామ్ గేమ్’తో మలయాళంలోకి రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. విడుదల సమయంలో కొన్ని ప్రాంతాల్లో షోలు రద్దు కావడం, సినిమా కంటెంట్‌పై ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో దుల్కర్‌తో పాటు ఆయన నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్‌పై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. 

తాజాగా ఈ సినిమా ఫలితంపై దుల్కర్ సల్మాన్ స్పందించారు. సినిమా వైఫల్యంపై తనకు వచ్చిన విమర్శల్లో నిజం ఉందని అంగీకరిస్తూనే, ఒక సినిమాను రూపొందించడం అంత సులభమైన విషయం కాదని చెప్పారు. తెరపై కనిపించే తుది ఫలితాన్ని విశ్లేషించడం సులభమేనని, కానీ ఒక సినిమా వెనుక వందల మంది కష్టం ఉంటుందని వివరించారు. అందరూ తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనుకున్నట్టుగా ఉండవని పేర్కొన్నారు. సినిమా నిర్మాణంలో తప్పులు జరిగితే వాటికి తననే బాధ్యుడిగా చూడాలని, తన టీమ్‌ను మాత్రం తాను ఎప్పుడూ సమర్థిస్తానని చెప్పడం ఆయన హుందాతనాన్ని చాటింది. 

‘ఐ యామ్ గేమ్’ విడుదలైన నెల రోజుల తర్వాత దుల్కర్ ఈ విధంగా స్పందించడంతో అభిమానులు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక సినిమా విజయం సాధించడానికి నిర్దిష్టమైన ఫార్ములా ఏదీ ఉండదని, పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడమే ముఖ్యమని ఆయన వ్యాఖ్యల సారాంశం. గతంలో తెలుగులో వరుస విజయాలు అందుకున్న దుల్కర్‌కు ఇటీవల ‘కాంత’, ‘ఐ యామ్ గేమ్’ సినిమాల ఫలితాలు నిరాశ కలిగించాయి. దీంతో ఇప్పుడు ఆయన తదుపరి తెలుగు సినిమా ‘ఆకాశంలో ఒక తార’పై దృష్టి పెట్టారు. 

పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దుల్కర్ సరసన సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తున్నారు. కలలు, ఆశయాల నేపథ్యంలో సాగే ఈ సినిమా నవంబర్ 20, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ‘ఆకాశంలో ఒక తార’తో దుల్కర్ మళ్లీ విజయాల బాట పడతారా? తెలుగు ప్రేక్షకుల్లో తనకున్న క్రేజ్‌ను మరోసారి బాక్సాఫీస్ విజయంగా మార్చుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

 

 

[Dulquer Salmaan, I'm Game Movie Failure, Dulquer Salmaan Latest News, Aakasamlo Oka Tara Movie, Dulquer Salmaan Upcoming Movies, Aakasamlo Oka Tara Release Date, Dulquer Salmaan Box Office Failure]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com