నేటి నుంచి పది రోజులు జీరో షాడో.. అంటే ఏమిటో తెలుసా?
posted on May 5, 2025 10:15AM

మిట్ట మధ్యాహ్నం మీ నీడ మాయమైపోతుందంటే నమ్ముతారా? అసలు పగటి వేళ మనిషి.. మనిషి అనేమిటి ప్రతి వస్తువు నీడ కనబడుతూనే ఉంటుంది. అటువంటికి పది రోజుల మాట ప్రతి రోజూ మిట్టమధ్యాహ్నం వేళ నీడ మాయమైపోతుందంటే ఆశ్చర్యంగా లేదూ. ఆ పది రోజులూ సరిగ్గా మిట్టమధ్యాహ్నం రెండు నిముషాల పాటు నీడ కనిపించదు. ఈ పరిస్థితిని జీరో షాడో అంటారు. సోమవారం (మే 5) నుంచి ఈ నెల 14 వరకూ ఓ పది రోజుల పాటు మధ్యాహ్నం రెండు నిముషాల పాటు మనిషి నీడ మాయమైపోతుంది. పది రోజుల పాటు సరిగ్గా మిట్టమధ్యాహ్నం ఈ ఖగోళ అద్భుతం సంభవిస్తుంది.
సాధారణంగా ఎండ వేళ మనిషి నీడ కనిపిస్తుంది. అయితే సోమవారం (మే 5) నుంచి మే 14 వరకూ మాత్రం మిట్టమధ్యాహ్నం సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటంతో నీడ మాయమౌతుంది. భూమి అక్ష్యం 23.5 డిగ్రీల వంపుగా ఉండటం వల్ల భూమి సూర్యుడి చుట్టూ తిరిగే సమయంలో ఉత్తర, దక్షిణ దిశలలో మారుతూ ఉంటుంది. ప్రతి ఏటా రెండు సందర్భాలలో కర్నాటక-మకర రేఖల మధ్య ఉన్న ప్రదేశాలలో సూర్యకిరణాలు మిట్టమధ్యాహ్న సమయంలో భూమిపై నిట్టనిలువుగా పడతాయి. ఈ కారణంగానే నిలువుగా ఉండే వస్తువుల నీడ ఈ రోజులలో మట్టమధ్యాహ్నం కనిపించదు.