వైఎస్ వివేకా కేసులో 15మందిపై అనుమానాలు... కారణాలు చెప్పిన జగన్ చెల్లెలు సునీత...

తన తండ్రి హత్య కేసులో ప్రధానంగా 15మందిపై అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టుకు తెలిపిన వైఎస్ వివేకా కుమార్తె సునీత... అందుకు కారణాలను కూడా వివరించారు. హైకోర్టుకు అందజేసిన అనుమానితుల జాబితాలో ముగ్గురు నలుగురు మినహా అందరూ వైఎస్ కుటుంబ సభ్యులు, వాళ్ల సన్నిహితులే కావడంతో... ఎందుకు అనుమానిస్తున్నారో క్లారిటీ చెప్పుకొచ్చారు సునీత.  

1. వైఎస్ భాస్కర్ రెడ్డి (కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి) - వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక భాస్కర్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదించగా వైఎస్ వివేకానందరెడ్డి వ్యతిరేకించారు.

2. వైఎస్ మనోహర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి చిన్నాన్న) - వైఎస్ వివేకా బెడ్రామ్ అండ్ బాత్రూమ్ లో రక్తపు మరకలను శుభ్రం చేయమని మనోహర్ రెడ్డి తనకు చెప్పారంటూ యర్ర గంగిరెడ్డి పోలీసులకు చెప్పారు. మేము జైల్లో యర్ర గంగిరెడ్డిని కలిసినా ఇదే విషయం చెప్పారు.

3. వైఎస్ అవినాష్ రెడ్డి (కడప వైసీపీ ఎంపీ) - వైఎస్ వివేకా హత్య జరిగాక మొదట ఇంటికి వెళ్లిన వ్యక్తి... ఉదయం 6గంటలకే ఘటనాస్థలానికి వెళ్లిన మొదటి కుటుంబ సభ్యుడు... శంకర్‌ రెడ్డి గదులను శుభ్రం చేసేటప్పుడు అక్కడే ఉన్నారు.. అందుకే, శంకర్‌ రెడ్డిని అవినాష్ రక్షిస్తున్నాడని భావిస్తున్నాం... అలాగే, కడప ఎంపీగా అధికారులపై ప్రభావం చూపించగలరు.. 

4. వాచ్ మన్ రంగయ్య ( వైఎస్ వివేకా ఇంటి కాపలాదారు ) - వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు ఇంటి దగ్గరే ఉన్నాడు... మార్చి 14న మధ్యాహ్నం 12-45కి తన భర్త రాజశేఖర్ కు ఫోన్ చేసి పులివెందుల ఎప్పుడు వస్తున్నారని ఆరా తీశాడు... ఆ తర్వాత తాను ఫోన్ చేయలేదని మాట మార్చాడు... ఫోన్ చేయమని వాచ్ మన్ కి చెప్పిందెవరు?... వివేకా హత్య జరిగిన రోజు తాను నిద్రలో ఉన్నాను... తనకేమీ వినబడలేదని వాచ్ మన్ చెబుతున్నాడు... కానీ, ఇంట్లో ఎన్నో వస్తువులను బద్దలు కొట్టారు... ఆ శబ్దాలు రంగయ్యకు ఎందుకు వినిపించలేదో తెలియడం లేదు?... వివేకానంద రెడ్డిని చివరిగా చూసింది వాచ్‌మన్‌ రంగయ్యే... ఏం జరిగిందో బయటకు చెప్పడానికి భయపడుతున్నాడు? సహజంగా రంగయ్య తక్కువ నిద్రపోతాడు. అతను వేకువజామున 5గంటలకే మేలుకొంటాడు. కానీ, సంఘటన జరిగిన రోజు ఉదయం 6గంటల వరకు నిద్రలోనే ఉన్నాడు. కృష్ణారెడ్డి, లక్ష్మమ్మ, ప్రకాశ్‌ వచ్చే వరకూ లేవలేదు. ఎందుకలా? వివేకానంద రెడ్డి బాత్రూంలో ఉన్నట్లు మొదటగా గుర్తించింది రంగయ్యే. సహజంగా అతను ఇంట్లోకి వెళ్లడు. ఎవరి సూచనలు లేకుండా పక్క తలుపుగుండా అతను ఎందుకు లోపలికి వెళ్లాడు?

5. డి.శివశంకర్‌రెడ్డి... ఇతను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు... గతంలో అతనికి నేరచరిత్ర ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా స్థానంలో పోటీ చేయాలని భావించారు. 2010లో సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో శంకర్‌రెడ్డి సాంఘిక వ్యతిరేక కార్యాకాలపాలకు వ్యతిరేకంగా వివేకా ధర్నా చేశారు. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. వివేకా బతికుండగా ఆయన ఇంటికి శంకర్‌ రెడ్డి వచ్చేవారు కాదు. కానీ వివేకా మృతి చెందిన రోజు ఉదయం మాత్రం వివేకా బెడ్రూమ్‌లోనే శివశంకర్‌రెడ్డి ఉన్నారు. ఇతరులను లోనికి రానీయలేదు. ఫొటోలు తీసుకోవడానికి అనుమతించలేదు. కానీ ఆ ప్రాంతం శుభ్రం చేయడాన్ని మాత్రం ఆపలేదు. అంటే ఈ పరిణామాల గురించి ఆయనకు తెలిసే శుభ్రం చేయడానికి అనుమతించాడా? వివేకానంద రెడ్డికి హార్ట్‌ ఎటాక్‌ అని సాక్షి మీడియా హెడ్‌ బాలకృష్ణకు రిపోర్ట్‌ చేశారు. ఆయన ఎందుకలా చెప్పారు? 2016 ఎన్నికల్లో వివేకా స్థానంలో ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకున్నారు. అది జరగకపోవడంతో అతను మృతునికి దూరంగా జరిగారు. అతను టీడీపీ నుంచి డబ్బును అనుమతించారు. అంతేగాక వైసీపీ వారు టీడీపీకి ఓటు వేయవచ్చన్న పరిస్థితిని వైసీపీలో కల్పించారు.

6. యర్ర గంగిరెడ్డి: వైఎస్‌ వివేకానందరెడ్డికి 40ఏళ్లుగా అత్యంత సన్నిహితుడు. గంగిరెడ్డి ...వివేకాను హత్య జరిగిన రోజు రాత్రి 11.15 గంటలకు ఆయన ఇంటి వద్ద వదిలేశారు. ఇల్లు మొత్తం ఆయనకు తెలుసు. ఆరోజు 7 గంటలకు సంఘటనా స్థలికి వచ్చిన గంగిరెడ్డి.... భార్య, కుమార్తె, అల్లుడు ఫోన్‌ చేసినా తీయలేదు. అంతేగాక వివేకాది సహజ మరణమని ప్రతి ఒక్కరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఒత్తిడి తెచ్చాడు. సీఐ సమక్షంలో ఘటనా స్థలిని శుభ్రం చేయడం, మృతదేహం డ్రెస్సింగ్‌, క్లీనింగ్‌ వంటి పనులను పర్యవేక్షించాడు. కుటుంబ సభ్యులం లేకుండానే అదే రోజు అంత్యక్రియలు నిర్వహిచేందుకు ఏర్పాట్లు కూడా చేపట్టాడు. అయితే, వైఎస్‌ మనోహర్‌ రెడ్డి చెప్పినందుకే సంఘటన స్థలాన్ని శుభ్రం చేయించాల్సి వచ్చిందని ఆ తరువాత తెలిపాడు.

7. ఉదయ్‌ కుమార్‌ రెడ్డి - వివేకా మృతి గురించి ఉదయ్‌కు తెలుసని, ఆ రోజు వేకువజామున 3.30 గంటలకే ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఆయన స్నేహితులతో ఆయన తల్లి తెలిపింది. అదే సమయంలో హాస్పిటల్లో పరమేశ్వర్‌ రెడ్డికి ఒక విజిటర్‌ ఫోన్‌లో ఏదో చూపించాడు. ఉదయ్‌, ఈసీ సురేందర్‌ రెడ్డి, డి.శివశంకర్‌ రెడ్డి 14వ తేదీ అర్ధరాత్రి కలిసినట్లుగా రిపోర్టులున్నాయి. శివశంకర్‌ రెడ్డికి ఉదయ్‌ సన్నిహితుడు. ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, ప్రకాశ్‌ రెడ్డి, సతీశ్‌ రెడ్డి, డాక్టర్‌ మధులను గత ఆగస్టులో విచారించారు. ఆ తరువాత వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, ఈసీ సురేంద్రనాధ్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి మంగళగిరిలో డీజీపిని ఎందుకు కలవాల్సి వచ్చింది? కొన్ని అరెస్టులు జరుగుతాయన్న అనుమానంతోనే కలిశారా? ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, డాక్టర్‌ మధుసూధన్‌ రెడ్డిలను విచారణ కోసం కడప తీసుకెళ్తుండగా కొన్ని ఫోన్లు రావడంతో నందిమండలం నుంచే తిప్పిపంపారు. వారిని అభిషేక్‌ మహంతి నేతృత్వంలోని సిట్‌ బృందం ప్రశ్నించకుండా అడ్డుకున్నది ఎవరు?

8. పరమేశ్వర్‌ రెడ్డి: ఈయన స్థానిక నాయకుడు. ఆయన భార్య ఎంపీపీ. పరమేశ్వర్‌ రెడ్డికి నేర చరిత్ర ఉంది. గత ఏడాది మార్చి 13వ తేదీన దినేశ్‌ నర్సింగ్‌ హోంలో చేరుతున్నట్లుగా అడ్మిషన్‌ కార్డు అడిగాడు. అందుకోసం ఆ ఆసుపత్రికి వెళ్లాడు. సాధారణంగా అతను హాస్పిటల్లో రిజిస్టర్‌ చేసుకోడు. 14 తేదీ ఉదయం ఛాతీ నొప్పితో సన్‌రైజ్‌ హాస్పిటల్లో చేరాడు. వివేకాకు తను సన్నిహితుడినని ప్రత్యేకంగా చెప్పాడు. ఎందుకలా ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది? అతనికి ఆ రోజు కొన్ని అస్వస్థత లక్షణాలున్నా మిగిలినదంతా నార్మల్‌గానే ఉంది. ఆ రోజు మధ్యాహ్నం ఎంఆర్‌ఐ కూడా తీశారు. కానీ ముఖ్యమైన పని ఉందంటూ సాయంత్రం సమయంలో గంటన్నర బయటకు వెళ్లాడు. అలాంటి స్థితిలో అతనికి అంత ముఖ్యమైన పని ఏముంది? అతను ఆ రోజు అత్యధికంగా ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. డాక్టర్‌ వద్దంటున్నా వినకుండా బయటకు వెళ్లి సాయంత్రం 8.30 గంటల సమయంలో మళ్లీ అడ్మిట్‌ అయ్యాడు. ఆ సమయంలో అతనేం చేశాడు? వివేకా హత్య జరిగిన రోజు వేకువజామున 3.40 గంటల ప్రాంతంలో ఒకరు అతనిని కలిసి సెల్‌ఫోన్‌ ఇచ్చారు. ఇది సీసీ టీవీలోనూ నమోదైంది. అతను సెల్‌ఫోన్‌లో ఏదో చూశాడు. ఆ ఫోన్‌ ముందురోజు అతని చేతిలో ఉన్నది కాదు. ఆ తరువాతి రోజు తిరుపతి వెళ్లి మరో ఆసుపత్రిలో చేరాడు.

9. శ్రీనివాస్‌ రెడ్డి: ఇతను పరమేశ్వర్‌ రెడ్డికి చాలా వ్యాపారాల్లో భాగస్వామి. పరమేశ్వర్‌ రెడ్డి నార్కో అనాలిస్‌ నుంచి వచ్చాక శ్రీనివాస్‌ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రెండు భిన్న చేతిరాతలతో అతని పేరుతో లేఖ దొరికింది. వివేకా హత్యకు సంబంధించి పోలీసుల వేధింపుల వల్లనే అతను మృతిచెందినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. కానీ వివేకా హత్యకు, శ్రీనివాస్‌ రెడ్డి మృతికి సంబంధముందని మేం నమ్ముతున్నాం.

10. సురేంద్రనాధ్‌ రెడ్డి - అవినాశ్‌ రెడ్డికి బంధువు. ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, సురేంద్రనాధ్‌ రెడ్డి మార్చి 15వ తేదీ ఉదయం శంకర్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆగస్టు 31వ తేదీన అవినాశ్‌ రెడ్డి, శివ శంకర్‌రెడ్డిలతో పాటు డీజీపి కలిశారు. ఆ తర్వాతే దర్యాప్తు నత్తనడకన సాగింది.

11. సురేంద్ర రెడ్డి - పరమేశ్వర్‌ రెడ్డి బావమరిది. ఆసుపత్రిలో ఉన్న సురేంద్రరెడ్డి ఫోన్‌ తీసుకుని ఉదయం 3.40 గంటల ప్రాంతంలో పరమేశ్వర్‌ రెడ్డికి ఏవో వివరాలు చూపించారు. అదే సమయంలో ఉదయ్‌ కుమార్‌ కూడా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఆ వివరాలు గమనిస్తే హత్య పథకం పూర్తయినట్లు వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

12. శంకర్‌ (సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌): ఉదయం 7.10 గంటలకు శంకర్‌ ఘటనాస్థలికి వచ్చారు. ఎం.కృష్ణారెడ్డి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలన్న దానికి అతనే సాక్ష్యం. రాజశేఖర్‌ రెడ్డి ఫోన్‌లో చెప్పాకే ఆయన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడం ఆయనకు ఎందుకు ఇష్టంలేదు? ఏడు అడుగులు విస్తరించిన రక్తపు మడుగును చూపిస్తూ అది సహజమరణం కాదని షేక్‌ ఇనయతుల్లా వివరించాడు. అయినప్పటికీ వివేకా కిందపడి మరణించి వుంటాడని శంకరయ్య నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. పక్కనున్న వాళ్లు చెప్పినా అతను వినిపించుకోలేదు.

13. రామకృష్ణా రెడ్డి, ఏఎస్‌ఐ: శివ శంకర్‌ రెడ్డికి సన్నిహితుడు. దర్యాప్తులో పాల్గొన్న ఏఎస్‌ఐనే ఆ తర్వాత సాక్షిగా తీసుకున్నారు. ఇదెలా?

14. ఆదినారాయణరెడ్డి - సంఘటన జరిగినప్పుడు ఆదినారాయణరెడ్డి మంత్రిగా ఉన్నారు. వివేకానంద రెడ్డి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆది నారాయణ రెడ్డితో పరమేశ్వర్‌రెడ్డి కాంటాక్ట్‌లో వున్నాడు. మార్చి 14వ తేదీ సాయంత్రం శంకర్‌ రెడ్డి టీడీపీ వారిని కలిశారు. అక్కడ వారేమైనా హత్యకు ప్రణాళిక రూపొందించారా? ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే వారు అతనిని రక్షిస్తామన్నారా?

15. బీటెక్‌ రవి - 2016 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాపై బీటెక్‌ రవి విజయం సాధించారు. రవి విజయానికి శివశంకర్‌ రెడ్డి సాయం చేశారు. అప్పుడు వారు కలిసి పని చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి కోసం పని చేశారు. వివేకా మృతితో వైసీపీ నేతల్ని అరెస్టు చేస్తారు, జిల్లాలో గందరగోళం ఏర్పడుతుందన్నది వారి అభిప్రాయం కావచ్చు.