ఎన్నికల తర్వాతే జగన్ అరెస్టు?
posted on May 21, 2012 12:52PM
అక్రమాస్తుల కేసులో ప్రధాననిందుతుడైన వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అరెస్టుపై ఇంకా సందిగ్ధత కొనసాగురూనే ఉండి. నేడో రేపో ఆయనను అరెస్టు చేస్తారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే ఉప ఎన్నికల తరువాత ఆయనను అరెస్టు చేయించాలన్న భావనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలకు ముందు జగన్ ను అరెస్టు చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చని రాష్ట్రప్రభుత్వం భయపడుతోంది. దీనికి తోడు పోలింగ్ కు ముందు అరెస్టు చేస్తే ప్రజల్లో జగన్ పట్ల సానుభూతి పెరిగే ప్రమాదముందని, ఇదే జరిగి అన్ని నియోజకవర్గాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే ప్రభుత్వానికి కొత్త సమస్యలు వస్తాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భయపడుతున్నట్లు తెలిసింది.
జగన్ అరెస్టు, ప్రజా సానుభూతి కారణంగా అన్ని స్థానాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలోని మరికొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు జగన్ పంచన చేరే ప్రమాదముందని, ఇదే జరిగితే ప్రభుత్వ పతనం ఖాయమని కిరణ్ కుమార్ రెడ్డి భయపడుతున్నారు. అందుకే ఎన్నికల ఫలితాల అనంతరమే జగన్ ను అరెస్టు చేస్తే మంచిదన్న భావనతో ఆయన ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో 2, 3 చోట్ల కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లు అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అంచనా వేస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో జగన్ ను బలహీనపరిచి ఎన్నికల అనంతరం అతన్ని అరెస్టు చేస్తే ఇక ఎటువంటి సమస్యలు ఉండవన్నది కిరణ్ కుమార్ వ్యూహంగా కనిపిస్తున్నది. జగన్ అరెస్టుకు ముందుగానే అతని ఆర్ధిక మూలాల మీద దెబ్బకొట్టడం ద్వారా కిరణ్ కుమార్ ప్రభుత్వం జగన్ ను బలహీనపరిచింది.