హైకోర్టులో జగన్‌ పిటిషన్.. నవంబర్ 6న విచారణ

 

వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో అక్టోబర్ 25వ తేదీన శ్రీనివాస్ అనే యువకుడు తనపై దాడికి పాల్పడడంపై  వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని స్వీకరించిన కోర్టు విచారణను నవంబర్ 6కు వాయిదా వేసింది. ఇదే కేసుకు సంబంధించి వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్‌తో కలిపి జగన్ పిటిషన్‌ను విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తనపై దాడి జరిగిన కొద్దిసేపటికే నిందితుడు శ్రీనివాస్ ఫ్లెక్సీలు తీసుకురావడం.. సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై జగన్ అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా వైజాగ్ నార్త్‌జోన్ పోలీసులకు కేసును అప్పగించారని ఆరోపించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని.. తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా విచారణ సాగుతోందని.. ఏపీ ప్రభుత్వానికి సంబంధంలేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. మరి జగన్ పిటిషన్ పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.