జగన్ గారు బీపీ చెకప్ చేయించుకోవాలి... ప్లీజ్...
posted on Aug 22, 2014 3:07PM

వైసీపీ నాయకుడు వైఎస్ జగన్‌ని అభిమానించేవారు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఎంతోమంది వున్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని కలలు కనేవారందరికీ జగన్ ఒక రోల్ మోడల్... ఒక ఇన్‌స్పిరేషన్. అలాంటి గొప్ప వ్యక్తి జగన్ జైల్లో వున్నా, బయట వున్నా హ్యాపీగా వుండాలనే ఆయన అభిమానులు కోరుకుంటూ వుంటారు. అయితే ఈమధ్యకాలంలో జగన్‌ని, ఆయన ప్రవర్తనని చూసి ఆయన అభిమానులు భయపడిపోతున్నారు. ఆయన ఆరోగ్యం ఏమైపోతోందో అని బాధపడుతున్నారు. జగన్‌కి గానీ బీపీ వ్యాధి వచ్చిందేమోనని భయపడుతున్నారు.
జగన్ ఈమధ్య కాలంలో ఏ సందర్భంలో మాట్లాడినా ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీని విమర్శించే సమయంలో అయితే ఆయన ఆవేశ హావభావాలను చూస్తుంటే చాలామంది ఫ్యాన్స్‌కి భయమేస్తోంది. పాపం రాజకీయాలు, కేసుల గొడవలో పడి జగన్ తన ఆరోగ్యం గురించి ఎంతమాత్రం పట్టించుకోవడం లేదన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శుక్రవారం నాడు అసెంబ్లీలో జగన్ ఆవేశంగా మాట్లాడిన తీరు, తెలుగుదేశం శాసనసభ్యులను ‘బఫూన్లు’ అని వ్యాఖ్యానించిన తీరు చూసి జగన్ అర్జెంటుగా బీపీ చెకప్ చేయించుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు.
బీపీ చాలా ప్రమాదకరమైన వ్యాధి. బీపీ సైలెంట్ కిల్లర్ మాదిరిగా శరీరాన్ని లోలోపల పాడుచేసేస్తుంది. బీపీ వున్నవాళ్ళు ఆ వ్యాధి తమకు వుందన్న విషయాన్ని గుర్తించి మందులు వాడుతూ వుంటే ఆరోగ్యం బాగుంటుంది. బీపీ వున్నవాళ్ళలో చాలామందికి తమకు బీపీ వున్న విషయం తెలియదు. వాళ్ళకి బీపీ ఉన్న విషయం వాళ్ళని చూసేవాళ్లకి మాత్రమే తెలుస్తూ వుంటుంది. ఇప్పుడు జగన్ కూడా ఆ కోవకు చెందిన బీపీ పేషెంటే అన్న అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు అర్జెంటుగా బీపీ చెకప్ చేయించుకుని తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, జైల్లో వున్నా, బయటే వున్నా ఆరోగ్యంగానే వుండాలని తమలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నారు. అంచేత జగన్ గారు తనకోసం కాకపోయినా తనను అభిమానించేవారి కోసమైనా అర్జెంటుగా బీపీ చెక్ చేయించుకోవాలి.