తెలంగాణ ఎన్నికల బరిలో టాలీవుడ్ హీరోయిన్

 

సినీ రంగానికి చెందిన వారు రాజకీయాల్లో అడుగుపెట్టటం కొత్తేమి కాదు.ఇప్పటికే పలువురు నటీనటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా తాజాగా మరో నటి రానున్న తెలంగాణ ఎన్నికల బరిలో నిలుస్తుంది.ఈరోజుల్లో సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నటి రేష్మ రాథోడ్ ఇటీవల బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.రేష్మ ప్రస్తుతం బీజేపీ యువజన విభాగం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తుంది.తనకు అవకాశం ఇస్తే ఖమ్మం జిల్లాలోని వైరా అసెంబ్లీ లేదా మహబూబాబాద్ లోక్ సభ నుంచి పోటీ చేయాలనుకున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తుంది.ఈ నేపథ్యంలో బీజేపీ ఇటీవల విడుదల చేసిన జాబితాలో రేష్మ పేరును పొందుపరిచింది.వైరా నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించింది.తనకు సీటు కేటాయించడంపై రేష్మ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపింది.

 

 

ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే రేష్మ ప్రజలతో కలివిడిగా ఉంటూ ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమపథకాల గురించి ప్రచారం చేస్తోంది.అంతేకాకుండా తెరాస ప్రభుత్తంపైనా విమర్శలు చేసింది."బయ్యారం ఉక్కు కార్మాగారానికి కేంద్రం ఆమోదం తెలిపింది. కానీ కేసీఆర్ ప్రభుత్వమే సహాకరించలేదు. ఫ్యాక్టరీని మెదక్ తరలించాలని చూస్తోంది. మా ప్రభుత్వం వస్తే, బయ్యారంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి వేలాదిమందికి ఉపాధి కల్పిస్తాం. ఆయుష్మాన్ భారత్ వంటి అద్భుత పథకానికి కేంద్రం శ్రీకారం చుడితే, తెలంగాణలో మాత్రం దాన్ని అమలు చేయడానికి నిరాకరించారు. ఇది ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యమే" అని రేష్మ పేర్కొంది.ఈ నేపథ్యంలో బీజేపీ సీటు కేటాయించటంతో త్వరలోనే ఎన్నికల క్యాంపైన్ ను మొదలుపెట్టబోతున్నట్టు రేష్మ తెలిపింది.