యోగి ఆదిత్యనాథ్ వెనుక వున్న 15వందలేళ్ల కథ తెలుసా?

యోగి యోగి యోగి... ఇప్పుడు దేశమంతా మార్మోగుతోంది ఈ పేరే! భారతదేశానికి యోగులు కొత్తేం కాదు. కాని, ఆధునిక భారతదేశంలో ఒక యోగి పేరు ఇంతగా వినిపించటానికి కారణం... యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం అవ్వటమే! దేశంలోని అతి పెద్ద రాష్ట్రం ఆయన చేతుల్లోకి రావటంతో అందరి దృష్టి ఒక సన్యాసిపై పడింది! ఇంతకీ యోగిగారి గొప్పేంటి? 

 

యోగి ఆదిత్యనాథ్ గురించి పొలిటికల్ గా మాట్లాడుకుంటే బోలెడంత వుంటుంది. ఆయన కరుడుగట్టిన హిందూత్వం నుంచీ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దాకా చాలా చెప్పుకోవచ్చు. అంతే కాదు, ముందు ముందు యోగి సారథ్యంలో యూపీ ఎటు వెళుతుంది అనేది కూడా ఎవరికి తోచినట్టు వారు విళ్లేషించవచ్చు! కాని, అసలు ఆసక్తికర అంశం ఆదిత్యనాథ్ వెనుక వున్న 15వందలేళ్ల సంప్రదాయం! దాని గురించి తెలుసుకుంటే మనకు బోలెడంతా ఇంట్రస్టింగ్ గా వుంటుంది! యోగి ఆదిత్యనాథ్ ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. అంతకన్నా ఎక్కువగా అతి ప్రాచీనమైన నాథ సంప్రదాయంలోని ఒక కర్మ యోగి!

 

మన దేశంలో పురాణ కాలం నుంచీ కూడా వున్న ఒకానొక సంప్రదాయం సిద్ధ సంప్రదాయం. అదే తరువాత కాలంలో నాథ సంప్రదాయం అయింది. నాథ సంప్రదాయం ప్రకారం ఆదినాథుడు శివుడు. ఆయన తరువాత తమ గురువులుగా మత్స్యేంద్రనాథుడు మొదలు మొత్తం తొమ్మిది మందిని భావిస్తారు నాథ సంప్రదాయం పాటించే వారు. నాథ సంప్రదాయం అంటే కూడా ఒక విధమైన శైవ సంప్రదాయమే. కాకపోతే, వీరు తొమ్మది నాథ మునులు నవ నాథులుగా పేర్కొంటారు. వారి ఉపదేశాల ప్రకారం నాథ సంప్రదాయంలోని సంసారులు, సన్యాస భక్తులు ఇద్దరూ నడుచుకుంటారు. 

 

నాథ సంప్రదాయంలో అందరు గురువుల కంటే అత్యంత ప్రఖ్యాతిగాంచిన వారు గోరక్షానాథ్. ఆయననే ఉత్తరాది వారు గోరఖ్ నాథ్ అంటుంటారు. ఆయన ప్రబావం ఉత్తర్ ప్రదేశ్, నేపాల్, ఉత్తరాఖండ్ లలో చాలా ఎక్కువగా వుంటుంది. అయితే, యావత్ ఉత్తరాదిలో కూడా ఆయన భక్తులు మనకు కనిపిస్తూనే వుంటారు. ఇక గోరక్షానాధ్ ప్రధాన మఠం, ఆలయం వున్న ప్రాంతమే గోరఖ్ పూర్. అక్కడ్నుంచే యోగి ఆదిత్యనాథ్ వరుసగా అయిదుసార్లు ఎంపీగా గెలిచారు. అంతే కాదు, గోరఖ్ పూర్లోని గోరక్షానాథ్ పీఠానికి అధిపతి కూడా ఆయనే! యోగి ఆదిత్యనాథ్ కి సన్యాసం ఇచ్చి... అంత వరకూ తాను పోటి చేసిన ఎంపీ స్థానాన్ని కూడా ఇచ్చిన వారు యోగి అవైద్యనాథ్! ఆయన ఆశీస్సులతోనే అతి పురాతనమైన నాథ సంప్రదాయంలో అడుపెట్టారు యోగిజీ!

 

నాథ్ సంప్రదాయం మరో విశేషం కూడా మనం తప్పకుండా చెప్పుకోవాలి. మన దేశంలోకి ముస్లిమ్ లు దండయాత్రలు చేయక ముందే ప్రారంభమైన నాథ పరంపర అవసరమైతే ధర్మ రక్షణ కోసం ఆయుధాలు పట్టిన సందర్భాలు కూడా వున్నాయి. మధ్య యుగాల్లో ఇటు బౌద్ధాన్ని, అటు ఇస్లామ్ ని సమర్థంగా ఎదుర్కొన్నారు నాథ యోగులు , సన్యాసులు! ఆ పోరాట పాటవాన్నే వారసత్వంగా, ఆశీర్వాదంగా అందుకున్నారు యోగి ఆదిత్యనాథ్. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు యూపీ సీఎం అయ్యారు!

 

నేపాల్ లోని గూర్ఖాలకు, మన దేశ సైన్యంలోని గూర్ఖా రెజింమెంట్ కు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా? గోరక్షానాథ్ నుంచే! ఆయన పేరునే తాము స్వీకరించామని నేపాల్ గూర్ఖాలు, ఇండియన్ గూర్ఖా రెజిమెంట్ వారు చెబుతారు! సో.. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వందల సంవత్సరాల ఆధ్యాత్మిక జ్ఞానం, పోరాట పటిమలకి వారసులన్నమాట!