బడ్జెట్‌ సమావేశాలు ముగిశాక కేసీఆర్‌ కీలక నిర్ణయాలు


బడ్జెట్‌ సమావేశాలు ముగిశాక కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావొస్తుండటంతో ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ కీలక మార్పులు జరగొచ్చని అంటున్నారు. 2019లో వందకి పైగా సీట్లు టీఆర్‌ఎస్‌వేనంటూ ధీమాగా ఉన్న కేసీఆర్‌.... త్వరలో కేబినెట్‌ పునర్ వ్యవస్థీకరణ చేపట్టవచ్చనే టాక్‌ వినిపిస్తోంది. ఇక మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు నిర్వహించుకుంటూ, తన పాలనపై, ప్రజల నాడిపై ఓ అంచనాకి వచ్చిన కేసీఆర్‌.... పనిచేయని నేతలను పక్కనబెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నామినేటెడ్‌, పార్టీ పదవులు పూర్తిస్థాయిలో భర్తీ చేసి.... కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు

 

ఇక డబుల్ బెడ్రూమ్‌ స్కీమ్‌పై తీవ్ర విమర్శలు రావడంతో కేసీఆర్‌ సీరియస్‌ తీసుకున్నారు. ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఈ నెలాఖరు నాటికి రెండున్నర లక్షలకి పైగా డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అయితే కనీసం వందల సంఖ్యలో కూడా ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్‌.... ఈ ఏడాది చివరి నాటికి రెండు లక్షల ఇళ్లు నిర్మించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడగబోమని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

 

అదే సమయంలో రెండున్నరేళ్ల పాలనపై ప్రజల స్పందనను నేరుగా తెలుసుకోవాలని అనుకుంటోన్న గులాబీ బాస్‌... జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే నేతలు, కార్యకర్తలు సంతోషంగా ఉంటేనే టూర్‌ సూపర్‌ సక్సెస్‌ అవుతుందని భావిస్తున్న సీఎం... నామినేటెడ్‌ పదవులు, పార్టీ పదవులు పూర్తిస్థాయిలో భర్తీ చేశాకే.... బస్సు యాత్ర చేపట్టాలని డిసైడైనట్లు చెబుతున్నారు.