అంతర్మథనంతో అల్లాడుతున్న జగన్
posted on Nov 3, 2015 11:05AM

వైసీపీ నాయకుడు ఇప్పుడు అంతర్మథనంతో అల్లాడుతున్నారు. గతంలో ఎన్నోసారు దూకుడుతో కూడిన నిర్ణయాలను తీసుకుని పర్యవసానంగా కష్టాలు కొనితెచ్చుకున్న ఆయన ఆ కష్టాల నుంచి పాఠాలను నేర్చుకోలేదు. తన తండ్రి చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేయడం లాంటి తొందరపాటు నిర్ణయం జగన్ రాజకీయ భవిష్యత్తును ఎంత పెద్ద మలుపు తిప్పిందో తెలిసిన విషయమే. అప్పట్లో చప్పుడు చేయకుండా కూర్చుని వుంటే, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి ఆయన్ని వెతుక్కుంటూ వచ్చేదని రాజకీయ విశ్లేషకులు చెబుతూ వుంటారు. జగన్ తన రాజకీయ జీవితంలో అలాంటి తొందరపాటు నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు. చేయకూడని పొరపాట్లు ఎన్నో చేశారు. అవన్నీ ఆయనకి అధికారానికి మాత్రమే కాదు.. ప్రజలకు కూడా దూరం చేశాయని రాజకీయ పరిశీలకులు చెబుతూ వుంటారు.
ఇటీవలి కాలంలో జగన్ చేసిన అతి పెద్ద పొరపాటు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్ళకపోవడం. తాను శంకుస్థాపన కార్యక్రమానికి రానని, తనకు ఆహ్వానం కూడా పంపవద్దని జగన్ ప్రకటించినప్పుడు ఆయన సన్నిహితులు అలా అనడం మంచిది కాదని చెప్పారట. అయినా సరే జగన్ తన పట్టుదలను వదులుకోలేదు. ఆహ్వానించడానికి వెళ్ళిన మంత్రులకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. ఇది ఆయన విషయంలో ఏపీ ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమైంది. ఆంధ్రులను తిట్టనిదే పూట గడవని కేసీఆర్ కూడా అమరావతి శంకుస్థాపనకు వచ్చి ఇష్టం వున్నా లేకపోయినా నాలుగు మంచి మాటలు చెప్పి వెళ్ళారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో వున్న జగన్‌కి అంతమాత్రం చేతకాలేదా అనే విమర్శలు ప్రజల్లో బాగా వినిపిస్తున్నాయి. ఈ అంశం వైసీపీ ప్రజల దృష్టిలో మరింత పడిపోయేలా చేసింది. తాను తీసుకున్న నిర్ణయం తీసుకువచ్చిన చెడు ఫలితాలను చూసి ఇప్పుడు జగన్ అప్పుడు అలా చేయకుండా వుండాల్సింది.. శంకుస్థాపనకు వెళ్తే ఓ పనైపోయేది అని అంతర్మథనంతో అల్లాడుతున్నట్టు తెలుస్తోంది.