అధికారంలోకి వచ్చినా వైసీపీ అబద్ధాలు చెప్పడం మానలేదు

 

ప్రజా వేదికను తమ పార్టీకి కేటాయించాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ లేఖపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. "సిఎం జగన్ గారికి చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యల పైన ఉంటుందనుకున్నాం. 40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా,  పోతుందా అనే సంశయం తప్ప ఇంకేమీ కనిపించడం లేనట్టుంది. ప్రపంచం మొత్తాన్నిఅమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా?" అని విజయసాయి ట్వీట్ చేశారు.

తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్రంగా స్పందించారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు సీఎం జగన్ కు రాసిన లేఖ మొదటిది కాదని యనమల స్పష్టం చేశారు. సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని గతంలోనే చంద్రబాబు జగన్ కు లేఖ రాశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చినా, వైసీపీ నేతలు అబద్ధాలు చెప్పడం మాత్రం మానలేదని చురకలు అంటించారు. విలాసవంతమైన భవనాలు ఊరికి ఒకటి చొప్పున ఎవరికి ఉన్నాయో అందరికీ తెలుసని యనమల ఎద్దేవా చేశారు.