యాకుబ్ మీమన్ కి ఉరి ఖరారు

 

1993 ముంబై వరుస బాంబు ప్రేలుళ్ళ కేసులో దోషిగా నిర్దారించబడిన యాకుబ్ మీమన్ పిటిషన్ని ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి న్యాయవ్యవస్థ అన్ని అవకాశాలను కల్పించిందని కానీ అతను కేసులో దోషి అని పూర్తి సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడిన తరువాతనే అతనికి మరణ శిక్ష విధించడమయిందని అతనికి ఆ శిక్ష విధించడం సమంజసమేనని పేర్కొన్న ధర్మాసనం యాకుబ్ మీమన్ పెట్టుకొన్న పిటిషన్ని తిరస్కరించింది.

 

ఈరోజు రాష్ట్రపతికి పెట్టుకొన్న క్షమాభిక్ష పిటిషన్నిఆయన హోం శాఖ అభిప్రాయంకు పంపించారు. అంటే ఆయన దానిని తిరస్కరించినట్లే భావించవచ్చును. అదే విషయం తెలియజేస్తూ హోంశాఖ ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. మహారాష్ట్ర గవర్నర్ కూడా యాకుబ్ మీమన్ క్షమాభిక్ష పిటిషన్ని తిరస్కరించారని ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ తెలియజేసారు. ఇక యాకుబ్ మీమన్ కి ఉరి ఖాయం అయినట్లే. రేపు ఉదయం సరిగ్గా 7గంటలకు అతనిని నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉరి తీస్తారు. అనంతరం తదనంతర లాంచనాలన్నీ పూర్తి చేసి అతని శరీరాన్ని అతని కుటుంబ సభ్యులకు అందజేస్తారు. రేపే అతని పుట్టిన రోజు, మరణించే రోజు కావడం విశేషం.