చిదంబరం కాళ్ళు పట్టుకున్నారు... రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం !

 

అసెంబ్లీలో ఒకరి మీద ఒకరు మాటల తూటాలు విసురుకుంటున్న అధికార ప్రతిపక్ష సభ్యులు మండలిలో కూడా అదే విధంగా మొదలుపెట్టారు. శాసన మండలి సమావేశాల్లో భాగంగా ఉన్నత విద్యామండలిలో నిధుల అక్రమాల విషయంలో ఒకరి మీద ఒకరు చేసుకున్న వ్యాఖ్యలు తీవ్ర వాదోపవాదాలకి దారి తీశాయి.  16 నెలల పాటు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని టీడీపీ నేత లోకేష్ చేసిన వ్యాఖ్యల మీద అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. లోకేశ్ కు ఘాటు కౌంటర్ ఇచ్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాతృభాష మాట్లాడటం రాని వారు కూడా మంత్రి పదవులు వెలగబెట్టారని అన్నారు.

తాను పోటీకి నిలబడ్డ స్థానాన్ని మందలగిరి అని పిలిచిన వ్యక్తి లోకేశ్ అని, జయంతిని వర్థంతిగా మాట్లాడి అభాసుపాలయ్యాడని అన్నారు. అలాగే తమది వెన్నుపోటు పార్టీ కాదన్న మంత్రి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యల మీద టీడీపీ సభ్యులు మండిపడ్డారు. మంత్రి సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం సరికాదని పేర్కొంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం తలెత్తింది. అధికార, విపక్ష సభ్యుల అరుపులతో సభలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా పోయింది.