మత్తు వైన్ లో కాదు… బ్రెయిన్ లో వుంటుందట!

 

అంతా మాయ! ఈ జగమంతా మాయ! ఏంటీ… ఇదేదో వేదాంతం అనుకుంటున్నారా? అస్సలు కాదు! ప్రాక్టికల్ సైన్స్! ఇంతకీ… విషయం ఏంటంటే… మనం ప్రపంచంలో వుంటాం. కాని, నిజంగా జరిగేది ఏంటంటే… ప్రపంచం మన మనస్సులో వుంటుంది! మన మనస్సు లేదా మెదడు ఎలా భావిస్తే ప్రపంచం కూడా అలాగే వుంటుంది! అందుకే మన పెద్దలు అంతా మిథ్యా అనేశారు! మనం ఎలా భావిస్తే మన చుట్టూ పరిస్థితులు కూడా అలానే వుంటాయి! ఇందుకు వైన్ కూడా మినహాయింపు కాదు!

 

వైనుకు , వేదాంతానికి లింకేంటి అనుకుంటున్నారా? జర్మనీలో తాజాగా కొందరు రీసెర్చర్స్ చేసిన అధ్యయనం ప్రకారం సంబంధం వుంది! జర్మనీలోని ఓ యూనివర్సిటీలో కొందరు శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు. దానిలో భాగంగా కొందరు వ్యక్తుల్ని ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేసే మిషన్ లో ప్రవేశపెట్టారు. తరువాత వారికి సాధారణ వైన్ తాగించారు. కాని, ఒక చిన్న ట్రిక్ ప్లే చేశారు! మార్కెట్లో కేవలం 12యూరోలు వుండే ఆ వైన్ ని 18 నుంచి 36యూరోల దాకా వెల వున్నట్టు బాటిల్స్ పై అచ్చు వేయించారు! ఆ రేట్ చూస్తూ వైన్ పుచ్చుకున్న సదరు వ్యక్తులు తమ మెదళ్లలో టేస్ట్ అదిరిపోయినట్టుగా ఫీలయ్యారట! కాని, నిజంగా వారు ప్రతీసారీ తాగింది 12యూరోలు విలువ చేసే మామూలు వైనే!

 

బాటిల్ పై వున్న రేటు చూసి ఒకే రకమైన వైన్ని రకరకాలుగా ఎందుకు ఫీలయ్యారు? ఎంత ఎక్కువ రేటు వుంటే అంత టేస్టీగా వున్నట్టు ఎందుకు అనిపించింది? ఎమ్ఆర్ఐ స్కాన్ లో తేలింది ఏంటంటే… వైన్ తీసుకున్న వారి మెదళ్లలో కొన్ని ప్రత్యేక భాగాల్లో అదిక ధర కారణంగా చలనం వచ్చిందట! తాము తాగుతున్నది కాస్ట్ లీ వైన్ అనే ఫీలింగ్ కారణంగా వారికి టేస్ట్ కూడా బావున్నట్టు అనిపించిందట! ఈ కారణంగానే కొన్ని కంపెనీలు కావాలని అదిరిపోయే లేబుల్స్ పెట్టి, గొప్ప గొప్ప బ్రాండ్ నేమ్స్ చూపించి అధిక ధర వసూలు చేస్తాయని రీసెర్చర్స్ అంటున్నారు!

 

మనిషి సుఖం, దుఃఖం, కష్టం, నష్టం అన్నీ మనసులోనే వుంటాయని మన పూర్వులు ఎప్పుడో చెప్పారు. పాశ్చాత్యులు కూడా అన్ని ఫీలింగ్స్ బ్రెయిన్లోనే వుంటాయని ఒప్పుకుంటారు! కానీ, ఈ తాజా పరిశోధనతో మరో కొత్త విషయం తేలింది! అదేంటంటే… మత్తు వైన్ లో కాదు నిజంగా మెదళ్లలో వుంటుంది! దానికి ఒక్కసారి అధిక ధర వల్ల అద్భుతమైన టేస్ట్ లభిస్తుంది అన్న మత్తు ఎక్కించామంటే… ఇక మంచి నీళ్లు తాగినా మందు తాగినట్టే అనిపిస్తుంది! ఇదే మనసు చేసే మాయ అంటే!