‘కోటరీ’ కిమ్మనలేదేం?

వైసీపీ అధినేత జగన్ కోటరీపై ఆ పార్టీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ తీరు గురించి తెలిసిన వారెవరైనా సరే ఇక విజయసాయిపై వైసీపీ నేతలు విరుచుకుపడతారని భావిస్తారు. ఆయన వ్యక్తిగత విషయాలు సహా పార్టీకి ఆయన ద్రోహం చేశారంటూ మీడియా, సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున కథనాలు వండి వారుస్తారని అంచనా వేశారు.

అయితే అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, కాకాణి, అంబటి వంటి ఇద్దరు ముగ్గురు నేతలు తప్ప అసలు విజయసాయి వ్యాఖ్యలకు కనీసం రిటార్డ్ కూడా ఇవ్వలేదు. మరీ ముఖ్యంగా కోటరీ అంటూ విజయసాయి అన్యాపదేశంగా టార్గెట్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు అయితే పూర్తిగా మౌనం దాల్చారు.   కాకినాడ పోర్టు కేసు మొదలైనప్పుడు విజయసాయి రెడ్డి వైసీపీలో ఉన్నారు. కనుక అదంతా ఓ కట్టుకధ, కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనంటూ అప్పట్లో ట్వీట్ల మీద ట్వీట్లు చేసిన విజయసాయి రెడ్డి ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పేసిన తరువాత  అదే కేసులో  విజయవాడ సీఐడీ పోలీస్ కార్యాలయంలో విచారణకు హాజరై అదే పోర్టు కేసులో కర్త, కర్మ,క్రియ మొత్తం విక్రాంత్ రెడ్డే అని కుండబద్దలు కొట్టేశారు.

అంతే కాదు తన అల్లుడి సోదరుడు, అరబిందో ఫార్మా అధినేత శరత్ చంద్రారెడ్డి తరపున కాకినాడ పోర్టు యజమాని కేవీ రావుతో డీలింగ్ చేశారని వెల్లడించారు. ఇలా చెప్పడం ద్వారా విజయసాయిరెడ్డి ఈ కేసులో అప్రూవర్ గా మారడానికి రెడీ అయిపోయారా అన్న అనుమానాలు వైసీపీలోనే వ్యక్తం అవుతున్నాయి. అలా మారి జగన్ ను ఇరికించేందుకు చూస్తున్నారా అన్న ఆందోళనా వ్యక్తం అవుతోంది.  

అంతే కాదు తొలి సారిగా విజయసాయి  నేరుగా జగన్మోహన్ రెడ్డిపై, ఆయనకు అత్యంత సన్నిహితులపై తీవ్ర ఆరోపణలు చేసినా, విక్రాంత్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖరరెడ్డిల పేర్లు ప్రస్తావించినా వైసీపీ నుంచి కనీస స్థాయి స్పందన లేకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. విజయసాయిని ఇంకా కెలికితే.. జగన్ గుట్టు మొత్తం బయటపడుతుందన్న భయమే ఇందుకు కారణమని, విజయసాయి విషయంలో ఆచితూచి స్పందించాలని జగన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చి ఉంటాయనీ పరిశీలకులు అంటున్నారు. మద్యం కుంభకోణం, కాకినాడ పోర్టు కేసులే కాదు.. జగన్ అక్రమాస్తుల కేసులలో   ఏ-2గా ఉన్న విజయసాయి నోరు విప్పితే మొదటికే మోసం వస్తుందన్న భయం కూడా ఆయనపై వైసీపీయులు విమర్శల దాడికి వెనుకాడటానికి కారణం అని విశ్లేషిస్తున్నారు. విజయసాయి వంటి వ్యక్తితో సై అంటే సై అని తలపడటం కంటే.. ఆయన విమర్శలు, ఆరోపణలపై స్పందించకుండా మౌనం దాల్చడమే మేలని వైసీపీ అధినేత పార్టీ నేతలు, శ్రేణులకు సూచించి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu