బిందెలతో ఉద్యమం

 

పోయిన వర్షాకాలంలో వర్షాలు లేవు. రిజర్వాయర్లలో నీళ్ళ నిల్వలు పెద్దగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎండాకాలంలో తెలంగాణలో నీటి సమస్య... ముఖ్యంగా మంచినీటి సమస్య రాకుండా చూడు దేవుడా అని అందరూ దణ్ణాలు పెట్టుకుంటున్నారు. ఎన్ని దణ్ణాలు పెట్టినా సమస్య మొదలైపోయింది. ఇంకా ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే మంచినీటి కరువు హైదరాబాద్ మహా నగరాన్ని పలకరించేసింది. హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల ప్రాంతలో గత కొన్ని రోజులుగా జనం మంచినీటి కోసం కటకటలాడుతున్నారు. మా గొంతుల్లో కాసిన్ని నీళ్ళు పోయండి మహప్రభో అని అధికారులతో ప్రజలు ఎంత మొత్తుకున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు. పాపం.. వాళ్ళుమాత్రం ఏం చేస్తారు.. నీళ్ళు ఉన్నాయో లేవో! అయితే సహనం కోల్పోయిన ప్రజలు ఇక ఉద్యమంలోకి దిగిపోయారు. భారీ సంఖ్యలో మహిళలు బిందెలు పుచ్చుకుని హైవే మీదకి వచ్చారు. హైవే మీద బైఠాయించారు. తమకు మంచినీటిని ఇస్తే తప్ప ఇక్కడి నుంచి కదిలేది లేదని కరాఖండీగా చెప్పేశారు. వాళ్ళని బలవంతంగా అక్కడి నుంచి తరలించడానికి పోలీసుల తల ప్రాణం తోకకొచ్చింది.