ఢిల్లీ అల్లర్లలో 20కి చేరిన మృతులు.. బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం...

ఢిల్లీలో గత కొన్నిరోజులుగా కొనససాగుతున్న అల్లర్లు అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తున్నా పరిస్ధితి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. మరోవైపు ఢిల్లీ అల్లర్లపై ఉన్నతస్దాయి సమీక్ష నిర్వహించిన కేంద్ర హోంశాఖ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు ఢిల్లీ అల్లర్లకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలే బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ డిమాండ్ చేశారు. అల్లర్లను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమైనప్పుడు సీఆర్పీఎఫ్ బలగాలను ఎందుకు రంగంలోకి దించలేదని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీ అల్లర్లకు నిరసనగా రేపు దేశ రాజధానిలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని సోనియాగాంధీ ప్రకటించారు.

సోనియా వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ప్రకాష్ జవదేవర్ స్పందించారు. ఢిల్లీ అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్రం గట్టి చర్యలు తీసుకుటోందని, ఇప్పటికే అల్లర్లను అదుపులోకి తీసుకురావడంతో పాటు టీవీల్లో రెచ్చగొట్టే కథనాలు, వ్యాఖ్యలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు ఇచ్చామని సమాచార, ప్రసారమంత్రి కూడా అయిన జవదేకర్ వెల్లడించారు. కేంద్రం బాధ్యత వహించాలని కోరుతున్న సోనియాగాందీకీ ఇంత జరుగుతుంటే ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఎక్కడున్నారో కూడా చెప్పాలన్నారు.

మరోవైపు ఢిల్లీ అల్లర్లపై లక్నోలో మాట్లాడిన సోనియా గాంధీ కుమార్తె, కాంగ్రెస్ యువనేత ప్రియాంక గాంధీ.. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ఢిల్లీ అల్లర్లు యూపీకి కూడా విస్తరించే ప్రమాదం ఉందని చెప్పిన ప్రియాంక.. ప్రజలు కీలక సమయంలో విజ్ఞతతో వ్యవహరించి రెచ్చగొట్టే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యూపీకి అల్లర్లు విస్తరించకుండా రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు తగిన చర్యలు తీసుకోవాలని ప్రియాంక డిమాండ్ చేశారు.

హస్తినలో అల్లర్లపై హైదరాబాద్ లో ఏఎన్ఐ వార్తాసంస్ధతో మాట్లాడిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. దీనికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ బాధ్యత వహించాలన్నారు. ఢిల్లీలో అల్లర్లు జరుగుతుంటే పరిస్ధితి చక్కదిద్దాల్సింది పోయి హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో తనపై విమర్శలు చేస్తున్నారని ఓవైసీ విమర్శించారు. ఢిల్లీ పోలీసులు అల్లర్లను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఓవైసీ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా జోక్యం చేసుకుని ఘర్షణలను అదుపుచేయాలన్నారు.

మరోవైపు అల్లర్లు చెలరేగిన ఈశాన్య ఢిల్లీలో పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్రం అవసరమైతే సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది. అల్లర్లు జరిగిన ప్రాంతాల ప్రజల్లో స్ధైర్యం నింపేందుకు ఇవాళ పోలీసులు కవాతు నిర్వహించారు. అదే సమయంలో అంకిత్ శర్మ అనే ఇంటెలిజన్స్ అధికారి మృతదేహం ఓ డ్రైనేజీ సమీపంలో లభ్యం కావడం కలకలం రేపింది. పోలీసులు ఈ ఘటనపైనా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అల్లర్ల సమయంలో విదులు నిర్వహించేందుకు వెళ్లిన అంకిత్ శర్మను ఎవరు హతమార్చి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు సంయమనం పాటించాలని ప్రధాని మోడీ ట్విట్టర్ లో కోరారు.