చారిత్రక కట్టడాల కూల్చివేత బాధాకరం.. అశోక్ గజపతి రాజు ఆవేదన

చరిత్ర ప్రసిద్ధి చెందిన మూడు లాంతర్ల కూడలి చిహ్నాన్ని విజయనగరం నగరపాలక సంస్ధ కూల్చివేసింది. రాజుల కాలం నాటి చారిత్రక కట్టడమైన మూడు లాంతర్ల స్తంభాన్ని మున్సిపల్ యంత్రాంగం కూల్చివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడు ప్రధాన రహదారుల కలిసే చోట నిర్మించిన ఈ లాంతర్ల స్తంభంపై జాతీయ చిహ్నం మూడు సింహాలు ఉంటాయి. రాజుల కాలంలో నిర్మించిన దాని పేరుమీదే ఆ ఏరియా మూడు లాంతర్ల జంక్షన్ గా ప్రసిద్ధి చెందింది. అలాంటి చరిత్ర ఉన్న దానిని కూల్చివేసిన మున్సిపల్ యంత్రాంగం.. ఆ స్థానంలో కొత్త ఆకృతితో మరో కట్టడం పెడతామని చెబుతున్నారు.

కాగా, ఈ ఘటనపై మాజీ కేంద్రమంత్రి, విజయనగర రాజవంశీయులు పూసపాటి అశోకగజపతి రాజు స్పందించారు. చారిత్రక కట్టడాల కూల్చివేత బాధాకరమని అన్నారు. వందల ఏళ్ల క్రితం విజయనగరంలో నిర్మించిన మూడు లాంతర్లు కట్టడం విజయనగరానికి చారిత్రక చిహ్నంగా ఉందని పేర్కొన్నారు. ఆనాటి విజయనగరం వైభవానికి కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి. అందులో గంటస్తంభం, ముడులాంతర్లు, మ్యూజిక్ కళాశాల వంటివి కొన్ని మచ్చు తునకలు అన్నారు. ముడులాంతర్ల వద్ద స్వతంత్ర సమరయోధులు నిర్మించిన మూడు సింహాలు చిహ్నం కి కూడా ఇప్పటి ప్రభుత్వాలు, అధికారులు గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈనాడు రాజ్యాంగ బద్దంగా ప్రమాణం చేసి పదవులు అనుభవిస్తున్న  నాయకులే చారిత్రక చిహ్నాలు ధ్వంసం కి పాల్పడటం దారుణం అన్నారు. ముడులాంతర్ల జంక్షన్ వద్ద హరికథ పితామహుడు అధిబట్ల నారాయణ దాసు హరికదలు చెప్పిన సందర్భాలు ఉన్నాయని, ఎంతో మంది మహానుభావులు ఈ ముడులాంతర్ల కింద కూర్చుని చదువుకున్నారని గుర్తుచేశారు. మన పూర్వికుల గత చరిత్ర ఈ తరానికి ఎన్నో అనుభవాలను, గుర్తింపులను ఇచ్చింది. వాటిని కాపాడుకోలేక పోతున్నందుకు బాధగా ఉందన్నారు. ప్రజలు స్పందించాలి చరిత్రకు, చరిత్ర అనవాళ్లకు జరుగుతున్న నష్టాన్ని అడ్డుకోవాలి అని పిలుపునిచ్చారు. మేము ప్రజాస్వామ్య బద్దంగా పోరాడతాం. ఇది మనందరి భవిష్యత్తు.. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.. ప్రజలు శాంతియుత పద్ధతుల్లో నిరసన తెలియచేయాలని అశోక్ గజపతి రాజు కోరారు.