వైజాగ్ కు మహర్దశ మొదలయినట్లే

 

రాష్ట్రంలో మెట్రో హంగులన్నీ కలిగిన ఏకైక నగరంగా వైజాగ్ వేగంగా ఎదుగుతోంది. ప్రభుత్వం వైజాగ్ నగరాన్ని ఐటీ హబ్ గా అభివృద్ధి చేసి, అక్కడ ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని నిశ్చయించుకొంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆరు నెలలలోగా వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందుకు అన్నివిధాల సహకరించేందుకు ఏషియన్ డెవెలప్మెంట్ బ్యాంకు అంగీకరించింది.

 

అదేవిధంగా వచ్చే ఆరు నెలలోగానే విజయవాడతో బాటు వైజాగ్ నగరంలో కూడా మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే డిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్టు కార్పోరేషన్ చైర్మన్ శ్రీధరన్ న్ను ఏపీ మెట్రో రైల్ ప్రాజెక్టుల ప్రధాన సలహాదారుగా నియమించుకొని, ఆయనకే మెట్రో ప్రాజెక్టు నివేదికలను తయారుచేసే బాధ్యతను కూడా అప్పగిస్తూ ప్రభుత్వం నిన్ననే ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈనెల 15,16 తేదీలలో ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసేందుకు వైజాగ్ కు వస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సహకరిస్తే మెట్రో రైల్ నిర్మాణాన్ని కేవలం మూడేళ్ళలోనే పూర్తి చేయడం తనకు పెద్ద కష్టమయిన పని కాదని ఆయన ఇదివరకే ప్రకటించారు. కనుక ఇక ప్రభుత్వాలదే ఆలశ్యమని చెప్పవచ్చును. రాష్ట్ర ప్రభుత్వం కూడా మెట్రో రైల్ ప్రాజెక్టులు పూర్తి చేసి మంచి పేరు సంపాదించుకోవాలనే చాలా ఆత్రంగా ఉంది కనుక బహుశః వచ్చే ఎన్నికలలోగానే మూడు నగరాలలో మెట్రో రైళ్ళు పరుగులు తీయవచ్చును.

 

ఇక హైదరాబాదులో తెలుగు సినీ పరిశ్రమపై తెలంగాణా ప్రభుత్వం నుండి వస్తున్న ఒత్తిళ్ళ కారణంగా, తక్షణమే కాకపోయినా క్రమంగా ఒకటొకటిగా వైజాగ్ కి తరలి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే వైజాగ్ లో రామానాయుడు సినిమా స్టూడియో నిర్మించడంతో అక్కడ సినీ నిర్మాణ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. చిన్న నిర్మాతల సంఘం అధ్యక్షుడు నట్టి కుమార్ తమకు ప్రభుత్వం వైజాగ్ లో భూములు కేటాయిస్తే, అక్కడే సినీ నిర్మాణానికి అవసరమయిన హంగులు ఏర్పాటు చేసుకొంటామని అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ వైజాగ్ కు రావాలనే కోరుకొంటోంది కనుక బహుశః ఆయన కోరికను మన్నించవచ్చును. ఇంతవరకు కేవలం సినిమా షూటింగులకే పరిమితమయిన వైజాగ్ నగరంలో ఇకపై సినీ నిర్మాణ కార్యక్రమాలు కూడా మొదలయితే ఇక వైజాగ్ లో సందడే సందడి.

 

అదేవిధంగా వైజాగ్ లో ఏదయినా ఒక ఉన్నత విద్యా సంస్థను కూడా ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరొందిన వైజాగ్ నగరంలో అనేక స్టార్ హోటల్స్, పెద్ద షాపింగ్ మాల్స్ తో కళకళ లాడుతోంది. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ నగరాన్ని స్మార్ట్ సిటీగా మలచాలని భావిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా వైజాగ్ లోనే కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. బహుశః ఈ ప్రాజెక్టులన్నీ ఒకటొకటిగా రూపుదాల్చడం మొదలయితే, ఇక వైజాగ్ నగరానికి మహార్ధశ మొదలయినట్లే భావించవచ్చును. ఇకపై వైజాగ్ నగరం హైదరాబాద్ కు దీటుగా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.