భూసమీకరణపై విశాఖలో అగ్గి రాజుకుంది...

ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సంక్షేమం దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది నాటికి ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు అందజేయాలని వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన భూసమీకరణ విశాఖలో అగ్గి రాజేస్తోంది. భూములను స్వాధీనం చేసుకొనేందుకు వెళుతున్న.. రెవెన్యూ యంత్రాంగంపై ప్రజలు తిరగబడుతున్నారు. తాజాగా పెందుర్తి మండల పరిధిలోని పెనగడపలో భూ సమీకరణకు అధికారులు చేసిన ప్రయత్నం అరెస్టులకు దారి తీసింది. 

స్మార్ట్ సిటీ విశాఖ నగరంలో లక్ష అరవై వేల మంది అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులుగా గుర్తించిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు నగర పరిసరాల్లోని 10 మండలాల పరిధిలో 55 గ్రామాల్లో 6,116 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. 1.6 లక్షల మందికి 50 గజాల చొప్పున 3,200 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. అందులో భాగంగా ఎకరాకు యాభై గజాల వంతున యాభై ప్లాట్ లు ఇళ్ల స్థలాలు కేటాయించి మిగిలిన భూమిని డెవలప్ చేయాలనేది అధికారుల ఆలోచన. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ నీటి నిబంధనల మేరకు 30 అడుగుల విస్తీర్ణంలో రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 

ఇదిలా వుంటే డెవలప్ మెంట్ చేసిన భూమిలో 15 శాతం చొప్పున సుమారు 900 నుంచి వెయ్యి ఎకరాలు వీఎంఆర్డీఏ పరిధిలోకి వెళ్లిపోనుంది. ఇక మిగిలిన భూముల్లో లేఅవుట్ల అభివృద్ధి చేసి ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతులకు స్థలాల రూపంలో ఇవ్వనున్నారు. ఇక 10 మండలాల్లో పూలింగ్ ద్వారా సేకరించిన భూములను 59 బ్లాక్ లుగా విభజించనున్నారు. కొన్ని బ్లాకులు పూర్తిగా పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించి మిగిలిన బ్లాకుల్లో రైతులు, వీఎంఆర్డీఏ కు ఇవ్వనున్నారు. ఇదిలా వుంటే భూసేకరణ కింద గుర్తించిన భూముల్లో ఒక్క సెంటు ప్లాట్ ల కోసం అవసరమైన స్థలాల సమీకరణ ఇప్పటికే పూర్తయ్యింది.