ఖాకీకి పంచ్ ఇచ్చిన ఖద్దరు
posted on Apr 2, 2012 7:20AM
విజయనగరం జిల్లాలో ఖద్దరు పంచ్ కు ఖాకీ అధికారి ఒకరు విలవిలలాడుతున్నారు. ఖద్దరు దెబ్బతో దిమ్మతిరిగిన ఒక యువ ఐపీస్ అధికారి గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. పార్వతీపురం ఎఎస్పీగా డాక్టర్ నవీన్ కుమార్ సుమారు మూడు నెలలక్రితం జాయినయ్యారు. ఐపీస్ అధికారి అయిన నవీన్ కుమార్ ఉద్యోగంలో చేరిన వెంటనే వెనకా ముందూ చూడకుండా ప్రజల పక్షాన చేరిపోయాడు. ఖద్దరు దుస్తులు ధరించే రాజకీయ నాయకుల మాటలు వినిపించుకోలేదు. ధర్మల్ విద్యుత్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలపట్ల సానుభూతి చూపించాడు. పవర్ ప్లాంట్ యాజమాన్యంపై నిర్లక్ష్యం చూపాడు.
ఫలితంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి వందరోజులు కాకుండానే బదిలీ వేటుకు గురయ్యాడు. ఉన్నఫలాన అధికార నివాసం ఖాళీచేసి రంపచోడవరం వెళ్ళిపోవలసిందిగా పైఅధికారులు ఆదేశించడంతో డాక్టర్ నవీన్ కుమార్ తీవ్రవత్తిడికి గురయ్యాడు. ఈ ఒత్తిడితో బిపి వచ్చి దానికి ఛాతీ నొప్పి కూడా తోడవ్వడంతో కుప్పకూలిపోయాడు. రంపచోడవరం వెళ్ళాల్సిన ఆ యువ ఐపీస్ అధికారి ఆసుపత్రి చేరుకున్నాడు. డక్కామొక్కీలు తిన్న ఖద్దరునాయాళ్ళతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుందని అనుభవజ్ఞులైన పోలీసు ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు.