నేను రెడీ.. హరీష్ రావు రెడీనా?

 

గజ్వేల్ కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి తెరాస నేత హరీష్ రావుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వంటేరు.. ప్రైవేట్ నంబర్ నుంచి హరీష్ రావు తనకి కాల్ చేసి కేసీఆర్ ని ఓడించమని చెప్పాడని.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో హరీష్ రావు టచ్ లో ఉన్నారని.. త్వరలో కాంగ్రెస్ లో చేరతారని సంచలన వ్యాఖ్యలు చేసిన చేసిన విషయం తెలిసిందే. అయితే వంటేరు మరోసారి హరీష్ రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వంటేరు మాట్లాడుతూ.. హరీష్ రావు తనను చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో తానూ, హరీష్ రావు రెండు సార్లు కలిసి కూర్చొని మాట్లాడుకున్నామంటూ మరో సంచలన వ్యాఖ్య చేశారు. ప్రైవేట్ నంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడిన దానితో సహా అన్నింటికీ ఆధారాలున్నాయన్నారు. హైదరాబాద్‌లోనే తమ భేటీ జరిగిందని.. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆధారాలు చూపిస్తానని వంటేరు అన్నారు. ఆధారాలు కచ్చితంగా అందిస్తానన్నారు. ఏ దేవుడి ముందైనా ఒట్టు వేయడానికి తాను రెడీ.. హరీష్ రావు సిద్ధమా? అని వంటేరు ప్రశ్నించారు. నిజానిజాలు నిలకడమీద బయటపడతాయన్నారు.